breaking news
nakshathram
-
ఆ కామెంట్స్‌కి సమాధానమే నక్షత్రం
‘‘నన్ను తిట్టినా తీసుకుంటా... పొగిడినా తీసుకుంటా.. తిడితే నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకుంటా. పొగిడితే నేను చేసింది నచ్చిందనుకుంటా. నాకు ఎవరి మీదా కోపం ఉండదు’’ అన్నారు కృష్ణవంశీ. గులాబి, నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం... ఒకదానికి ఒకటి పోలిక పెట్టలేని సినిమాలు తీసిన క్రియేటివ్ డైరెక్టర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘నక్షత్రం’. కె. శ్రీనివాసులు, సజ్జు, ఎస్. వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా కృష్ణవంశీతో జరిపిన ‘స్పెషల్ టాక్’. ⇒ ‘నక్షత్రం’ ఆడియో ఫంక్షన్లో ‘ఈ సినిమా డిజప్పాయింట్ చేయదు’ అన్నారు. సినిమా మీద బాగా నమ్మకం పెట్టుకున్నారని అర్థమవుతోంది... ♦ అవును. నేను పూర్తిగా సంతృప్తి చెంది చాలా ఏళ్లైంది. షాట్ లేదా సీన్ వర్కౌట్ అయ్యిందా? లేదా? అన్నది నాకే కాదు ఏ డైరెక్టర్‌కి అయినా షూట్ చేస్తున్నప్పుడో, ఎడిట్ చేస్తున్నప్పుడో తెలుస్తుంది. మిక్సింగ్ చేస్తున్నప్పుడు క్లియర్‌గా తెలుస్తుంది. ఈ సినిమా బాగా వచ్చింది. రేసీ యాక్షన్ థ్రిల్లర్. ఇన్నేళ్ల నా అనుభవంలో చిన్న జడ్జిమెంట్ వస్తుంది కదా. ⇒ ఇంతకుముందు తీసిన ఏ సినిమాకి మీకింత నమ్మకం కలిగింది? ♦ ఖడ్గం’ తీసినప్పుడు కలిగింది. గులాబీ, సముద్రం, ఖడ్గం... ఈ మూడు ఒక జోనర్ సినిమాలు. థ్రిల్, యాక్షన్, ఒక హీటెడ్ పాయింట్, రొమాన్స్... ఇలా అన్నీ ఉంటాయి. ‘ఖడ్గం’ ఒక నేషనల్ ప్రాబ్లమ్. ‘నక్షత్రం’ నేషన్స్ ప్రాబ్లమ్. ‘ఖడ్గం’లో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్లలేదు. ‘నక్షత్రం’ కంప్లీట్‌గా సోసైటీ నుంచి పోలీస్‌ను చూపే సినిమా. పోలీసులు సొసైటీని ఎలా చూస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి సొసైటీ ఎలా కనపడతుంది అన్నదే ‘నక్షత్రం’. మంచి సోషల్ కాన్సెప్ట్ ఉన్న కమర్షియల్ మూవీ. ⇒ ‘నక్షత్రం’లో పోలీస్‌ని నెగటివ్‌గా చూపించారా? ♦ తెలుగు సినిమాల్లో పోలీసులంటే జోకర్ లానో, విలన్లుగా పోలీసులంటే రాక్షసుల్లానో ఇంకోలానో డీల్ చేస్తున్నారు. పోలీస్ క్యారెక్టర్ని యూనిఫామ్ వేసుకున్న ఎంటర్టైనింగ్ క్యారెక్టర్‌గా డీల్ చేస్తున్నారు. కానీ, స్క్రీన్ మీద నిజమైన పోలీసును చూడలేకపోతున్నాం. ఇండియాలో పోలీసులను నిజంగా చూపించిన సినిమా ‘అర్థసత్య’. అసలు పోలీస్ వ్యవస్థ అంటే ఏంటి? మన కోసం మన భద్రత కోసం, మన రక్షణ కోసం మనం మన రాజ్యాంగం ద్వారా పెట్టకుని మన ట్యాక్స్లద్వారా వచ్చే డబ్బుతో పోషించుకుంటున్న ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఒక కానిస్టేబుల్ నుంచి కమీషనర్ వరకు ఎవర్ని చూసినా మనకెందుకు భయం? కోపం? చికాకు? పోలీసుల్ని చూసి మనం ఎందుకు ఇన్‌సెక్యూర్‌గా ఉంటున్నాం? ఎవరో కొందరు పోలీసులు అవినీతిని చూసి అందర్నీ అలా ఊహించుకోవడం తప్పు. లేకపోతే మనం ఏదైనా తప్పుచేస్తే ఎక్కడ పట్టుకుంటాడోనని ఫీలవుతున్నామా? ఏదేమైనా గొలుసు దొంగతనం నుంచి ఇంటర్నేషనల్ క్రైమ్ వరకు డీల్ చేసేది పోలీసులే. ఇంకో సిస్టమ్ లేదు. ఇంతా చేస్తూ కూడా ప్రజలతో తిట్లు తింటూ చేస్తున్న థ్యాంక్స్లెస్ జాబ్ అండీ పోలీసులది. ఇదే విషయాన్ని ఈ సినిమాలో కమిషనర్‌గా యాక్ట్ చేసిన ప్రకాశ్‌రాజ్‌గారితో చెప్పించాను. ⇒ సినిమా లేట్ అయినందుకు నిరుత్సాహం... ♦ నిరూత్సాహపడ్డ మాట వాస్తమే. నోట్ల రద్దు, ఆ తర్వాత డేట్స్ కుదరకపోవడం వంటి రకరకాల సమస్యలున్నాయి. కానీ, అలస్యం కావడం వల్ల సినిమా క్వాలిటీ బాగా వచ్చింది. ∙ఇక స్పీడ్‌గా సినిమాలు చేస్తారా? ♦ మన చేతుల్లో లేదది. నేను 250 ఏళ్లు బతుకుతానని, అమెరికా ప్రెసిడెంట్ అవుతా నని, దుబాయ్‌లోని బూర్జ్ ఖలిఫాలో నాలుగు ఫ్లోర్లు కొనుకుంటానని అనుకుంటే జరుగుతుం దా? మణిరత్నంగారిలా ఓ సినిమా తీయాలని, బాపుగారిలా ఓ పాట తీయాలని కోరికలున్నా యి. అయితే.. ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందట’ అని ఓ సామెత. స్వర్గానికి ఎగిరితే కనీసం ఉట్టి అయినా దొరుకుతుంద నేది నా పాలసీ. అదే ఉట్టికి ఎగిరాం అనుకోండి కనీసం కదలను కూడా కదలం. డ్రీమ్ బిగ్! ⇒ ప్రస్తుతం రాష్ట్రాన్ని వణికిస్తున్న డ్రగ్స్ ఇష్యూ మీద సినిమా తీసే ఆలోచన ఉందా? ♦ డ్రగ్స్ అనేది చాలా డేంజరెస్ థింగ్. నా ‘డేంజర్’ సినిమాలోనే ఈ పాయింట్‌ని టచ్ చేశాను. ‘నక్షత్రం’ లోనూ టచ్ చేశాం. అయినా డ్రగ్స్ ప్రాబ్లమ్ ఇప్పటిది కాదు. 20 ఏళ్ల నుంచి ఉంది. కానీ, మీడియా మాత్రం వెకిలితనంగా, పరిణితి లేకుండా బిహేవ్ చేస్తోందని నా అభిప్రాయం. ఇలా ఎందుకు అంటున్నానంటే పూరీ, సుబ్బారాజ్ కారు దిగి, ‘సిట్’ కార్యాలయం లోపలికి వెళితే, దాన్ని పదే పదే చూపిస్తారు. ‘మత్తులో తూగుతున్న టాలీవుడ్’ అనే ట్యాగ్. అయినా వాళ్ల నుంచి సమాచారం తెలుసుకోవడానికి పిలిచారు కానీ, వాళ్లు నిందితులని నిర్థారణ కాలేదు కదా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఎవరిదో ఒక ఫోన్ దొరికితే ఆ ఫోన్లో కొన్ని నంబర్లు ఉన్నాయి. అంతే. ⇒ మీడియా తన పని తాను చేయాలి కదా.. ♦ నిజమే. నోటీసులు అందుకున్న 12 మంది డ్రగ్స్ వాడుతున్నారో లేదో ఎవరికీ తెలియదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు తేల్చి చెప్పలేదు. లీకైన న్యూస్ అన్నారు.‘లీక్ న్యూస్’ అంటేనే చట్టరీత్యా కాదు. అలాంటప్పుడు ఆ న్యూస్‌ను టెలికాస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ⇒ మీరు, పూరి, రవితేజ... ఒకే కాంపౌండ్. మీకు నోటీసులు రాలేదెందుకని? ♦ (నవ్వుతూ) పెద్ద స్థాయిలో మ్యానేజ్ చేశా. మేమంతా ఒకే కాంపౌండ్ నుంచి వచ్చినవాళ్లం. తర్వాత సపరేట్ దుకాణాలు పెట్టుకున్నాం. నోటీసు నాకు రాలేదంటే ఏం చెప్పాలి? నా పేరు లేనందుకు డిజప్పాయింట్ చేసినట్లున్నా. ⇒ ఇప్పుడు ఎవరి గురించైనా ఎవరైనా ఈజీగా కామెంట్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది.. ఉదాహరణకు మీ సినిమా లేట్ అయినందుకు ‘కృష్ణవంశీ పని అయిపోయింది’ అంటున్నారు... ♦ నన్నెవరైనా కామెంట్ చేస్తే కోపం రాదు. ఎందుకంటే గతంలో నేను తీసిన సినిమాను అతనే మెచ్చుకొని ఉండవచ్చు. ఈరోజు అతను నన్ను విమర్శిస్తున్నాడంటే నాలో అతనికి ఏదో నచ్చడం లేదు. రియాక్షన్ అందరికీ ఒకేలా వస్తుంది. కానీ ఎక్స్‌ప్రెస్ చేయడంలోనే తేడా ఉంటుంది. ఎవరైనా మన మీద ఒపీనియన్‌ను వాడి స్థాయిని బట్టి చెబుతాడు కానీ మన స్థాయి బట్టి చెప్పడు. రోడ్డు మీద తిరిగేవాడైతే అతని భాషలో చెబుతాడు. పండితుడు పండితునిలా, పూజారి పూజారిలా చెబుతాడు. 600 కోట్ల జనాభాలో మనల్ని పట్టించుకుని, మనకు టైమ్ కేటాయిస్తున్నాడంటే మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడని అర్థం. సినిమా అనేది పబ్లిక్ ఫీల్డ్. ఎంటర్టైన్మెంట్ ఇవ్వనప్పుడు అంటాడు. వాటన్నింటికీ సమాధానమే ‘నక్షత్రం’. నేను మళ్లీ హిట్టిస్తే ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనో, ‘లయన్ ఈజ్ బ్యాక్’ అనో అంటాడు. అందుకే తిట్టినా తీసుకుంటా. పొగిడినా తీసుకుంటా. ⇒ బ్యాలెన్డ్స్‌గా ఉంటారన్న మాట. మరి... సక్సెస్, ఫెయిల్యూర్ని ఇంతే బ్యాలెన్డ్స్‌గా తీసుకుంటారా? ♦ ఆ రెండూ అంటని స్థితిలోకి నేను వచ్చాను. ‘సింధూరం’ ఫ్లాపయినప్పుడు బాగా ఏడ్చా. ఆ తర్వాత అర్థమైంది. మరీ ఎక్కువగా ఫీల్ అవుతున్నానని. అప్పటినుంచి ఈ గోల నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోతే మనకు ఏదీ అంటదని ఫిక్స్ అయ్యాను. ⇒ డిస్కనెక్ట్ కావడం అంత ఈజీయా? ♦ కాదు. సీతారామ శాస్త్రి, రాంగోపాల్ వర్మ వంటి వాళ్ల సాంగత్యం, జన్మత వచ్చిన ఒక సంస్కారం, పూర్వ జన్మ నుంచి వచ్చిన చిప్... ఇలా రకరకాలు ఉంటాయి. లైఫ్ జర్నీలో నాకు ఎదురైన మనుషులు, పరిస్థితులు, ఇప్పుడు నాకు 55 ఏళ్లు. అంటే ఎన్ని అనుభవాలను చూసి ఉంటాను. ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాను. అందుకే డిస్కనెక్ట్ కాగలిగాను. ⇒ ఫైనల్లీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్? ♦ ‘నక్షత్రం’ హిట్టవుతుందని అనుకుంటున్నా. ఏడాదిగా మోస్తున్నాను కదా. ముందు ఒక వారం రోజులు హాయిగా పడుకోవాలి. ఆ తర్వాత నా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను. మనది గొప్ప కంట్రీ. అల్లూరి సీతారామరాజు, గాంధీగారు, సర్థార్ వల్లభాయ్‌పటేల్ లాంటి మహనీయులు పుట్టిన దేశం మనది. గాంధీగారి తర్వాత అలాంటి మనిషే దేశంలో పుట్టలేదు. సక్సెస్‌ఫుల్‌గా బ్రిటిష్వాళ్లని వెళ్లగొట్టిన దేశం మనది. అలాంటి గొప్ప దేశంలో ఇప్పుడు ఎలాంటి వారు ఉన్నారు? ఆ స్పార్క్‌ను చెప్పడానికి ప్రతి సినిమాలో ట్రై చేస్తుంటాను. అలాగే ‘నక్షత్రంలో’నూ చేశాను. అంటే.. ఈ సినిమా విడుదల తర్వాత అందరూ పోలీసులు కనపడితే కౌగిలించుకుంటారని కాదు. పోలీసులందరూ గొప్పవారు అని చెప్పడం లేదు. ప్రతి మనిషిలోనూæ 20 నుంచి 40 శాతం నీచత్వం ఉంటుంది. మన సంస్కారం వల్లో లేక మన జ్ఞానం వల్లో, పెద్దల పెంపకం వల్లో, పుట్టి పెరిగిన వాతావరణం వల్లో, మన ప్రవృత్తి వల్లో లేకపోతే మంచి సంస్కారం వల్లో దానిని అదుపులో పెట్టుకుంటాం. నా ప్రతి సినిమాలో ఆ సంస్కారానికి నీళ్లు పోయాలని ట్రై చేస్తుంటా. -
రక్షించేవాళ్లకు ఎందుకు భయపడాలి?
ప్రజల రక్షణ కోసమే ఉన్న పోలీసుల్ని చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసినోళ్లు భయపడాలి తప్ప సాధారణ ప్రజలు ఎందుకు భయపడాలి? అనే అంశాలను చర్చించడంతో పాటు ఓ అంతర్జాతీయ సమస్యను స్పృశిస్తూ... దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన సినిమా ‘నక్షత్రం’. సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యతారలుగా కె. శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు 4న సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘పోలీస్ అవ్వాలని ప్రయత్నించే ఓ యువకుడి కథే ఈ సినిమా. హనుమంతుని శక్తియుక్తులు, సేవాభావం పోలీసుల్లో కనిపిస్తాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఏదైనా సమస్యను చివరికి పరిష్కరించేది పోలీసే. మనం వాళ్లను చూసే దృక్పథం మారాలని ఈ సినిమాలో చెప్పా’’ అన్నారు. తులసి, జేడీ చక్రవర్తి, ప్రకాశ్‌రాజ్, శివాజీరాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భరత్, హరి గౌర. -
‘నక్షత్రం’ డిజప్పాయింట్ చెయ్యదు
-దర్శకుడు కృష్ణవంశీ ‘‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రీకరణకు రామ్‌చరణ్‌ను కలవడానికి వెళ్లా. అప్పుడు కృష్ణవంశీగారితో ‘ఎప్పుడైనా మీ సినిమాలో ఓ క్యారెక్టర్ ఉంటే చెప్పండి. చేస్తా’ అన్నాను. ‘నక్షత్రం’లో అలెగ్జాండర్ అనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వెంటనే చిరంజీవి, పవన్‌కల్యాణ్ మావయ్యల దగ్గరకు వెళ్లి ‘కృష్ణవంశీగారి సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నా’ అని చెప్పా. ‘వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్’ అన్నారు. ముఖ్యంగా చిరంజీవిగారయితే చాలా చెప్పారు. నువ్వెంతో నేర్చుకుంటావన్నారు’’ అన్నారు సాయిధరమ్ తేజ్. సందీప్ కిషన్, రెజీనా జంటగా సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కీలక తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నక్షత్రం’. ఎస్. వేణుగోపాల్, సజ్జు, కె. శ్రీనివాసులు నిర్మాతలు. భీమ్స్ సిసిరోలియో, భరత్, హరి గౌర సంగీత దర్శకులు. పాటల సీడీలను ఆవిష్కరించిన సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్‌లు, తొలి సీడీని శ్రియ, రెజీనా, ప్రగ్యాలకు అందించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘డెఫినెట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేయదు. అందరూ చాలా కష్టపడి చేశారు. నేనూ కష్టపడి చేశాను’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘ప్రతి రోజూ ఈ సినిమా సెట్‌కు కాలేజి స్టూడెంట్ లా వెళ్లా. కృష్ణవంశీగారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా’’ అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘2009లో కృష్ణవంశీగారికి ఫేస్బుక్లో ‘మిమ్మల్ని ఓసారి కలవాలని’ మెసేజ్ పెట్టా. ఆయన రిప్లై ఇవ్వలేదు. ఏడేళ్ల తర్వాత ఈ సినిమా కుదిరింది. కృష్ణవంశీగారితో సినిమా చేయాలనుకునే చాలామంది కల ఈ ఒక్క సినిమాతో తీరింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు మూడు పాటలతో పాటు నేపథ్య సంగీతం అందించాను. ప్రేక్షకులకు సంగీత దర్శకుడిగా తెలిసిన నన్ను నటుడిగా, గాయకుడిగా పరిచయం చేస్తోన్న మా దర్శకునికి కృతజ్ఞతలు’’ అన్నారు భీమ్స్. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఓ పాట మాత్రమే చేసినందుకు బాధగా ఉంది. నెక్స్›్ట ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నా’’ అన్నారు శ్రియ. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు. -
అమ్మడికి అవకాశాలే లేవట..!
ఎస్ఎమ్ఎస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రెజీనా. కెరీర్ స్టార్టింగ్‌లో కమర్షియల్ సక్సెస్‌లు సాధించలేకపోయినా.. నటిగా మాత్రం మంచి మార్కులే సాధించింది. రవితేజ సరసన హీరోయిన్గా నటించిన పవర్ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకున్న రెజీనా.. తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయలేకపోయింది. కెరీర్లో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద లాంటి హిట్ సినిమాలు ఉన్నా.. వరుస అవకాశాలు మాత్రం పలకరించటం లేదు. తమిళ్లో కాస్త పరవాలేదని పించినా.. టాలీవుడ్లో మాత్రం అమ్మడు ఆశించిన స్ధాయిలో రాణించటం లేదు. జ్యో అచ్యుతానంద తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రెజీనా. ఈ సినిమా తరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా అమ్మడి చేతిలో లేదు. తనతో పాటు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నాలు టాలీవుడ్లో జోరు చూపిస్తుంటే, రెజీనా మాత్రం కోలీవుడ్ ఆఫర్లతో సరిపెట్టుకుంటోంది. అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన పెద్దగా వర్క్ అవుట్ అయినట్టుగా లేదు. అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ లో చేస్తున్న సినిమా రెజీనాకు కెరీర్ మీద ఆశలు కల్పిస్తోంది. -
నక్షత్రానికి చరణ్ సాయం
రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే లాంటి డీసెంట్ హిట్ తెరకెక్కించిన కృష్ణవంశీ, తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా చరణ్ సాయం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం సినిమాను తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ. తనను ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ చేసిన కృష్ణ వంశీ కోసం తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు చెర్రీ. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నక్షత్రం సినిమాకు సంబందించిన పది లుక్స్‌ను రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నక్షత్రం చిత్ర అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో ప్రకటించారు. అయితే ఈ లుక్స్‌ను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పోలీస్ ఆఫీసర్‌గా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. -
మూడోసారి జోడి కడుతున్నారు
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్లు రిపీట్ అవ్వటం కామన్. అయితే ఈ ఫార్ములాను బ్రేక్ చేస్తూ ఇప్పటికే రెండు ఫ్లాప్‌లు ఇచ్చిన కాంబినేషన్‌ను మరోసారి తెర మీదకు తీసుకు రావడానికి రెడీ అవుతున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. బాలయ్య వందో సినిమాతో పాటు, రుద్రాక్ష సినిమా కూడా చేజారిపోవటంతో ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్‌తో నక్షత్రం అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు కృష్ణవంశీ. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం కృష్ణవంశీ ఓ రిస్కీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నాడట. నక్షత్రం సినిమాలో సందీప్ కిషన్ సరసన రెజీనాను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో సందీప్ కిషన్, రెజీనాలు రెండు సినిమాల్లో కలిసి నటించగా ఆ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. తొలిసారి రొటీన్ లవ్ స్టోరి సినిమాలో కలిసి నటించిన ఈ జంట మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకున్నా సినిమా రిజల్ట్ మాత్రం నిరాశపరిచింది. ఆ తరువాత కొత్త దర్శకుడితో రారా కృష్ణయ్య సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ సినిమా కూడా రిలీజ్‌కు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినా తరువాత మాత్రం ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. దీంతో ఇదే కాంబినేషన్లో సినిమా చేయటం కృష్ణవంశీకి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి హిట్ కొడతాడేమో చూడాలి.