ర్యాగింగ్‌కు దూరంగా ఉండండి
- భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు
- పోస్టర్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే కిడారి
పాడేరు రూరల్ : ర్యాగింగ్ పెనుభూతమని, అందులో చిక్కుకొని భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు విద్యార్థులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆశ్రమ పాల్టెక్నిక్ కళాశాలలో బుధవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్టాప్ ర్యాగింగ్‌పై ముద్రించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే విడుదల చేశారు. అనంతరం విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ భవిష్యత్‌ను తీర్చిద్దుకోవడానికి మంచి ప్లాట్ఫారంలాంటిందన్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థి దశలో చేసిన తప్పులు భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయన్నారు. చెడు అలవాట్లు, వ్యవసనాలకు దూరంగా ఉండి మంచి జీవితాన్ని నిర్దేశించుకోవాలన్నారు. సమస్య వచ్చినప్పుడే స్పందించకుండా ముందుగానే యాజమన్యాలు కళాశాలలో చేరినప్పుడే విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. పాడేరు సీఐ ఎన్. సాయి మాట్లాడుతూ విద్యార్థులకు ర్యాంగింగ్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగానైన విద్యార్థికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే ఆరు నెలల జైలుతోపాటు రూ. 2వేల జరిమాన విధించి కళాశాల నుంచి సస్పెండ్ చేస్తారన్నారు. కళాశాలల్లో ఎవ రైనా ఇబ్బందులకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఎస్.సూర్యప్రకాశ్, కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్‌కుమార్, హుకుంపేట జెడ్పీటీసీ సభ్యురాలు సాగర వసంతకుమారి, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.