శిథిలావస్థలో పురాతన ఆలయాలు

Ancient Temples In Ruins Situation - Sakshi

ఝరాసంగం మండలంలో జీర్ణావస్థలో ఆలయాలు

ప్రాబవం కోల్పోతున్న పురాతన కట్టడాలు, గోపురాలు

పట్టించుకోని పాలకులు

ఝరాసంగంరూరల్‌(జహీరాబాద్‌): చరిత్రకు ఆనవాళ్లు పురాతన కట్టడాలు. ఈ పురాతన కట్టడాలతోనే ప్రాంతాలకు, గ్రామాలకు పేర్లు కూడా వచ్చాయి. ఝరాసంగం మండలంలోని అనేక గ్రామాల్లో పురాతన గుళ్లు, గోపురాలు, బురుజులు, కందకాలు, స్వాగత తోరణాలున్నాయి. వందల సంవత్సరాలు క్రితం నిర్మితమైనా ఆయా కట్టడాలపై పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో శిథిలమవుతున్నాయి.

మండలంలో అనేకం..

మండలంలో అంతరించిపోతున్న పురాతన కట్టడాలు అనేక చోట్ల ఉన్నాయి. పొట్‌పల్లి గ్రామ శివారులోని సిద్దేశ్వరాలయం, ఝరాసంగంలో బసవణ్ణ మందిరాలు దాదాపు 400 సంవత్సరాలుకు పైగా చరిత్ర కలిగిన కట్టాడాలు. ఈ కట్టాడాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించి.. ఒక్కో ఆలయ అభివద్ధికి రూ.20 లక్షల చొప్పున నిధులు అవసరమున్నట్లు ప్రతిపాదనలు పంపించారు.

ఐదు సంవత్సరాల క్రితం నిధులు మంజూరైనట్టు అధికారులు అప్పట్లో తెలిపినా.. ఇప్పటి వరకు పనులు జరగలేదు. వీటితో పాటు జీర్లపల్లి, కుప్పానగర్, ఏడాకులపల్లి గ్రామాల్లో ఉన్న బురుజులు శిథిలావాస్థకు చేరాయి. మాచునూర్, కృష్ణాపూర్, పొట్‌పల్లి గ్రామాల్లో ఉన్న కందకాలు, స్వాగత తోరణాలకు సైతం మరమ్మతులు చేయకపోవడంతో కుంగిపోతున్నాయి. కొల్లూర్‌ రామేశ్వరాలయం కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు.

ఆదరణకు నోచుకోని కుపేంద్ర పట్టణం 

ఝరాసంగంలో వెలసిన కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాన్ని చేపట్టిన అప్పటి కుపేంద్ర పట్టణ రాజు కుపేంద్ర భూపాలుడు ఏలిన రాజ్యం ప్రస్తుతం కుప్పానగర్‌గా వెలుగొందుతోంది. ఇప్పటికీ గ్రామ పరిసరాలలో దేవతల విగ్రహాలు, వస్తువులు, కట్టాడాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గతంలో పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ పరిశోధనలు సైతం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. దేవతా మూర్తుల విగ్రహాలు శిథిలమవుతున్నాయి.

మరమ్మతులు చేపట్టాలి

మండలంలో పలు గ్రామాల్లో ఉన్న పురాతన కట్టడాలను గుర్తించడంతో పాటు వారి పరిరక్షణకు అధికారులు కృషి చేయాలి. కట్టడాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాట చేసి కూలిపోతున్న కట్టడాలను గుర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

– నాగేశ్వర్‌ సజ్జన్‌ శెట్టి, ఝరాసంగం

అభివృద్ధి చేయాలి

కొల్లూర్‌ గ్రామ శివారులో అతి పురాతనమైన రామేశ్వరాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ ఆలయానికి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడం దారుణం. కనుమరుగవుతున్న నాటి సంపదపై అధికారులు దృష్టి పెట్టాలి. 

– ఉమాకాంత్‌ పాటిల్, కొల్లూర్‌జిల్లా

అధికారులకు నివేదించాం

కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ పరిధిలోని పురాతన బసవణ్ణ మందిరాన్ని పురవస్తు శాఖ అధికారులు గుర్తించారు. అయితే, ఇప్పటి వరకు అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. ఈ సమస్యపై జిల్లా అధికారులకు తెలియజేసి మండలంలోని పురాతన ఆలయాలు, కట్టడాల అభివృద్ధికి కృషి చేస్తాం. 

– మోహన్‌రెడ్డి, కేతకీ ఆలయ ఈఓ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top