breaking news
newborn child
-
మట్టిలో నుంచి పసిబిడ్డ ఏడుపు.. తవ్వి చూస్తే..!!
భోపాల్: మూడు రోజుల పసికందును బతికుండగానే పాతిపెట్టడానికి ఆ తల్లిదండ్రులకు మనసెలా వచ్చిందో! ఐతే విధి చిన్నచూపు చూసినా మృత్యువును జయించి మరీ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ పసికూన. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో బతికున్న మూడురోజున పసిబిడ్డను నది ఒడ్డున మట్టిలో పాతిపెట్టిన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. గురువారం సాయంత్రం ఝంగర్చక్ గ్రామ సమీప పొలాల్లో పనులు చేసుకునే కొందరు గ్రామస్థులకు పసిబిడ్డ ఏడుపు వినిపించిన ప్రదేశానికి వెళ్లారు. కొంతసమయానికి బిడ్డ ఏడుపు మట్టికింద నుంచి రావడాన్ని గమనించి, మట్టిని జాగ్రత్తగా తొలగించించారు. అనంతరం కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్యర్యపోయారు. కేవలం రోజుల వయసున్న నవజాత శిశువును ఒక సంచిలో చుట్టి బతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టారు. దీంతో వారు బిడ్డను రక్షించి ముంగావలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తం చేర్పించారు. శిశువును పరీక్షించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించారు. ఈ సంఘటనపై సెక్షన్ 317 కింద కేసు ఫైల్చేసి నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సతీష్ గార్గ్ మీడియాకు వెల్లడించారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! -
నిర్లక్ష్యమే నిప్పంటించింది
మొక్కుబడి తనిఖీలు, ముఖస్తుతి నివేదికలు మహారాష్ట్రలోని ప్రభుత్వాసుపత్రిలో శనివారం పదిమంది పసివాళ్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. వారంతా నవజాత శిశువులు. ఇంకా పూర్తిగా కళ్లు తెరవకుండానే కన్నుమూసిన అభాగ్యులు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులకూ, నెలలు నిండాకుండా పుట్టినవారికీ ప్రత్యేక వైద్యం అందించేందుకు ఉద్దేశించిన యూనిట్లో హఠాత్తుగా నిప్పురవ్వ రాజుకుని వీరందరి ప్రాణాలూ తీసింది. ఇందులో ముగ్గురు అగ్నికీలల్లో దహనమైపోగా, మరో ఏడుగురు ఆ గదిలో దట్టంగా వ్యాపించిన పొగ కారణంగా ఊపిరాడక మరణించారు. ఈ శిశువుల్లో పుట్టి 24 గంటలు కూడా గడవనివారు మొదలుకొని మూడు నెలల వయసువారి వరకూ వున్నారు. ముగ్గురు శిశువులు తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ మరో ఏడుగురు శిశువులను కాపాడగలిగారు. ఆ రాష్ట్రంలోని భండారా జిల్లా ప్రధానాసుపత్రిలో అర్థరాత్రి జరిగిన ఈ విషాదం ఆసుపత్రుల నిర్వహణ తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. దేశంలో ప్రభుత్వాసు పత్రులన్నిటా నిర్ణీతకాలంలో తనిఖీలుంటాయి. వైద్య చికిత్సకు ఉపయోగపడే ఉపకరణాల్లో చాలా భాగం విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయి. కనుక వాటి పనితీరును, విద్యుత్ ఉపకరణాల నాణ్యత వగైరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, సరిచేస్తుండాలి. వాస్తవానికి మొన్న సెప్టెంబర్‌లో అలాంటి తనిఖీ జరిగినట్టు, అంతా సవ్యంగానే వున్నట్టు రికార్డులు కూడా చెబుతున్నాయి. కానీ మూడు నెలలు గడిచేసరికి ఆ ఉపకరణాలే కాటేశాయి. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిన సమయానికి ఆ ప్రత్యేక వార్డులో వైద్యులుగానీ, నర్సులుగానీ లేకుండా పోయారు. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు దాటుతున్నా మన ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పరమ నాసిరకంగా వుంటున్నాయి. పౌరులు మంచి ఆరోగ్యంతో వుంటే కుటుంబాలు సుఖ సంతోషాలతో విలసిల్లుతాయి. ఉత్పాదకత పెరుగుతుంది. సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. వీటివల్ల ఆర్థిక వ్యవస్థకు జరిగే మేలు అంతా ఇంతా కాదు. కానీ మన దేశంలో ప్రజారోగ్యరంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. సామాజిక, ఆర్థిక, వ్యవస్థీకృత వివక్షలతో మెజారిటీ పౌరులకు నాణ్యమైన వైద్యం అందకుండా పోతోంది. ఎంతో కొంత మెరుగైన వైద్య సేవలు లభిస్తాయన్న రాష్ట్రాల్లో సైతం ఆ సౌకర్యాలు సమాన స్థాయిలో లేవు. ఫలితంగా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు ఆదరా బాదరాగా నగరాలకో, పట్టణాలకో పరుగెత్తడం తప్పనిసరవుతోంది. ప్రైవేటు వైద్య రంగం ఎటూ సామాన్యులకు అందుబాటులో వుండదు. ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో తగినంతమంది వైద్య సిబ్బంది లేకపోవటం, సౌకర్యాలు కొరవడటం రివాజుగా మారింది. ప్రభుత్వాలు అసలు చేయడం లేదని కాదు. కానీ అవి ఏమాత్రం చాలటం లేదు. మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో మొత్తంగా ఆరోగ్య సేవలకు చేస్తున్న వ్యయం 4 శాతం. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా దాదాపు ఒకటిన్నర శాతంగా వుండగా మిగిలిందంతా ప్రజానీకం చేస్తున్న ఖర్చే. వారు అప్పో సప్పో చేసి తెచ్చిన డబ్బును వైద్యానికి వెచ్చిస్తున్నారు. గత్యంతరం లేని స్థితిలో వున్నవారు మాత్రం ప్రభుత్వా సుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు భండారా జిల్లా ఆసుపత్రిలో మంచి ఉపకరణాలే వున్నాయి. నవజాత శిశువుల ఆరోగ్యం సంరక్షణ కోసం అక్కడ ప్రత్యేక యూనిట్ కూడా వుంది. కానీ ఆచరణలోకొచ్చేసరికి ఏమైంది? ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఆ ఆసుపత్రిని ఆశ్రయించిన నిరుపేదలు కోలుకోలేని విషాదంలో చిక్కుకున్నారు. ఐసీయూలో చేర్చిన నవజాత శిశువులు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వుండటం వల్ల త్వరలోనే పూర్తిగా కోలుకొని మళ్లీ తమ పొత్తిళ్లలోకి చేరతారని తల్లులంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన వేళ ఆసుపత్రి సిబ్బంది వారికి ఈ పిడుగులాంటి వార్త చెప్పారు. మెరుగైన వైద్య ఉపకరణాలు వుంటేనే సరిపోదు, వాటి నిర్వహణ కూడా మెరుగ్గా వుండాలి. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లోపాలు తలెత్తినప్పుడు వెనువెంటనే సరఫరా నిలిచిపోయే వ్యవస్థ, అలారంవంటివి వుండాలి. సిబ్బంది నిరంతర పర్యవేక్షణ వుండాలి. భండారా జిల్లా ఆసుపత్రిలో ఇవి గల్లంతయ్యాయి. అలాగే భారీ భవంతుల్లో, ప్రత్యేకించి ఆసు పత్రుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలున్నాయి. ఆసుపత్రుల్లో ఉపయోగించే ఆక్సిజెన్ సిలెండర్లు ఏసీ యంత్రాలకు బాగా దూరంగా వుంచాలన్న నియమం వుంది. షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, ఏసీ యంత్రంలో నిప్పురవ్వ రాజుకుని ఇంత ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే సెప్టెంబర్‌లో ఆ ఆసుపత్రిలో జరిగిన భద్రతా ఆడిటింగ్ మొక్కుబడిగా ముగిసిందని అర్థమవుతుంది. యూనిట్ నుంచి పొగ లొస్తున్నాయని ఒక నర్స్ గమనించి చెప్పేవరకూ ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాతైనా అగ్నిమాపక సిబ్బంది రంగ ప్రవేశం చేసేవరకూ ప్రమాదంలో చిక్కుకున్నవారి దగ్గరకు ఎవరూ వెళ్లలేక పోయారు. ప్రమాదాలు జరిగినప్పుడల్లా వేస్తున్న కమిటీలు చురుగ్గా కదిలి వెనువెంటనే కారణాలు రాబట్టగలిగితే, బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటే మిగిలినవారికి హెచ్చరికగా వుంటుంది. ఆసుపత్రి యాజమాన్యాలు, సిబ్బందిపైన మాత్రమే కాదు... బిల్డర్‌తో మొదలుపెట్టి అనుమతు లిచ్చిన స్థానిక సంస్థల అధికారులు, ఆడిటింగ్ జరిపే అధికారులు వగైరాల వరకూ అందరిపైనా చర్యలుండాలి. అప్పుడే అన్ని స్థాయిల్లో అందరూ సమర్థవంతంగా పనిచేస్తారు. ప్రపంచంలో ఏటా జరిగే అయిదు తీవ్ర అగ్ని ప్రమాదాల్లో ఒకటి మన దేశంలో సంభవిస్తున్నదని మూడేళ్లక్రితం వెలువడిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. అందువల్లే కఠినంగా వ్యవహరించటం అవసరం. కరోనా మహమ్మారి వంటి ప్రమాదకర రోగాలు పౌరుల్ని చుట్టుముడుతున్న వర్తమానంలో ఆసు పత్రుల్లో తీసుకునే భద్రతా చర్యల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. -
కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి
సాక్షి, నాగర్‌కర్నూల్ : వైద్యుల నిర్లక్ష్యంతో మగశిశువు మృతి చెందిన సంఘటన జిల్లా ప్రాంతీయ అస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ మండలంలోని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన శివమ్మ అనే గర్భిణికి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సోమవారం తెల్లవారుజామున 5:30 గం.ల సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి సాధారణ కాన్పు జరుగుతుందని భరోసా కల్పించారు. శివమ్మకు సాయంత్రం నొప్పులు అధికమవడంతో ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం వల్ల నర్సులు ఆమెకు కాన్పు చేశారు. ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. నర్సులు కాన్పు సరిగ్గా చేయక పోవడంతో పుట్టిన శిశివు కాన్పు అయిన వెంటనే మరణించినట్లు బంధువులు తెలిపారు. దీంతో బాధితులు ఆస్పత్రి ఆవరణలో వైద్యులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
భర్త మరణించిన బాలింతకు.. సుష్మా ఆపన్నహస్తం
ఒకవైపు గుండెపోటుతో భర్త చనిపోయి పుట్టెడు దుఃఖం.. మరోవైపు కూతురు పుట్టిన ఆనందం.. ఇంకోవైపు.. తిరిగి భారతదేశానికి ఎలా రావాలో తెలియక ఆందోళన. ఇలాంటి కష్టాల్లో ఉన్న భారతీయ మహిళను ఆదుకోడానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ముందుకొచ్చారు. అమెరికాలో ఉంటున్న దీపికా పాండే భర్త హరిఓం పాండే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఆయన బోస్టన్‌లో అక్టోబర్ 19వ తేదీన గుండెపోటుతో మరణించారు. అప్పటికే నెలలు నిండిన ఆమెను, నాలుగేళ్ల కొడుకును కుటుంబ స్నేహితులు మెరుగైన వైద్యసేవల కోసం న్యూజెర్సీకి తీసుకెళ్లారు. అక్కడి ఆస్పత్రిలో ఆమెకు కూతురు పుట్టింది. ఉత్తరప్రదేశ్‌లో ఉండే తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలంటే పుట్టిన బిడ్డకు తండ్రి జీవించి లేరు కాబట్టి పాస్‌పోర్టు రావడం కష్టం. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ సుష్మాస్వరాజ్‌కు ట్విట్టర్ ద్వారా వివరించింది. దాంతో వెంటనే స్పందించిన సుష్మా.. కష్టకాలంలో ఉన్న దీపికకు వీలైన అన్ని రకాలుగా తాను సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి ఈ మేరకు సమాచారం ఇచ్చామన్నారు. దీపికకు బోస్టన్‌లో ఇన్సూరెన్స్ ఉన్నా, అది న్యూజెర్సీలో చెల్లుబాటు కాదు కాబట్టి అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం కలిగించాలని కూడా దీపిక కుటుంబ సభ్యులు సుష్మాస్వరాజ్‌ను కోరారు. పుట్టిన బిడ్డకు వీలైనంత త్వరగా పాస్‌పోర్టు ఇప్పిస్తే, తమ కూతురిని, మనవడిని, మనవరాలిని సొంత దేశానికి రప్పించుకుంటామన్నారు. అలాగే పుట్టిన బిడ్డకు ఓవర్సీస్ ఇండియన్ కార్డు కూడా కావాలని, ఇవన్నీ ఉంటే తప్ప భారతదేశంలోకి ఆ బిడ్డ అడుగుపెట్టడానికి వీలుండదని తెలిపారు. Deepika - We are with you in this hour of tragedy. I have asked @IndianEmbassyUS to help you. @BJPLucknowBJP @templetree1 — Sushma Swaraj (@SushmaSwaraj) 9 November 2016