breaking news
M.V sridhar
-
శ్రీధర్ లేఖపైనే చర్చ
సాక్షి, హైదరాబాద్: చాలా రోజుల తర్వాత జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశం ఆదివారం అర్ధాంతరంగా ముగిసింది. దీనిని ఈ నెల 21కి వాయిదా వేశారు. హెచ్‌సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. బీసీసీఐ పదవిలో ఉన్న తాను ఇక్కడి బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నానంటూ శ్రీధర్ పంపిన లేఖపైనే సమావేశంలో వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. ముగ్గురు ఉపాధ్యక్షులు శివలాల్ యాదవ్, వెంకటపతి రాజు, ఇ. వెంకట్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు. రాజీనామాపై చర్చ... గత ఆరు నెలల కాలంలో ఒక్క సారి కూడా సమావేశం కాని హెచ్‌సీఏ ఈసీ ఆదివారం రోజు సమావేశమైంది. అధ్యక్షుడు జి. వినోద్ దీనిని నిర్వహించారు. బీసీసీఐ వ్యవహారాల్లో బిజీగా ఉన్నందున తాను సమావేశానికి రాలేకపోతున్నానని, సంయుక్త కార్యదర్శి ద్వారా అన్ని కార్యకలాపాలు నిర్వహించాలని కోరుతూ శ్రీధర్ తనకు లేఖ రాశారని చెబుతూ ఈ సందర్భంగా వినోద్ దానిని చదివి వినిపించారు. అయితే ఈసీ సభ్యులు దీనిపైనే తమ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. శ్రీధర్ రాసిన లేఖ తమకు చూపించాలని, అప్పుడే ఇతర అంశాలపై చర్చిస్తామని వారు కోరినట్లు తెలిసింది. అయితే దీనికి వినోద్ అంగీకరించలేదు. దాంతో సమావేశంలో వాదోపవాదాలు జరిగాయి. శ్రీధర్ అసలు సెలవు కోరుతున్నారా...లేక పూర్తిగా రాజీనామా చేస్తారా తమకు స్పష్టం కావాలని ఈసీ సభ్యులు అడిగారు. అందుకే ఆయన స్వయంగా పంపిన లేఖను చూపించాలని ఒక ఈసీ సభ్యుడు కోరారు. శ్రీధర్ రాజీనామా చేస్తే మరో కార్యదర్శిని ఎంపిక చేసుకుంటామని, అప్పుడే హెచ్‌సీఏ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించగమని మరో ఈసీ సభ్యుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరి వరకు వినోద్ దానిని చూపించలేదు. దాంతో ఈ నెల 21 వరకు గడువిస్తున్నామని, శ్రీధర్ అంశంపై స్పష్టత వచ్చాకే మళ్లీ సమావేశమంటూ ఈసీ సభ్యులు నిష్ర్కమించారు. -
శ్రీధర్‌ను ఎలా నియమిస్తారు!
న్యూఢిల్లీ: బీసీసీఐ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్)గా హెచ్‌సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్‌ను నియమించడం బోర్డులో కొంత మందిలో అసంతృప్తి దారి తీసింది. చివరి వరకు ఆయన నియామకం గురించి తెలీదని శ్రీనివాసన్ వ్యతిరేక వర్గానికి చెందిన సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఎందుకు శ్రీధర్‌ను జీఎంగా నియమించారో, ఆయన అర్హత ఏమిటో శ్రీనివాసన్ వివరణ ఇవ్వలేదు. కేవలం శ్రీకి మద్దతు ఇచ్చిన కారణంగానే ఆ పదవి దక్కింది. సమావేశం సమయంలోనే మాకు ఆ విషయం తెలిసింది’ అని ఆయన అన్నారు. అయితే మరో సభ్యుడు దీనిని కొట్టి పారేశారు. ‘శ్రీనికి అవసరమున్నాదానికంటే ఎక్కువ మద్దతు లభించింది. కాబట్టి ఆ కారణంగా శ్రీధర్‌ను జీఎం చేశారనడంలో వాస్తవం లేదు’ అని ఆయన అన్నారు. ఎంవీ శ్రీధర్ ముంబై నుంచి క్రికెట్ వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీఎం (గేమ్ డెవలప్మెంట్) పదవిలో ఉన్న రత్నాకర్ షెట్టి అధికారాల్లో కోత పడే అవకాశం ఉంది. అర్థం లేని విమర్శ ‘అర్హత లేని, క్రికెట్ తెలీని వారికి పెద్ద పదవి ఇస్తే దానిని ప్రశ్నించవచ్చు. కానీ నాపై విమర్శల్లో అర్థం లేదు. బోర్డులో వేర్వేరు పదవులు కేటాయించినపుడు కొంత మందికి నిరాశ తప్పదు. కానీ ఎవరో ఒకరు బాధ్యతలు నిర్వర్తించాలి కదా. ఏదైనా ముందుగా ఎలా ప్రకటిస్తారు. ఏజీఎంలోనే స్వయంగా శ్రీనివాసన్ నా పేరు చదివి వినిపించాక ఇంక విమర్శలు ఎందుకు.’ - ‘సాక్షి’తోఎంవీ శ్రీధర్