breaking news
nimbus clouds
-
Thunderstorm: పిడుగులు పడతాయ్.. జాగ్రత్త!
సాక్షి, అమరావతి: వచ్చే వారం రోజులు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే పదిరోజులుగా పిడుగుల ప్రభావం చాలాచోట్ల కనిపిస్తోంది. అది ఇంకా పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. నిట్టనిలువుగా ఉండే ఈ మేఘాల వల్ల పిడుగులు పడుతున్నాయి. ప్రధానంగా విశాఖ మన్యం, నల్లమల అటవీ ప్రాంతాలు, ఈ సమీప గ్రామాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నట్లు గుర్తించారు. అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి. సాధారణంగా ఏటా ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలో ఈ వాతావరణం ఉండి ఇలా జరుగుతోంది. క్యుములోనింబస్ మేఘాల వల్ల ఒకచోట వేడిగాలులు, మరోచోట చల్లటి గాలులు వీచి వర్షాలతో పిడుగులు పడుతున్నాయి. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఇప్పటివరకు 10 మందికిపైగా పిడుగుపాటుకు గురయ్యారు. చెట్ల కిందకు వెళ్లొద్దు పిడుగుల ప్రభావం 90 శాతం రైతులు, కూలీలు, పశువుల కాపరులపై ఉంటోంది. పొలాలు, ఆరుబయట పచ్చిక బయళ్లలో ఉండే వీళ్లు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకు వెళుతున్నారు. అలా వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల చెట్లపై పిడుగులు పడి వాటి కింద ఉన్న వారు మృత్యువాతపడుతున్నారు. మూడురోజుల కిందట శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు చనిపోయిన ముగ్గురు వ్యక్తులు చెట్లకింద ఉన్నవారేనని గుర్తించారు. పిడుగు ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే చెట్ల కిందకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. ఉన్నచోటే కింద కూర్చుని చెవులు మూసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే దగ్గర్లో ఉన్న భవనాలు, రేకుల షెడ్లు వంటి వాటిల్లోకి వెళితే పిడుగుల ప్రభావం ఉండదని చెబుతోంది. విపత్తుల నిర్వహణశాఖ పిడుగుల సమాచారాన్ని నాలుగు నిమిషాల ముందే ఆయా ప్రాంతాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు, తహశీల్దార్లు, వీఆర్వోలకు పంపుతోంది. ఇందుకోసం అమెరికాలోని ఎర్త్‌నెట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అక్కడినుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి పిడుగుల హెచ్చరికలు జారీచేస్తోంది. అయినా దీనిపై రైతులు, కూలీలు, గొర్రెల కాపరులకు అవగాహన లేకపోవడం వల్ల మృత్యువాతపడుతున్నారు. వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ సూచిస్తోంది. -
రేపటి నుంచి మూడ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8 నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా వరకు అల్పపీడన ద్రోణి నెలకొని ఉందని, దీనివల్ల క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటిం చింది. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో 7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. భువనగిరి, శంషాబాద్, గాండీడ్లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. చేవెళ్ల, మహేశ్వరం, కొందుర్గులలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.