breaking news
old temples development
-
శిథిలావస్థలో పురాతన ఆలయాలు
ఝరాసంగంరూరల్(జహీరాబాద్): చరిత్రకు ఆనవాళ్లు పురాతన కట్టడాలు. ఈ పురాతన కట్టడాలతోనే ప్రాంతాలకు, గ్రామాలకు పేర్లు కూడా వచ్చాయి. ఝరాసంగం మండలంలోని అనేక గ్రామాల్లో పురాతన గుళ్లు, గోపురాలు, బురుజులు, కందకాలు, స్వాగత తోరణాలున్నాయి. వందల సంవత్సరాలు క్రితం నిర్మితమైనా ఆయా కట్టడాలపై పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో శిథిలమవుతున్నాయి. మండలంలో అనేకం.. మండలంలో అంతరించిపోతున్న పురాతన కట్టడాలు అనేక చోట్ల ఉన్నాయి. పొట్పల్లి గ్రామ శివారులోని సిద్దేశ్వరాలయం, ఝరాసంగంలో బసవణ్ణ మందిరాలు దాదాపు 400 సంవత్సరాలుకు పైగా చరిత్ర కలిగిన కట్టాడాలు. ఈ కట్టాడాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించి.. ఒక్కో ఆలయ అభివద్ధికి రూ.20 లక్షల చొప్పున నిధులు అవసరమున్నట్లు ప్రతిపాదనలు పంపించారు. ఐదు సంవత్సరాల క్రితం నిధులు మంజూరైనట్టు అధికారులు అప్పట్లో తెలిపినా.. ఇప్పటి వరకు పనులు జరగలేదు. వీటితో పాటు జీర్లపల్లి, కుప్పానగర్, ఏడాకులపల్లి గ్రామాల్లో ఉన్న బురుజులు శిథిలావాస్థకు చేరాయి. మాచునూర్, కృష్ణాపూర్, పొట్పల్లి గ్రామాల్లో ఉన్న కందకాలు, స్వాగత తోరణాలకు సైతం మరమ్మతులు చేయకపోవడంతో కుంగిపోతున్నాయి. కొల్లూర్ రామేశ్వరాలయం కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆదరణకు నోచుకోని కుపేంద్ర పట్టణం ఝరాసంగంలో వెలసిన కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాన్ని చేపట్టిన అప్పటి కుపేంద్ర పట్టణ రాజు కుపేంద్ర భూపాలుడు ఏలిన రాజ్యం ప్రస్తుతం కుప్పానగర్‌గా వెలుగొందుతోంది. ఇప్పటికీ గ్రామ పరిసరాలలో దేవతల విగ్రహాలు, వస్తువులు, కట్టాడాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గతంలో పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ పరిశోధనలు సైతం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. దేవతా మూర్తుల విగ్రహాలు శిథిలమవుతున్నాయి. మరమ్మతులు చేపట్టాలి మండలంలో పలు గ్రామాల్లో ఉన్న పురాతన కట్టడాలను గుర్తించడంతో పాటు వారి పరిరక్షణకు అధికారులు కృషి చేయాలి. కట్టడాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాట చేసి కూలిపోతున్న కట్టడాలను గుర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – నాగేశ్వర్ సజ్జన్ శెట్టి, ఝరాసంగం అభివృద్ధి చేయాలి కొల్లూర్ గ్రామ శివారులో అతి పురాతనమైన రామేశ్వరాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ ఆలయానికి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడం దారుణం. కనుమరుగవుతున్న నాటి సంపదపై అధికారులు దృష్టి పెట్టాలి. – ఉమాకాంత్ పాటిల్, కొల్లూర్‌జిల్లా అధికారులకు నివేదించాం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ పరిధిలోని పురాతన బసవణ్ణ మందిరాన్ని పురవస్తు శాఖ అధికారులు గుర్తించారు. అయితే, ఇప్పటి వరకు అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. ఈ సమస్యపై జిల్లా అధికారులకు తెలియజేసి మండలంలోని పురాతన ఆలయాలు, కట్టడాల అభివృద్ధికి కృషి చేస్తాం. – మోహన్‌రెడ్డి, కేతకీ ఆలయ ఈఓ -
పురాతన ఆలయాల అభివృద్ధికి నిధులు
హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేతలు మనోహరాబాద్ : ఎంతో ప్రాశస్త్యం ఉన్న కూచారం ఆంజనేయస్వామి ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.22.60 లక్షల నిధులు మంజూరు చేయడంపై స్థానిక టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కూచారం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద గ్రామ సర్పంచ్ మజ్జతి విఠల్ యాదవ్, మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వంగ రమేష్‌గౌడ్, మార్కెటింగ్ డైరెక్టర్ మోంగ్యా నాయక్, ఆలయ పూజారి వేణుగోపాల్‌శర్మ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి ,ఆలయాల ప్రగతిని కాంక్షించే సీఎం.. కూచారం గుడికి నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. రామలింగేశ్వర ఆలయానికి 70 లక్షలు తూప్రాన్ : తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ సమీపంలోని రామలింగేశ్వర ఆలయ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.70 లక్షల నిధులు మంజూరు చేసిందని టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి (రాజు) ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి ఆలయం సనాతనమైన దేవాలయమన్నారు. శ్రీరాముడు అరణ్యవాసం వెళ్లిన సందర్భంలో ఈ ఆలయం వద్ద సేదతీరినట్లుగా పురాణాలు ఉన్నాయన్నారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు. ఈ క్రమంలోనే ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.70 లక్షలు మంజూరు చేసిందన్నారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.