breaking news
Modern medical
-
పేదలకు మెరుగైన వైద్యం
జిల్లా ఆస్పత్రికి బ్లడ్ కాంపోనెంట్, డయాలసిస్ యూనిట్ల మంజూరు నిరుపేదల రోగులకు వెసులుబాటు మాతా శిశు సంరక్షణ వార్డు స్థాయి పెంపు నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో త్వరలో ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. రక్తం నుంచి ప్లెట్లేట్లను వేరుచేసే ఖరీదైన బ్లక్ కాంపోనెంట్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నిర్వహించే డయాలసిస్ యూనిట్లు ఆస్పత్రిలో ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు వాటికి అవసరమైన వసతులను కల్పించాలని కోరుతూ ఇటీవల వైద్య విధానపరిషత్ కమిషనర్ జిల్లా ఆస్పత్రి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. బ్లడ్ కాంపోనెంట్ యూనిట్, డయాలసిస్ యూనిట్లకు అవసరమైన వసతి, విద్యుత్, నీటి సౌక ర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకోసం 1500 నుంచి 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన హాల్‌లను గుర్తించి, ఆధునీకరించడంతో పాటు సెంట్రల్ ఏసీగా ఆదునీకరించి అప్పగిస్తే బ్లడ్ కాంపోనెంట్, డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పాత భవనంలోని ఎక్స్‌రే యూనిట్ ఎదురుగా ఉన్న హాల్లో ఏర్పాటుకు, డయాలసిస్ యూనిట్‌ను ఎమర్జెన్సీ వార్డు పక్కన గల హాల్లో ఏర్పాటు చేయాలని గుర్తించిన అధికారులు వాటిని ఆధునీకరించడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. ఆస్పత్రికి చేరిన బ్లడ్కాంపోనెంట్ యూనిట్ మిషనరీ బ్లడ్కాంపోనెంట్ యూనిట్‌కు అవసరమైన మిషనరీ జిల్లా ఆస్పత్రికి చేరింది. సుమారు రూ.50 లక్షల విలువైన మిషనరీతో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో డెంగీ బారిన పడే రోగులకు వెసులుబాటు కానుంది. ప్రస్తుతం జిల్లాలో ప్లెట్లెట్లను వేరు చేసే బ్లడ్ కాంపోనెంట్ యూనిట్ లేక డెంగీ రోగులు హైదరాబాదుకో, విజయవాడ, ఖమ్మం జిల్లాలకు వెళ్లి వైద్యం చేయించుకునేవారు. ఇక్కడే యూనిట్‌ను ఏర్పాటు చేస్తే సౌకర్యంతోపాటు ఉచిత వైద్యం పొందే వీలుంటుంది. డయాలసిస్ యూనిట్ డయాలసిస్ యూనిట్‌ను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు వైద్యులు, టెక్నీషియన్లను ప్రభుత్వం నియమించాల్సి ఉంది. కిడ్నీ వ్యాధిలో బాధపడుతున్న వారికి అతి తక్కువ ఖర్చుతో డయాలసిస్ చేయనున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రిలో యూనిట్ లేకపోవడం వల్ల రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి లక్షలు ఖర్చుచేసే పరిస్థితి ఉండేది. ఈ యూనిట్ ఏర్పాటుతో జిల్లా ప్రజలకు అతితక్కువ ఖర్చుతో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో రానుంది. మాతాశిశు సంరక్షణ వార్డు స్థాయి పెంపు ఆస్పత్రికి అనుబంధంగా జాతీయ ఆరోగ్యమిషన్ నిధులతో నిర్మిస్తున్న మాతా శిశు సంరక్షణ వార్డు స్థాయిపెరిగింది. వంద పడకలతో నిర్మిస్తున్న వార్డు స్థాయిని 150కి పెంచారు. ఇప్పటి వరకు నిర్మిస్తున్న రెండస్తుల నూతన భవన సమూదాయం పూర్తి కావస్తుంది. మరో యాబై పడకల స్థాయిని పెంచడంతో మరో అంతస్తు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. నూతనంగా నిర్మాణం పూర్తి కావస్తున్న భవనంలో కాన్పులవార్డు, పిల్లల వార్డులు మాత్రమే నిర్వహించనున్నారు. గదులను ఎంపిక చేశాం ఆస్పత్రిలో బ్లడ్ కాంపోనెంట్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటుకు అవసమైన వసతిని కల్పించడానికి గదులను గుర్తించి అధికారులకు నివేదించాము. వాటిని ఆధునీకరించడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరాం. త్వరలో రెండు యూనిట్లను రోగులకు అందుబాటులోకి వస్తాయి. - అమర్, సూపరింటెండెంట్ -
‘అశ్వని’కి ఆధునిక వైద్యపరికరాలు
రూ.15 లక్షల పరికరాలు వితరణ చేసిన ముస్లిం భక్తుడు పరికరాలను ప్రారంభించిన ఈవో గిరిధర్ గోపాల్ తిరుమల : తిరుమలలోని అశ్విని ఆస్పత్రిలో వేగవంతంగా వైద్యపరీక్షలు నిర్వహించేందుకు విరాళంగా వచ్చిన అత్యాధునిక వైద్య పరికరాలు రెండింటిని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ శుక్రవారం ప్రారంభించారు. రూ.15 లక్షల విలువ కలిగిన ఈ వైద్య పరికరాలను చెన్నైకి చెందిన ముస్లిం భక్తుడు అబ్దుల్ఖనీ విరాళంగా అందజేశారు. వీటిని శుక్రవారం ఉదయం ఈవో ఎంజీ.గోపాల్ పలువురు వైద్యాధికారులతో కలిసి ప్రాయింభించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అశ్విని ఆస్పత్రిలో రోగులకు రక్తపరీక్షలు నిర్వహించేందుకు ‘స్విలాబ్ హెమటాలజి ఆటోమేటెడ్ అనలైజర్’, రెస్పాన్స్ 910 బయోకెమిస్ట్రీ పరీక్షల కోసం వినియోగించే ‘బయోకెమెస్ట్రీ ఆటోమేటెడ్ అనలైజర్’ వైద్య పరికరాలు(బ్రీత్ అనలైజర్లు) టీటీడీ కి విరాళంగా అందటం సంతోషకరమన్నారు. సాధారణంగా రక్తపరీక్షలు నిర్వహించాలంటే అరగంట సమయం పడుతుందని, ప్రస్తుతం విరాళంగా వచ్చిన స్విలాబ్ హెమటాలజి ఆటోమేటెడ్ అనలైజర్ పరికరం ద్వారా కేవలం ఒక్క నిమిషంలోనే ఫలితం తెలుసుకోవచ్చన్నారు. మొత్తం 19 రకాల రక్త సంబంధిత పరీక్షలను ఈ పరికరంతో చేయవచ్చని తెలిపారు. ఇంకా రెస్పాన్స్ 910 బయోకెమిస్ట్రీ ఆటోమేటెడ్ అనలైజర్ పరికరం ద్వారా ఒకేసారి 105 శాంపిళ్లను 30 రకాలుగా 5 నుంచి 15 నిమిషాల వ్యవధిలో పరీక్షించవచ్చనని చెప్పారు. ఈ వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చిన అబ్దుల్ఖనీ తిరుమల మొదటి, రెండవ ఘాట్‌రోడ్లపై సిగ్నలింగ్ కోసం సోలార్ పరిజ్ఞానంతో కూడిన నాలుగు వేల స్టెడ్లైట్లను కూడా విరాళంగా అందజేసినట్లు చెప్పారు. అనంతరం దాతను ఈవో శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు. అలాగే త్వరలో అశ్విని ఆస్పత్రిలో మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈవో తెలిపారు. అంతకుముందు ఈవో వైద్యులతో కలిసి ఆస్పత్రిలోని పలు గదులు, ల్యాబ్‌లు, బెడ్లు, ఇతర సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ వికాస్, సూపరింటెండెంట్ నర్మద, ఎస్ఎంవో నాగేశ్వరరావు, దాతల విభాగం డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, రిసెప్షన్ వోఎస్డీ దామోదరం, ఇతర వైద్యలు పాల్గొన్నారు.