breaking news
Mixed crops
-
ఆరబెడితే అధికాదాయం!
పూలను కష్టపడి పండించటంతోనే సరిపోదు. మార్కెట్లో గిరాకీ తగ్గినప్పుడు.. పండించిన పంటను రూపం మార్చి అమ్మగలిగితే మంచి ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు అభ్యుదయ రైతు గాదె రాజశేఖర్. అందుకోసం 2.5 టన్నుల పంటను ఆరబెట్టగల పెద్ద సోలార్ డ్రయ్యర్‌ను తానే సొంతంగా రూపొందించుకున్నారు. అందులో గులాబీ తదితర రకాల పూల రేకులు, మునగ ఆకులను ఆరబెట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గండిగూడ వద్ద గల తన 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మిశ్రమ పంటలు సాగు చేస్తున్నారు. సోలార్ డ్రయ్యర్‌ను వినియోగిస్తూ గులాబీ రేకులు, మునగ ఆకులను ఆరబెట్టి మార్కెట్ చేస్తున్నారు. ఆరబెట్టిన ఈ గులాబీ రేకులను పాన్మసాలాలో, స్వీట్ల తయారీలో వాడుతున్నారు. ఆరబెట్టిన మునగ ఆకుల పొడిని అనేక ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నందున మార్కెట్లో గిరాకీ ఉందని చెబుతున్నారు.దేశవాళీ గులాబీ రేకులతో..రెండు ఎకరాల్లో దేశవాళీ పింక్ సెంటెడ్ గులాబీ తోటను రాజశేఖర్ సాగు చేస్తున్నారు. ఈ పూల రేకులను సోలార డ్రయ్యర్లో ఆరబెడుతున్నారు. తాను పండించిన పూలే కాకుండా, మార్కెట్లో ఈ రకమైన పూల ధర కిలో రూ.20 లోపు ఉన్నప్పుడు ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి, వాటిని కూడా తన డ్రయ్యర్లో ఆరబెడుతున్నారు. పది కిలోల గులాబీ రేకులను ఆరబెడితే కిలో ఎండు పూల రేకులు తయారవుతాయి. వీటిని కిలో రూ.600 చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. సోలార్ డ్రయ్యర్లో చామంతి, మందార, శంకపుష్పం, మల్లెపూలను కూడా ఆరబెట్టి మార్కెట్ చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. మునగ ఆకులతో..వ్యవసాయ క్షేత్రంలో 8 ఎకరాల్లో ఇతర పంటల మధ్యన మిశ్రమ పంటగా సాగు చేసిన మునగ చెట్ల నుంచి సేకరించిన ఆకును ఆరబెట్టి, పొడి చేసి ఆయన అమ్ముతున్నారు. ఏపుగా పెరిగిన మునగ చెట్ల కొమ్మలను కత్తిరించినప్పుడు వాటి ఆకులను వృథాగా పారేయకుండా డ్రయర్లో ఆరబెట్టి పొడిగా మార్చుతున్నారు. ఇరవై కిలోల ఆకును ఆరబెడితే కిలో పౌడర్ తయారవుతుంది. దీన్ని కిలో రూ.800 వరకు అమ్ముకోవచ్చని చెబుతున్నారు. – బూరుగు ప్రభాకర్‌రెడ్డి, శంషాబాద్ రూరల్, రంగారెడ్డి జిల్లాసొంత ఆలోచనఏడాది కిందట రాజశేఖర్ ఓ కంపెనీ నుంచి చిన్న సైజు సోలార్ డ్రయ్యర్‌ను కొనుగోలు చేశారు. అందులో 350 కిలోల పూల రేకులను, ఆకులను ఆరబెట్టవచ్చు. అయితే, అది తన అవసరాలకు సరిపోలేదు. వ్యవసాయ క్షేత్రంలో వినియోగంలో లేని ఇనుప పైపులతో మూడు నెలల కిందట సొంత ఆలోచనతో పెద్ద సైజు సోలార్ డ్రయ్యర్‌ను తానే నిర్మించుకున్నారు. 60 అడుగుల పొడవు, 22 అడుగుల పొడవుతో 10 అడుగుల ఎత్తు ఉండేలా దీన్ని రూపొందించారు. ఇందుకు 2ఎంఎం మందం ఉన్న అక్రాలిక్ షీట్‌ను వాడారు. దీని లోపలి నుంచి తేమతో కూడిన గాలిని బయటకు పంపేందుకు చుట్టూ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి 2,500 కిలోల ఆకులు లేదా పూల రేకులను ఆరబెట్టవచ్చని ఆయన తెలిపారు. విద్యుత్తుతో నడిచే డ్రయ్యర్ కంటే సోలార్ డ్రయ్యర్ నిర్వహణ సులువుగా ఉందన్నారు.సోలార్ డ్రయ్యర్ లోపలి ఉష్ణోగ్రత బయటికంటే 8 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలుంటే ఆకులు, పూల రేకులను ఆరబెట్టడానికి ఒక రోజు సమయం చాలు. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే మరింత ఎక్కువ సమయం పడుతుంది. మునగాకు పొడిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే ఆలోచన ఉందని రాజశేఖర్ (99123 33444) అన్నారు. -
కలుపు మొక్కలు కావు.. కలిమి పంటలు!
అనేక ఆకుకూర పంటలు మనం విత్తనాలు వేసి సాగుచేసుకొని తింటున్నారు. అయితే, అంతకన్నా పోషక, ఔషధ విలువలున్న ‘సాగు చేయని ఆకుకూర పంటల’ ముచ్చట ఇది! సేంద్రియ జీవవైవిధ్య పంటలు సాగయ్యే పొలాల్లో నిశ్చింతగా ఇవి పెరుగుతున్నాయి..!! పంట పొలాల్లో వాటంతట అవే మొలిచే అనేక రకాల మొక్కలను కలుపు మొక్కలని పీకేస్తున్నాం లేదా కలుపు మందులు చల్లి చంపేస్తున్నాం. అయితే, ఇవి దేవుడిచ్చిన భాగ్యపు పంటలని జహీరాబాద్ ప్రాంత మహిళా రైతులు భావిస్తున్నారు. తమ మెట్ట భూముల్లో ఇరవై వరకు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు కలిపి పండిస్తున్నారు. ఈ సాగు చేయని ఆకుకూర పంటలను తరతరాలుగా తింటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా ఉన్నారు. మనం పనిగట్టుకొని పండించుకొని తింటున్న పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో కన్నా ఈ సాగు చేయని ఆకుకూరల్లో అనేక పోషకాలు ఎన్నో రెట్లు ఎక్కువ పాళ్లలో ఉన్నాయని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్.)నిపుణులు తేల్చటం విశేషం. మరుగున పడిపోయిన ఈ అపురూపమైన ఆకుకూరల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేందుకు దిశ బియాండ్ ఆర్గానిక్స్, డక్కన్ డవలప్మెంట్ సొసైటీ ఇటీవల తెల్లాపూర్‌లోని ‘పాక’ సేంద్రియ హోటల్లో ‘సాగు చేయని ఆకుకూరల పండుగ’ కన్నుల పండువగా జరిపారు. దేశంలోనే ఇది ఈ తరహా తొలి పండుగ కావటం విశేషం. పొలాల్లోనే కాదు ఖాళీ ప్రదేశాల్లో, బంజర్లలో, పెరటి తోటల్లోనూ ‘సాగు చేయని ఆకుకూర మొక్కలు’ ఉంటాయి. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా.. పీకి పారెయ్యడమో.. కలుపుమందులు చల్లి నాశనం చేయడమో అవివేకమైన పని. కళ్ల ముందున్న సమృద్ధి పోషకాహారాన్ని తినకుండా.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నాం. ఇకనైనా ఈ నిర్లక్ష్యాన్ని వదిలేద్దాం. దేవుడిచ్చిన ఈ ఆకుకూరలను కాపాడుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.. జీవవైవిధ్యాన్ని కాపాడుదాం.. ఈ స్ఫూర్తిని ‘సాగు చెయ్యని ఆకుకూరల పండుగ’ ఎలుగెత్తి చాటి చెప్పింది! జహీరాబాద్ మహిళా రైతులకు, డీడీఎస్‌కు, దిశ బియాండ్ ఆర్గానిక్స్ నిర్వాహకులకు జేజేలు!! కరువును జయించే పంటలు.. ఎకరానికి ఎన్ని జొన్నలు పండించారని వ్యవసాయ శాస్త్రవేత్తలు లెక్కలు అడుగుతుంటారు. అయితే, జహీరాబాద్ మహిళా రైతులు తమ మెట్ట భూముల్లో 20 రకాల పంటలను విత్తనాలు చల్లి పండిస్తున్నారు. వీటితోపాటు.. వాటంతట అవే మొలిచి పెరిగే ఆకుకూర పంటలు 50 రకాల వరకు ఉంటాయని మేం అధ్యయనం చేసినప్పుడు తెలిసింది. డబ్బు రూపకంగా విలువ కట్టలేని పంటలివి. దేవుడిచ్చిన పంటలు. ఎంత డబ్బొచ్చింది అని మాత్రమే చూసే పాశ్చాత్య ధోరణి కలిగిన వారికి జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం వల్ల జరిగే మేలు ఏమిటో బోధపడదు. కరువును జయించడంలో ఈ ‘అన్కల్టివేటెడ్ క్రాప్స్’ కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని పరిరక్షించుకోవాలంటే రసాయనిక వ్యవసాయ పద్ధతులను వదిలేసి జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం చేపట్టాలి. సేంద్రియ దిగుబడి ఒక్క దాని గురించే కాకుండా ఇతరత్రా ప్రకృతి సేవల విలువను కూడా గుర్తించడం మనం నేర్చుకోవాలి. – పి. వి. సతీష్, డైరెక్టర్, డెక్కన్ డవలప్మెంట్ సొసైటీ వ్యవసాయ వర్సిటీలు ఇవి దేవుడిచ్చిన ఆకుకూరలు.. సర్కారీ ఎరువులేస్తే రావు.. ఇవి దేవుడిచ్చిన ఆకుకూర మొక్కలు. ఇవి మంచి బలమైన ఆకుకూరలు. పెంట ఎరువులేస్తే బాగా వస్తాయి. సర్కారీ ఎరువులేస్తే ఇవి రావు. మేం రోజుకో రకం తింటాం. ఇసువంటి కూరలే మాకు రోజూ దొరికే మాంసం. గట్టిగ ఉన్నాం. దవాఖానా అక్కర్లేదు. దొగ్గల కూరలో ఇనుముంటది.. 70 ఏళ్లున్నా నాకు మోకాళ్ల నొప్పులు లేవు. మేం వంద రకాల విత్తనాలు దాచిపెడతాం. కానీ, దేవుడు వందల రకాలు దాచిపెడతడు. వాటికవే మొలిచి రెండు నెలలుండేవి ఆకుకూరలు కొన్ని, 4 నెలలుండేవి కొన్ని, ఏ కాలంలోనైనా అందుబాటు లో ఉండేవి ఇంకొన్ని.. చాలా రకాలున్నయి. ఇది చాలా మంచి పండుగ. – చంద్రమ్మ, జహీరాబాద్, సేంద్రియ మహిళా రైతు కలుపు మొక్కలుగా చూడటం బాధాకరం! పేదలకు వరప్రసాదం వంటి ఈ సాగు చేయని పంటలు. జహీరాబాద్ ప్రాంతంలో 1999లో ఒక అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పేదలు సంవత్సరంలో కనీసం వంద రోజులైనా తుమ్మికూర, చెన్నంగి, పులిచింత/పుల్లకూర వంటి 15–20 రకాలు తింటారు. దొగ్గలి వంటి ఆకుకూరలను 30–40 సార్లయినా వండుకు తింటారు. వీటి ఆకులను జొన్న, సజ్జ రొట్టెల్లో కలుపుకొని తింటారు. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్.ఐ.ఎన్.) వీటిపై అధ్యయనం చేసి పౌష్టికాహార విలువలు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఖరీఫ్‌లో, రబీలో, నల్లరేగడి నేలల్లో, ఎర్ర నేలల్లో, మెట్ట భూముల్లో(41), సాగు నీటి సదుపాయం ఉన్న భూముల్లో పెరిగే(30) రకాలు వేర్వేరుగా ఉన్నాయి. మొక్కలే కాదు చాలా రకాల తీగజాతి ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఎలుక చెవుల కూర నల్ల రేగడి నేలల్లో చెరువు కట్టలపై కనిపిస్తుంది. జహీరాబాద్ ప్రాంతంలో కొన్ని రకాలుంటే.. అనంతపురం ప్రాంతంలో మరికొన్ని రకాలు ఉంటాయి. కోస్తా జిల్లాల్లో వేరే రకాలు కూడా కనిపిస్తాయి. వీటిని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ కలుపు మొక్కలుగానే చూస్తుండటం విషాదకరం. ఇవి పౌష్టికాహారంగా, ఔషధాలుగా ఉపయోగపడటమే కాకుండా భూసారాన్ని పెంపొందించేంకు కూడా ఉపయోగపడుతున్నాయని గుర్తించాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల వల్ల అత్యంత విలువైన ఈ ఆకుకూరల సంపదను చాలా వరకు పోగొట్టుకున్నాం. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పశువుల ఎరువు వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా వీటిని పరిరక్షించుకోవాలి. ట్రాక్టర్లలో బాగా లోతు దుక్కులు దున్నటం మాని నాగళ్లతో దుక్కి చేసుకోవాలి. ప్రభుత్వం పశుపోషణను ప్రోత్సహించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వీటిని కలుపు మొక్కలుగా చూడటం మానేసి, సేంద్రియ రైతుల సంప్రదాయ జ్ఞానాన్ని గుర్తించాలి. పౌష్టికాహారంగా వీటి ప్రాముఖ్యతను గుర్తించి, పరిరక్షించాలి. పట్టణాలు, నగరాల్లోనూ ఈ మొక్కలు కనిపిస్తాయి. వీటి విలువను సమాజంలో అందరూ గుర్తించి పరిరక్షించుకోవాలి. – డా. బస్వాపూర్ సురేశ్‌రెడ్డి (95505 58158), అసోసియేట్ ప్రొఫెసర్, ‘సెస్’, సుస్థిర అభివృద్ధి అధ్యయన విభాగం, హైదరాబాద్ -
మిశ్రమ పంటలపై రైతుల ఆసక్తి
శామీర్‌పేట్: మండలంలోని రైతులు మిశ్రమ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఒకే సీజన్లో రెండు పంటలను సాగు చేసి రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు. మండలంలో భూగర్భజలాలు అంతంత మాత్రమే. ఐదు సంవత్సరాలుగా వరి సాగు చివరిరోజుల్లో కరెంట్ కోతలు, అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్నారు. రైతులు మిశ్రమ పంటలపై దృష్టి సారిస్తున్నారు. వీరికి వ్యవసాయ శాఖ అధికారులు తగు సూచనలు ఇస్తుండంతోై రెతులు అటువైపు అడుగులు వేస్తున్నారు. టేకు చెట్ల మధ్య డెకరేషన్‌కు పనికి వచ్చే ఆస్పరాగస్ గడ్డితోపాటు పూలు, కాకర తోటల్లో టమాటా, మామిడిలో మొక్కజొన్న, పశుగ్రాసం, వేరుశనగ, కంది, రాగి, బీన్స్, వంకాయ, చిక్కుడు తదితర తీగజాతి పంటలు, బొప్పాయిలో బంతి పూలు, మొక్కజొన్నలో కంది పంటలు సాగు చేస్తున్నారు. ఉన్నంత వరకు భూమిని పూర్తిగా ఉపయోగించుకుని ఇలా ఒకే సీజన్లో రెండు పంటలతో ఆదాయం పొందుతున్నారు. శామీర్‌పేట్ మండలంలోని పొన్నాల్, బాబాగూడ, పోతారం, నారాయణపూర్, అనంతారం, కొల్తూర్, ఉద్దెమర్రి, పోతాయిపల్లి, తూంకుంట తదితర ప్రాంతాల్లోని రైతులు సుమారు వెయ్యి ఎకరాల్లో మిశ్రమ పంటలు పండిస్తున్నారు. రాబోయే కాలంలో మరింత ఎక్కువ విస్తీర్ణంలో మిశ్రమ పంటలు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మిశ్రమ పంటలకు డ్రిప్ మల్చింగ్ విధానం మరింత సౌలభ్యాన్ని కల్గిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు.