‘వర్జీనియూ’ రైతుకు రుణమాఫీ లేనట్టేనా ?
జంగారెడ్డిగూడెం : రైతు రుణమాఫీ విషయంలో ఆర్బీఐ బుధవారం తీసుకున్న కొత్త నిర్ణయంతో పొగాకు రైతులకు రుణమాఫీ లేనట్లే అనిపిస్తోంది. ఆర్బీఐ ప్రకటించిన నిర్ణయం ప్రకారం ఖరీఫ్‌కు మాత్రమే రీషెడ్యూల్ చేస్తామని చెప్పడంతో రబీలో పొగాకు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక రుణమాఫీ లేనట్టేనని పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో రబీ సీజన్లో అత్యధికం
ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలో అత్యధికంగా పొగాకు పంటను జిల్లాలో ఏజెన్సీ మెట్ట ప్రాంత రైతులు పండిస్తున్నారు. సాధారణంగా జిల్లాలో వర్జీనియా పంట ఎక్కువగా రబీ సీజన్లోనే వేస్తారు. బ్యాంకులు కూడా అత్యధికంగా వర్జీనియా రైతులకు బ్యారన్‌కు సుమారు రూ.6 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారుు. ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలోని వర్జీనియా పొగాకు నాణ్యమైనదిగా చెబుతారు. దీంతో ఇక్కడ వర్జీనియా పంటను రైతులు అధికంగా పండిస్తున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు పొగాకు బోర్డు ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందిస్తోంది. తాజాగా రిజర్వు బ్యాంకు అధికారులు ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలకు మాత్రమే రీషెడ్యూల్కు అనుమతి ఇవ్వడంతో వర్జీనియా రైతుల రుణమాఫీ ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ఖరీఫ్‌లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు వేస్తారు. వీటికి ఇచ్చే రుణాలు ఎకరాకు సుమారు రూ. 20 వేలు మాత్రమే ఉంటుంది. మొత్తంగా లక్ష రూపాయలకు మించి రుణ సదుపాయం లేదు. దీంతో ఆర్బీఐ బుధవారం తీసుకున్న నిర్ణయంతో ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో వర్జీనియా పంటను నమ్ముకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
30 వేల హెక్టార్లలో సాగు
జిల్లాలో మొత్తం 5 పొగాకు వేలం కేంద్రాల పరిధిలో జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో సుమారు 30 వేల హెక్టార్లలో రైతులు వర్జీనియా పొగాకు పండిస్తున్నారు. వర్జీనియా పొగాకు పంట ద్వారా కేంద్రప్రభుత్వానికి రూ.8 వేల కోట్లు విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. రైతుల వద్ద నుంచి ప్రభుత్వం సెస్ వసూలు చేస్తోంది. దీంతో కేవలం వర్జీనియా పండించే రైతుల వద్ద నుంచే కేంద్రానికి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో సుమారు 13 వేల మంది రైతులు 14 వేల లెసైన్సులు కలిగి ఉన్నారు. ఒక్కొక్క లెసైన్సుకు బ్యాంకులు సుమారు రూ.6 లక్షల వరకు రుణం ఇస్తున్నాయి. అంటే మొత్తం 14 వేల లెసైన్సులకు రూ.840 కోట్లు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి.
ఇప్పటికే రుణాల రీషెడ్యూల్ చేయించుకున్న రైతులు
ఇప్పటికే వర్జీనియా పొగాకు రైతులు గతంలో తీసుకున్న రుణాలకు రీషెడ్యూల్ చేయించుకున్నారు. ఈ రుణాలు తీర్చడానికే రైతులు సతమతమవుతున్నారు. రీషెడ్యూల్ భారం ప్రతి రైతుకు రుణం తీరే నాటికి సుమారు 24 శాతం వడ్డీ పడనున్నట్లు ఒక అంచనా. గత సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని పంటలు పండించిన రైతుకు ప్రస్తుతం గిట్టుబాటు ధరలేక వచ్చిన రేటుకు అమ్ముకుని నష్టపోతున్నారు. కొంతమంది రైతులు మంచి రేటు వస్తుందనే ఆశతో ఇంకా పంటను తమ వద్దే ఉంచుకుంటున్నారు. ఇలా 40 శాతం వరకు పంట రైతుల వద్దే ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటువంటి సమయంలో రైతులకు ఇస్తానన్న రుణమాఫీని, రీషెడ్యూల్ పేరిట మోసం చేయడమే కాక, కేవలం ఖరీఫ్‌కే రుణమాఫీ జరుగుతుందని ప్రకటించడం రైతుల వెన్నుపై రుణాల గుదిబండను మోపడమే పలువురు పేర్కొంటున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడు దేవరపల్లి, జంగారెడ్డిగూడెం బహిరంగ సభల్లో వర్జీనియా రైతులకు కూడా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో వర్జీనియా పొగాకును పండించే 13 వేల మంది రైతులతో పాటు, వర్జీనియా పంటపై ఆధారపడిన ఇతర వర్గాలవారు 40 వేల మంది జీవిస్తున్నారు. ప్రస్తుత నిర్ణయంతో రైతుతో పాటు వీరికి ఆర్థిక భద్రత లేకుండా పోతోందని పొగాకు రైతులు కరాటం రెడ్డినాయుడు, ఉద్దండం ఏసుబాబు, సయ్యద్‌బాజీ తీవ్రంగా విమర్శిస్తున్నారు.