breaking news
palle raghunada reddy
-
మరోసారి బయటపడ్డ టీడీపీ కుట్రలు
-
'అందుకే ఆ ప్రాజెక్ట్‌ల అంచనాలు పెంచాం'
విజయవాడ: హంద్రి-నీవా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే అంచనాలను పెంచామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో 6 వేల కోట్లు అవినీతి జరిగిందనడం అవాస్తమని అన్నారు. బుధవారం వారు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. పనులు వేగవంతం చేసేందుకే గాలేరు- నగరి, బోరకల్లు.. హంద్రి-నీవా ప్రాజెక్టుల అంచనాలు పెంచామని చెప్పారు. ఏపీ కేబినెట్లో రెండు, మూడు సార్లు చర్చించడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని వారు అన్నారు. ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిపై చర్చించారని తెలిపారు. సవరించిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించిందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లను త్వరలో పూర్తి చేస్తామని మంత్రులు పల్లె, దేవినేని ఉమ స్పష్టం చేశారు. -
మంత్రి ఇంటి ఎదుట ఆందోళన
అనంతపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఇంటి ఎదుట సీపీఐ కార్యకర్తలు నిరసనకు దిగారు. మంగళవారం పెద్ద ఎత్తున మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నకార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. ఎచ్‌ఎల్‌సీ ఆధునికరణ పనులు వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్ చేశారు. అనంతరం మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా ఆయన నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు మంత్రి ఇంటి గోడలకు వినతిపత్రం పోస్టర్లను అంటించారు. -
స్మార్ట్ సిటీల సదస్సులో పాల్గొన్న ఏపీ మంత్రి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ నగరంలో యూకే ప్రభుత్వం స్మార్ట్ సిటీలపై నిర్వహించిన సదస్సుల్లో పాల్గొన్నారు. రాష్ర్ట విభజన అనంతరం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను ఆయన వివరించారు. ఈ 3 నగరాల అభివృద్ధికీ తాము కట్టుబడి ఉన్నామని, తిరుపతి, విశాఖపట్నంలను ఐటీ హబ్‌లుగా తయారు చేయడంతో పాటు రాష్ట్రంలో 14 స్మార్ట్‌సిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రం సాయంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. -
ఎప్పుడిస్తారో?
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 32 వేల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి పైగా కార్యాలయాలు, పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కన్పించడం లేదు. రాష్ట్ర విభజన తరువాత సెంట్రర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) కాస్త సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్)గా రూపాంతరం చెందింది. అప్పట్నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. రాష్ట్ర విభజనకు ముందు నుంచి పెద్దసంఖ్యలో రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అనంతపురం, హిందూపురం, కదిరి, గుత్తి, కళ్యాణదుర్గం డివిజన్లలో అధికారికంగా 1,97,986 వ్యవసాయ కనెక్షన్లు, 57 వేల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. రైతులు వేలాది రూపాయలు అప్పులు చేసి కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. నీళ్లు పడిన రైతులు పంటలు పండించుకుందామనుకుంటే వ్యవసాయ కనెక్షన్లు అందని ద్రాక్షగా మారాయి. డీడీలతో పాటు దరఖాస్తు చేస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 32 వేల మంది రైతులు రూ.20 కోట్లకు పైగా డీడీలు చెల్లించి ఏడాదికి పైగా ఎదురుచూస్తున్నారు. 32 వేల కనెక్షన్లు ఇవ్వాలంటే 60 వేల స్తంభాలు, ఏడు వేల ట్రాన్స్ఫార్మర్లు అవసరం. ఏడు వేల కిలోమీటర్ల వైరు (కేబుల్) కూడా కావాలి. నెలకు 600 ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మెటీరియల్ వస్తే కానీ సమస్య నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. దీనికి తోడు జిల్లాలో ఉన్న 57 వేల ట్రాన్స్ఫార్మర్లలో నెలకు 500 దాకా రిపేరీకి వస్తుంటాయి. వీటి స్థానంలో తక్షణం ఇవ్వాల్సి ఉంటుంది. రోలింగ్స్టాకు నుంచి ఇస్తున్నా అవి కూడా మళ్లీ మళ్లీ రిపేరీకి వస్తున్నాయి. దీంతో విద్యుత్‌శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కింద 3-4 వ్యవసాయ కనెక్షన్లు ఉంటే ఓల్టేజీ సమస్య తలెత్తదు. కొన్ని చోట్ల ఐదారు సర్వీసులు ఉండటంతో లోడ్ ఎక్కువై ట్రాన్స్ఫార్మర్లు పదే పదే కాలిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. నెలకు కొత్తగా 600 ట్రాన్స్ఫార్మర్లు సరఫరా కావాల్సి ఉండగా 40-50కు మించడం లేదని వారు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదు. రెండు, మూడేళ్లు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. సమస్య తీవ్రతను జిల్లా అధికారులు ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కన్పించడం లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ట్రాన్స్ఫార్మర్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జూన్ 26న అనంతపురం మార్కెట్‌యార్డులో జరిగిన విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభోత్సవంలో జిల్లా మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి హామీ ఇచ్చారు. రెండు నెలలు గడిచేసరికి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం అంత సులభం కాదనే విషయం మంత్రికి కూడా అర్థమైపోయింది. అందులో భాగంగానే ఆదివారం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుండేదని వ్యాఖ్యానించడం గమనార్హం. కనెక్షన్లు ఎప్పుడిస్తారనే విషయాన్ని విద్యుత్‌శాఖ ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి కూడా చెప్పలేకపోతున్నారు. దీన్నిబట్టి రైతులకు ఎదురుచూపులు తప్పేలా లేవు.