breaking news
The Ministry of Justice
-
రగులుతున్న ఉమ్మడి పౌరస్మృతి
‘ఉమ్మడి’ని వ్యతిరేకించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు ► న్యాయశాఖ ప్రశ్నావళిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటన ► సంస్కరణలు అవసరం.. చర్చలకు సిద్ధం: మైనారిటీ శాఖ మంత్రి నఖ్వీ ► భారత్‌లో ‘ఉమ్మడి’ సాధ్యం కాదన్న కాంగ్రెస్ ► రాజకీయ లబ్ధికోసమే తెరపైకి ఈ నిర్ణయం: విపక్షాలు సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతిపై దుమారం మొదలైంది. దేశవ్యాప్తంగా వివాహచట్టంలో ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టడానికి చేస్తున్న కసరత్తుపై కేంద్రానికి ఆదిలోనే తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఎల్ఎంపీఎల్బీ), ముస్లిం సంస్థలు తేల్చి చెప్పాయి. దీన్ని అమలుచేయటం సాధ్యం కాదని కాంగ్రెస్ తెలపగా.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని జేడీయూ విమర్శించింది. ఈ విషయంలో ప్రభుత్వ వ్యతిరేక వైఖరిపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజలు, సంఘాల సూచనల కోసం కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ప్రశ్నావళిని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశాయి. ‘దేశప్రజలందరికీ ఒకే గాటన కట్టడం సరికాదు. దీనివల్ల దేశ బహుళత్వం, భిన్నత్వాలు ప్రమాదంలో పడతాయి. మిగిలిన మతాలతోపోలిస్తే మాదగ్గర విడాకులు తీసుకోవటం చాలా తక్కువ’ అని బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా మహమ్మద్ వలీ రహమనీ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. మోదీ ఈ విధానాల రూపకల్పన విషయాన్ని లేవనెత్తారని ఆయన విమర్శించారు. వివిధ ముస్లిం సంస్థలు.. దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జమాతే ఉలేమాయీ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ వెల్లడించారు. ప్రభుత్వం దీనిపై వెనక్కు తగ్గకపోతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. చర్చలకు సిద్ధం: నఖ్వీ దీనిపై అన్ని వర్గాలతో కలిసి చర్చించేందుకు తలుపులు తెరిచే ఉన్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నఖ్వీ తెలిపారు. సంస్కరణలపై చర్చలు జరపకుండానే ముందస్తుగానే నిర్ణయానికి వచ్చేయటం సరికాదన్నారు. ఉమ్మడి పౌరస్మృతి ప్రగతిశీల నిర్ణయమని బీజేపీ చెబుతున్నా.. ఈ నిర్ణయాన్ని అమలు చేయటం అసంభవమని.. భారత దేశంలో ఉమ్మడిపౌరస్మృతి అమలు సాధ్యం కాదని మాజీ న్యాయ శాఖ మంత్రి వీరప్పమొయిలీ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతితో దేశంలో భిన్నత్వం దెబ్బతింటుందని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
లా శాఖకు హైకోర్టు చురక!
- విశ్లేషణ యాసిడ్ దాడి, రేప్‌కు ప్రయత్నించిన వ్యక్తిని చంపే అధికారం మహిళలకు ఉందంటూ.. పార్లమెంటు ఐపీసీకి చేసిన సవరణ మరుగునపడితే మహిళ లకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఎలా తెలుస్తుంది? బెంగళూరు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌ఎస్‌యూఐ) విద్యార్థి వంశ్ శరద్ గుప్తకు భారతీయ క్రైస్తవ వివాహ చట్టం 1972 పూర్తి పాఠం అవసరమైంది. ఎక్కడా దొర కలేదు. న్యాయ మంత్రిత్వ శాఖ లా విభాగం అధికారిక వెబ్సైట్ http://indiacode.nic.inలో ఆ చట్టం పాఠం ఉన్నా ఒక్క వాక్యం కూడా వరసగా చదవలేనంత జటిలంగా ఉంది. విద్యార్థులకు ఉపయోగమయ్యే ఈ వెబ్సైట్లో కొన్ని చట్టాలు అసలు చదవలేమనీ, ప్రైవేట్ పబ్లిషర్లు ప్రచురించే పుస్తకాలలో మూల చట్టం తప్పులు లేకుండా ఉందనలేమనీ, అధికారిక ప్రతినిధుల ఈమెయిల్ ఐడీలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. 1908లో రూపొందించిన సివిల్ ప్రొసీజర్ కోడ్ తాజా ప్రతి అధికారిక వెబ్సైట్లో లేదు. అడిగితే 1908 నాటి ప్రతిని, ఆ తరువాత పార్లమెంటు చేసిన వందకు పైగా సవరణల ప్రతులను ఇస్తున్నారు. వీటన్నింటిని సమన్వయం చేసి చట్టం పాఠం ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది. సవరణలను చేరుస్తూ నవీకరించిన తాజా ప్రతిని తయారు చేయవలసిన బాధ్యత శాసనాల విభాగానిదే. సవరించిన చట్టాల్ని ప్రైవేటు ప్రచురణ కర్తలు అమ్ముకుంటున్నారు. అధికారికంగా ప్రభుత్వం సవరించిన ప్రతిని అందుబాటులోకి తేవలసి ఉంది. సవరించిన రూపంలో వందలాది చట్టాలను ఇచ్చే స్థితి లేదు. శాసన విభాగం పీఐఓ సవరించిన తాజా శాసన పాఠాలను రూపొందించి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం మొదలైందని, ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందని వివరించారు. హిందీ భాషలో కూడా చట్టాలను అనువదించే కార్యక్రమం సాగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రస్తుత దశ, పూర్తయ్యే గడువు వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది. దరఖాస్తుకు నెలరోజుల్లో జవాబు ఇవ్వలేదు. మొదటి అప్పీలు పట్టించుకోలేదు. తమ ఈ మెయిల్ పనిచేస్తుందో లేదో చూసుకోరు. తాము పాటించవలసిన చట్టాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ఈ చట్టాల సమాచారం ప్రభుత్వం స్వయంగా వెల్లడించాల్సింది పోయి అడిగినా చెప్పకపోవడం ఆర్టీఐ ఉల్లంఘన అవుతుందంటూ విద్యార్థులకు కలిగిన నష్టాన్ని పూరించడానికి రూ.10 వేలను యూనివర్సిటీ గ్రంథాలయానికి ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది. ప్రభుత్వమే నడిపే విశ్వవిద్యాలయానికి రూ. 10వేలు ఇస్తే ప్రభుత్వానికి ఏ నష్టమూ లేదు. ఇవ్వకపోతే యూనివర్సిటీ సీఐసీలో ఫిర్యాదు కూడా చేయకపోవచ్చు. ఈ తీర్పు చట్ట విరుద్ధమని, అన్యాయమనీ నష్టపరిహారం ఆదేశం రద్దు చేయాలని శాసన మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. చట్టాన్ని అస్పష్టంగా, అసందిగ్ధంగా అందుబాటులో లేకుండా చేయడం అంటే దాన్ని రహస్యంగా మార్చి చట్టాలను తెలుసుకునే ప్రజల హక్కును భంగపరచరాదని, ఐటీని ఉపయోగించుకుని చట్టాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రభుత్వ బాధ్యత అనీ, సవరణలతో సంస్కరించిన చట్టాల పూర్తి ప్రతులను వెబ్సైట్లో ఉంచాలనీ, గ్రంథాలయానికి పదివేలు పరిహారం ఇవ్వాలనీ, ిసీఐసీ ఆదేశిస్తే దానిపై రిట్ పిటిషన్ వేయడాన్ని ఢిల్లీ హైకోర్ట్టు ప్రశ్నించింది. ఇది ప్రభుత్వ కనీస బాధ్యత. మహిళ తనపై యాసిడ్ దాడి జరిగినా, రేప్ ప్రయత్నం జరిగినా ఆత్మరక్షణ కోసం దాడి చేసే వ్యక్తిని చంపే అధికారం ఉందంటూ నిర్భయ చట్టం ద్వారా పార్లమెంటు ఇటీవల ఐపీసీని సవరించింది. ఈ సవరణతో కూడిన తాజా ఐపీసీని సులువుగా ప్రజలకు అందుబాటులో ఉండేట్టు చేయకపోతే మహిళలు తమను రక్షించుకునే హక్కు ఉందని ఎలా తెలుసుకుంటారు? ఇటువంటి తాజా శాసన సవరణ విషయాలను ఎప్పటిలోగా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారో చెప్పాలని సీఐసీ ఆదేశించింది. దీనిపైన రిట్ దాఖలు చేసిన విద్యార్థి ఆర్టీఐని సరైన రీతిలో దరఖాస్తు వేయలేదని, ఫీజు ఇవ్వలేదని, మొదటి అప్పీలు వేయలేదని కనుక రెండో అప్పీలు వినరాదని శాసన విభాగం వాదించింది. దీన్ని తిప్పికొడుతూ ఢిల్లీ హైకోర్టు గణనీయమైన తీర్పు ఇచ్చింది. ిసీఐసీ తీర్పుపై విచారించేందుకు హైకోర్టు అప్పీలు కోర్టు కాదని, కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ అసలు న్యాయానికి అడ్డుతగలకూడదని హితవు చెప్పింది. సీఐసీ ఇచ్చిన ఆదేశం సమంజసమనీ, న్యాయ విధానాన్ని ముందుకు నడిపేదిగానూ ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సింగ్ వివరించారు. అసలు చట్టాలు ఒక క్లిక్‌లో అందు బాటులో తేవాల్సిన బాధ్యత ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రభుత్వంపైన ఉందని సీఐసీ సరిగ్గానే చెప్పారు... ప్రభుత్వమే అన్ని చట్టాలను అందుబాటులో ఉంచాలి. రూ.10వేల పరిహారం గురించి లేవనెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ ఈ పిటిషన్ వేయడానికి రూ.10వేల కన్న ఎక్కువే ప్రభుత్వం ఖర్చుచేసి ఉంటుంది. కనుక సీఐసీ ఆదేశించిన రూ.10వేలను ఈ పిటిషన్ వేయడానికి కారకులైన అధికారుల జీతాలనుంచి మినహాయించి పరిహారం చెల్లించాలి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సామాన్య జనంపై.. కోర్టుల్లో ప్రభుత్వాలే సుదీర్ఘ సమరాలు చేయడం ఎంత అసమంజసమో ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పులో వివరించింది. (సీఐసీలో ఈ రచయిత ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు రిట్ పిటిషన్(సి) 4761-2016లో మే 24 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
బాధ్యతల నుంచి తప్పుకుంటున్న పత్రికారంగం
ఎమ్మెల్యే రమేష్‌కుమార్ కోలారు : శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖలో ఎలాంటి లోపాలు జరగకుండా చూడాల్సిన పత్రికా రంగం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందని శ్రీనివాస పురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక పాత్రికేయుల భవనలో పంచ మ వాణి స్థానిక దిన పత్రిక విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మీడియా రంగం నేడు కార్పొరేట్ సంస్థల చేతిలో చిక్కి ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగే తప్పులను కనుగొని జాగృతం చేయాల్సిన బాధ్యత పత్రికా రంగంపై ఉందన్నారు. తప్పులను ఒప్పులు గాను, ఒప్పులను, తప్పులుగాను ప్రతిబింభించే తత్వం పత్రికా రంగానికి ఉండకూడదన్నారు. ఇది సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపిస్తోందన్నారు. పత్రికా రంగాన్ని నడుపుతున్న కొంత మంది శ్రీమంతులు ప్రభుత్వంపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తుంటే ఇక ప్రజా స్వామ వ్యవస్థకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. కొన్ని వార్తా సంస్థలు తమ సొంత అభిప్రాయాలను ప్రజలపై రుద్దుతున్నాయన్నారు. సమాజం కోరుకునే విషయాలకు మీడియా అధిక ప్రాధాన్యతనిస్తే ఎక్కువ కాలం మనజాలతాయని అన్నారు. పత్రికలు ప్రామాణికతను కలిగిఉన్నప్పుడే ప్రజల విశ్వాసం పొందడం సాధ్యమవు తుందని ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ త్రిలోక్‌చంద్ర, దళిత నాయకుడు సిఎం.మునియప్ప, పాత్రికేయుల సంఘం మాజీ అధ్యక్షుడు బివి గోపినాథ్, అధ్యక్షుడు గణేష్, పంచమవాణి పత్రికా సంపాదకుడు సివి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.