breaking news
MMTC Trains
-
ఎట్టకేలకు పచ్చజెండా
సాక్షి, సిటీబ్యూరో: సుమారు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఎంఎంటీఎస్ రెండో దశ తుది దశకు చేరింది. సనత్‌నగర్– మౌలాలీ మినహా మిగిలిన అన్ని మార్గాల్లో పనులు పూర్తయ్యాయి. రక్షణశాఖ జోక్యం కారణంగా మౌలాలీ నుంచి సనత్‌నగర్ మార్గంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించారు. ఈ మార్గాన్ని వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేసి అన్ని రూట్లలోనూ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. సుమారు 13 కి.మీ ఉన్న సనత్‌నగర్ నుంచి మౌలాలీ మార్గంలో 2 కి.మీ వరకు రక్షణ శాఖకు చెందిన భూములు ఉన్నాయి. వీటిలో ట్రాక్ నిర్మాణానికి ఆ శాఖ అధికారులు అభ్యంతరం చెప్పడంతో చాలాకాలంగా పనులు పెండింగ్ జాబితాల్లో పడ్డాయి. కొద్ది రోజుల క్రితమే వివాదం ముగిసింది. రైల్వేట్రాక్ నిర్మాణానికి ఆ శాఖకు చెందిన అధికారులు ఆమోదం తెలపడంతో పనులను ప్రారంభించినట్లు జీఎం చెప్పారు. త్వరతిగతిన పనులు పూర్తి చేసి రైళ్లు నడపనున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్– ఘట్కేసర్ మార్గంలో డబ్లింగ్, విద్యుదీకరణ పూర్తి చేశారు. భద్రతా తనిఖీలను సైతం నిర్వహించారు. తెల్లాపూర్– రామచంద్రాపురం రెండేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా మేడ్చల్– సికింద్రాబాద్, ఫలక్‌నుమా– ఉందానగర్ రూట్లలో సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సనత్‌నగర్–మౌలాలీ అందుబాటులోకి వస్తే రెండో దశ పూర్తవుతుంది. రెండు రూట్లలో 40 రైళ్లు.. కొత్తగా ప్రారంభించిన మేడ్చల్– బొల్లారం– సికింద్రాబాద్, ఫలక్‌నుమా– ఉందానగర్ మార్గాల్లో ప్రతి రోజు 40 రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మేడ్చల్– సికింద్రాబాద్ రూట్లో 20, ఉందానగర్ నుంచి ఫలక్‌నుమాకు మరో 20 చొప్పున రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టారు. ఫలక్‌నుమా– సికింద్రాబాద్– లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి– లింగంపల్లి రూట్లతో పాటు కొత్తగా మేడ్చల్– బొల్లారం– సికింద్రాబాద్, ఉందానగర్– ఫలక్‌నుమా రూట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అన్ని రూట్లలో కలిపి ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య 110 దాటినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు మేడ్చల్ నుంచి నేరుగా లింగంపల్లి వరకు, మేడ్చల్ నుంచి నేరుగా ఉందానగర్ వరకు, లింగంపల్లి నుంచి నేరుగా ఉందానగర్ వరకు కూడా సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టుకు ఇలా... నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు వెళ్లేందుకు ఉబెర్, ఓలా తదితర క్యాబ్‌లను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉందానగర్ వద్ద క్యాబ్‌ల అలైటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. క్యాబ్ సర్వీసుల కోసం ప్రయాణికులు ఎక్కువ సమయం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలతో సంప్రదింపులు జరపనున్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం చాలా కష్టం. ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్‌లో చేరుకొని అక్కడి నుంచి మరో 6 కి.మీ దూరంలో ఉన్న ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లో వెళ్లడం ఎంతో సదుపాయంగా ఉంటుంది. -
టైమ్ ప్రకారం బండి నడవడం లేదు
♦ ఎంఎంటీఎస్ రాకపోకల్లో జాప్యంపై ప్రయాణికుల అసంతృప్తి ♦ హైలైట్స్, రిస్తా యాప్స్ సరిగ్గా పనిచేయడం లేదు ♦ గంటల తరబడి రైళ్లలో నిలబడే ప్రయాణిస్తున్నాం.. సీట్లు పెంచండి ♦ దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల వెల్లువ ♦ సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య పర్యటించిన రవీంద్ర గుప్తా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సకాలంలో ఆఫీసుకు చేరుకోలేకపోతున్నాం. సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీకి ప్రయాణ సమయం నలభై నిమిషాలు. అయితే మరో నలభై నిమిషాలు ఆలస్యమవుతోంది. - హైటెక్‌సిటీలో పనిచేసే ఓ సాఫ్ట్వేర్ నిపుణుడి ఆవేదన ఇదీ.. రైళ్ల రాకపోకలకు సంబంధించిన ప్రత్యక్ష సమాచారం తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ‘హైలైట్స్’ యాప్ ఒక్కోసారి స్పందించడం లేదు. సరైన రైళ్ల సమాచారం లభించడం లేదు. - మరో ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు ఇదీ.. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘రిస్తా’ యాప్‌పై చాలామందికి అవగాహన లేక ఈ యాప్‌ను వినియోగించుకోలేకపోతున్నారు. దీనిపై అవగాహన కల్పించండి. - సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ వైపు ప్రయాణిస్తున్న యువతుల సూచన ఇదీ.. ఎంఎంటీఎస్ ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాకు అందిన ఫిర్యాదులివీ. రవీంద్ర గుప్తా సోమవారం సికిం ద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ట్రైన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రద్దీ వేళల్లో అర గంట నుంచి 45 నిమిషాల వరకు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, దీంతో ఎంఎంటీఎస్‌లను నమ్ముకుని ఉద్యోగాలు చేసే పరిస్థితి కనిపించడం లేదని కొందరు ప్రయాణికులు జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణ సమయంలో గంటల తరబడి నిలబడాల్సి రావడంపై కొందరు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని, రైళ్లలో సీట్ల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సర్వీసుల సంఖ్యను పెంచాలని సూచించారు. వేగంగా.. సురక్షితంగా నడుపుతాం: జీఎం ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు రవీంద్ర గుప్తా వివరించారు. ‘రైళ్లు ఆలస్యంగా నడవడం వల్ల 5 శాతం ఆక్యుపెన్సీ తగ్గింది. ప్రయాణికులు ఎంఎంటీఎస్‌పైన నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. రైళ్ల వేగాన్ని పెంచుతాం. ఆలస్యానికి అవకాశం లేకుండా బండ్లు నడుపుతాం. హైలైట్స్, రిస్తా యాప్స్‌లో సాంకేతిక సమస్యలు తొలగించి ప్రయాణికులు సమర్థవంతంగా వినియోగించేలా విస్తృత ప్రచారం చేస్తాం. ఎంఎంటీఎస్ రెండో దశ పనులపై సమీక్షించి నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. - సాక్షి, హైదరాబాద్