breaking news
Paridhaan brand
-
పతంజలి జీన్స్ వచ్చేస్తున్నాయ్..
న్యూఢిల్లీ : ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపేసిన అనంతరం పతంజలి ఆయుర్వేద్ సంస్థ వస్త్ర మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి వరకు ‘పరిధాన్’ పేరుతో క్లాతింగ్(వస్త్ర) బ్రాండ్‌ను లాంచ్ చేయనున్నట్టు పతంజలి ఎండీ, సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ చెప్పారు. వస్త్రాలను ఇన్‌హౌజ్‌లోనే థర్డ్ పార్టీ ద్వారా తయారు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త వ్యాపారాల నిర్వహణ కోసం నోయిడాలో ఓ బృందాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వీటి కోసం ఎక్స్‌క్లూజివ్‌గా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో 100 స్టోర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.పతంజలి పరిధాన్ బ్రాండ్ కింద పిల్లల దుస్తులు, యోగా దుస్తులు, స్పోర్ట్స్‌వేర్, టోపీలు, బూట్లు, టవల్స్, దుప్పట్లు, యాక్ససరీస్ వంటి 3000 రకాల వస్తువులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అంతకముందే యోగా గురువు బాబా రాందేవ్ వెల్లడించారు. వీటిలో ముఖ్యంగా స్వదేశీ జీన్స్ ఉండనున్నట్టు, భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా స్వదేశీ జీన్స్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘జీన్స్ అనేది వెస్టరన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌తో మనం రెండింటిన్నీ అనుసరించవచ్చు. ఒకటి వారిని బాయ్‌కాట్ చేయడం లేదా వాటిని స్వీకరించడం. కానీ దేశీయ సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించలేం ఎందుకంటే జీన్స్ చాలా పాపులర్ అయ్యాయి. దీంతో వెస్టరన్ మాదిరిగా కాకుండా.. పూర్తిగా స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ జీన్స్‌ను తయారుచేస్తున్నాం’ అని బాలకృష్ణ కూడా ఓ సందర్భంలో చెప్పారు. దీంతో ఈ జీన్స్ ఎలా ఉండబోతుందోనని వినియోగదారుల్లో ఆసక్తి మొదలైంది. మొత్తానికి ఏడాది చివర్లోనే ఈ జీన్స్ మార్కెట్లోకి రానున్నట్లు బాలకృష్ణ తాజాగా వెల్లడించారు. -
బాబా 'జీన్స్' కమింగ్ సూన్..
హరిద్వార్ : పతంజలి బ్రాండ్స్‌తో మార్కెట్లో దూసుకెళ్తున్న రాందేవ్ బాబా, బట్టల సామ్రాజ్యాన్ని కూడా స్థాపించనున్నారట. మల్టీ కోర్ "స్వదేశీ" కన్సూమర్ గూడ్స్‌లో బట్టల ఉత్పత్తులను ప్రారంభించనున్నారు. పరిధాన్ పేరుతో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి, జీన్స్, ఆఫీసులకు అనుగుణమైన బట్టలను అందించనున్నారు. అదేవిధంగా గ్లోబల్‌గా కూడా తన సత్తా చాటాలని రాందేవ్ ప్లాన్ చేస్తున్నారు. బంగ్లాదేశ్, ఆఫ్రికాలో మొదట ప్లాంట్లను స్థాపించి, అనంతరం యూరప్, యూఎస్‌లో తన బిజినెస్‌లను విస్తరించనున్నట్టు రాందేవ్ చెబుతున్నారు. పురుషులకు, మహిళలకు ఇద్దరకూ అనువైన బట్టలను తయారుచేయనున్నామని రాందేవ్ తెలిపారు. కేవలం భారతీయ సంప్రదాయ దుస్తులనే కాక, జీన్స్ లాంటి మోడ్రన్ దుస్తులు కూడా తయారుచేయనున్నట్టు ప్రకటించారు. దేశీ జీన్స్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశించబోతున్నామని తెలిపారు. లుథియానాలోని మంచి తయారీదారులు ఉన్నారని, ఇతర చేనేత సెంటర్లు ఈ దుస్తులను డిజైన్ చేయనున్నట్టు చెప్పారు. హరిద్వార్ శివార్లో విశాలమైన ప్రాంగణంలో రాందేవ్ తన స్నేహితుడు ఆచార్య బాలకృష్ణన్‌తో కలిసి ఓ సంస్థను నిర్వర్తిస్తున్నారు. ఇదేమాదిరి బంగ్లాదేశ్‌లో పతంజలి ఉత్పత్తుల తయారీకి మిశ్రమ ప్యాక్టరీని ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే నేపాల్ మార్కెట్లో తాము ప్రవేశించామని, బంగ్లాదేశ్ అనంతరం ఆఫ్రికా మార్కెట్ లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. దేశీయ మార్కెట్ పరిస్థితులతో సరితూగే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదట తమ వ్యాపారాల వృద్ధి చేపడతామని రాందేవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. స్టేజ్2 అనంతరం యూరప్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో బహుళ జాతీయ కంపెనీలతో పోటీకి సిద్ధమవుతామని ప్రకటించారు. హెర్బల్ టూత్ పేస్టులు మొదలుకుని, నూడుల్స్, హెల్త్ డ్రింక్స్ వంటి వివిధ రకాల ఉత్పత్తుల వరకు మొత్తం 800 పైగా ప్రొడక్ట్స్ పతంజలి బ్రాండ్‌పై మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో పాగా వేసుకున్న కంపెనీలకు పతంజలి ఉత్పత్తులు వణుకు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే.