‘భవనాల’పై సీఎంల స్థాయిలో నిర్ణయం
♦ విభజనాంశాలపై గవర్నర్ సమక్షంలో చర్చలో త్రిసభ్య కమిటీలు
♦ కీలక నిర్ణయాలేవీ తీసుకోకుండానే ముగిసిన భేటీ
♦ 17న మరోసారి సమావేశం
సాక్షి, హైదరాబాద్: విభజన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు ఆదివారం ఇక్కడి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో మరోమారు సమావేశమయ్యాయి. ఈ భేటీకి తెలంగాణ నుంచి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఏపీ నుంచి మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో కీలక నిర్ణయాలేవీ కమిటీలు తీసుకోలేదు. ఏప్రిల్ 17న మరోమారు సమావేశం కావాలని సూచనప్రాయంగా నిర్ణయించాయి. అనంతరం సమావేవ వివరాలను వివేక్ మీడియాకు వెల్లడించారు.
పెండింగ్‌లో ఉన్న తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజనతోపాటు ఉద్యోగుల విభజనపై చర్చించినట్లు చెప్పారు. ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇప్పటికే అమరావతికి తరలివెళ్లినందువల్ల సెక్రటేరియట్ భవనాలను ఏపీ ఖాళీ చేస్తే బాగుంటుందన్న విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే దీనిపై తమ సీఎం చంద్రబాబుతో మాట్లాడి చెబుతామని ఏపీ మంత్రులు చెప్పారన్నారు. భవనాల విభజనపై కమిటీలు నిర్ణయం తీసుకోలేవని, ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయం జరగాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల పంపిణీ సమస్యలపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఎండీలు మాట్లాడుకున్నారని, వారిచ్చిన నివేదికల ఆధారంగా సమస్యలను త్వరగా పరిష్కరిస్తామనే అభిప్రాయం వెలిబుచ్చారు. 42 కార్పొరేషన్ల విభజనతోపాటు పలు అంశాలపై వచ్చే సమావేశంలో స్పష్టత వస్తుందని వివేక్ తెలిపారు. తదుపరి సమావేశంలో ఉద్యోగుల ఇబ్బందులపై దృష్టి సారిస్తామని, ఇదే అంశంపై గవర్నర్ పలు సూచనలు చేసినట్లు చెప్పారు.
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపైత్వరలో సుప్రీంకు...
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ సలహా తీసుకుం టున్నామని వివేక్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సూచన మేరకు త్వరలోనే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, నిజామాబాద్ ఎంపీ కవిత చొరవతోనే నిజామాబాద్–పెద్దపల్లి రైల్వేలైన్ పూర్తయిందంటూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.