breaking news
om prakash sharma
-
'తుపాకీ ఉంటే కాల్చిపారేసే వాడిని'
న్యూఢిల్లీ: 'నా దగ్గర తుపాకీ ఉంటే కాల్చిపారేసే వాడిని. కన్నతల్లిని తిడితే ఎవరైనా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. నా తల్లిని తిట్టినివాడిని కొట్టకుండా ఉండలేను' అని బీజేపీ ఎమ్మెల్యే ఓంప్రకాశ్ శర్మ అన్నారు. పటియాలా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన ఘర్షణలో సీపీఐ కార్యకర్త అమీఖ్ జమాయ్‌పై శర్మ చేయి చేసుకున్నారు. జమాయ్ ను కిందపడేసి మరీ కొట్టారు. దీనిపై ఆయనను ప్రశ్నించగా దేశానికి వ్యతిరేకంగా ఎవరు నినాదాలు చేసినా కొడతానని ఆయన సమాధానమిచ్చారు. ఎవరైనా తలపై కొడితే ప్రతిస్పందన ఇలాగే ఉంటుందని చెప్పారు. తనపై ముందుగా దాడి చేశారని ఢిల్లీలోని విశ్వాస్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శర్మ తెలిపారు. కాగా, నిన్న జరిగిన దాడిలో తాను కూడా గాయపడ్డానని శర్మ కేసు పెట్టారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారని, తీవ్రమైన గాయాలు కాలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. -
లైఫ్‌లైన్ కాదది...డెత్ లైన్
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ముంబై లైఫ్‌లైన్‌గా భావించే లోకల్ రైళ్లలో రాకపోకలు సాగించేవారిలో ప్రతి ఏడాది సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మంది మృత్యువాతపడుతున్నారు. దాదాపు అదే సంఖ్యలో గాయపడుతున్నారు. వీటిని నివారించడానికి రైల్వే శాఖ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఠాణే జిల్లా రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు, బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఓంప్రకాష్ శర్మ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. 2002-12 మధ్య కాలంలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 39,970 ప్రయాణికులు మరణించారు. ఇంకా 40,526 మంది గాయపడ్డారు. ఇదే కాలంలో పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురై 6,153 మంది చనిపోయారు. 1,886 మంది గాయపడ్డారు. అదేవిధంగా నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి 2,304 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 5,936 మంది గాయపడ్డారు. రైలు, ప్లాట్‌ఫాంల మధ్య చిక్కుకుని 33 మంది చనిపోయారు. 183 మంది గాయపడ్డారు. పట్టింపే లేదు: లోకల్ రైళ్లలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో నగరవాసులతోపాటు ఇతర ప్రాంతాలవారు ప్రయాణిస్తారని, అనేకమంది ప్రమాదాల్లో చనిపోతున్నప్పటికీ రైల్వే శాఖ వారికి సహాయం కోసం ఏమీ చేయడం లేదని ఓంప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికుడు చనిపోతే వారి కుటుంబీకులకు పునరావాసం కల్పించే బాధ్యత రైల్వేదేనన్నారు. రైలు ప్రమాదాల్లో చనిపోతున్న, గాయపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండడంపై రైల్వే ప్రయాణికుల సంఘం... పలు రాజకీయ పార్టీలను నిలదీయడంతో రైల్వే అధికారులు స్టేషన్లలో అంబులెన్స్ సేవలను ప్రారంభించారన్నారు. వైద్యసేవల బాధ్యతను మాత్రం మరిచిపోయారన్నారు. కాగా సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే మార్గాల్లో ప్రతిరోజూ 80 లక్షల మంది ప్రయాణికులు లోకల్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రైల్వేశాఖ ప్రయాణికులకు తగు వసతులు కల్పించడం లేదన్నారు.