breaking news
makeshift boat
-
పడవ నుంచి అమాంతం పడిపోయిన ఎంపీ..!
పట్నా: చుట్టూ భారీగా వరద నీరు.. ఈ వరద నీటిలో ట్యూబులతో తయారుచేసిన తాత్కాలిక పడవలో ప్రయాణించి.. వరద బాధితులను పరామర్శించాలని ఓ ఎంపీ ప్రయత్నించారు. కానీ, వరదనీరు భారీగా ఉండటంతో ఎలాంటి రక్షణలు లేని తాత్కాలిక బోటులో ప్రయాణించాలని చూసిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ట్యూబులో తయారుచేసిన బోటులో ఎక్కువమంది ఉండటంతో.. అది అమాంతం మునిగిపోయింది. ఎంపీతోపాటు ఆయన వెంట ఉన్నవారు నీళ్లలో పడిపోయారు. సమయానికి అక్కడ ఉన్న స్థానికులు సహాయం చేయడంతో ఎంపీ సురక్షితంగా బటయపడ్డారు. ఈ ఘటన బిహార్ పాట్నా జిల్లా మసౌర్హిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ ఎంపీ రాంకృపాల్ యాదవ్ తాత్కాలిక బోటులో ప్రయాణించి.. వరద బాధితులను పరామర్శించేందుకు ప్రయత్నించారు. అయితే, ఎలాంటి రక్షణలు లేకుండా ఈ బోటు ప్రమాదకరంగా ఉండటం, దానిపై ఐదారుగురు ప్రయాణించడంతో నీళ్లలో కొద్దిదూరం వెళ్లకముందే.. ఇది అదుపుతప్పి నీళ్లలో మునిగిపోయింది. దానిపై ఉన్నవారంతా అమాంతం నీళ్లలో పడిపోయారు. సమయానికి అక్కడ ఉన్న స్థానికులు సహాయం చేయడంతో ఈ ప్రమాదం నుంచి ఎంపీతోపాటు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి
సాక్షి, పట్నా: బిహార్‌లోని ఫోర్బ్స్‌గంజ్‌లో భారీ వరదల కారణంగా కొత్త పెళ్లి జంటకు వింత పరిస్థితి ఎదురైంది. వివాహం అనంతరం వరుడితో కలిసి వధువు ఇంటికెళుతున్న సమయంలో రోడ్లపైకి వరద నీరు చేరింది. ఫలితంగా కారు ప్రయాణం కష్టంగా మారింది. దీంతో స్థానికులు ప్లాస్టిక్ డ్రములతో తయారుచేసిన ఓ నాటు పడవలో వధూవరులను అక్కడి నుంచి రోడ్డు దాటించి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిహార్‌కు వరద ముప్పు నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాల కారణంగా సరిహద్దు రాష్ట్రమైన బిహార్ వరద ముప్పులో చిక్కుకుంది. బిహార్‌లోని 6 జిల్లాలు వరదమయమయ్యాయి. సుపాల్, మజఫర్‌పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, అరారియా, కిషన్ గంజ్ జిల్లాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. పరీవాహక ప్రాంత గ్రామాల్ని ముంచెత్తుతున్నాయి. దీంతో వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని స్థానిక యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కోషి, గండక్, బుది గండక్, గంగ, భాగమతి నదుల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని బిహార్ సీఎం నితీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అల్లాడుతున్న అసోం వరద ఉధృతితో అసోం అల్లాడుతోంది. బ్రహ్మపుత్ర సహా 5 ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగుతూ ఊళ్లను ముంచెత్తుతున్నాయి. వరదల వల్ల అసోంలో మృతిచెందినవారి సంఖ్య ఇప్పటికే 7కు చేరింది. రాష్ట్రంలోని 25 జిల్లాల పరిధిలో 14 లక్షలమంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని రాష్ట్ర అధికారులు తెలిపారు. 2వేలకుపైగా గ్రామాలు నీటిముంపులో ఉన్నాయి. కజిరంగా జాతీయ పార్క్70శాతం మునిగిపోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాష్ట్రంలోని తాజా పరిస్థితిని సీఎం సరబానంద సోనోవాల్ వివరించారు. అసోంలో వరదల ధాటికి ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. మోరేగావ్ జిల్లా తెంగాగురిలో స్కూల్ బిల్డింగ్ క్షణాల్లో నేలమట్టమైంది. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది వరద జనావాసాల్లోకి చేరడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. భారీ వర్షాలతో పొరుగు దేశం నేపాల్ విలవిల్లాడుతోంది. గత 5 రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు నదులు పోటెత్తుతున్నాయి. వరద పొంగిపొర్లడంతో కొండప్రాంతాల్లోని ప్రజలకు తీవ్ర ముప్పు నెలకొంది. వరదల్లో చిక్కుకుని, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకూ 50మంది మృతి చెందగా.. మరో 24 మంది గల్లంతయ్యారు. మరో 12మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. లలిత్పూర్, ఖోతంగ్, భోజ్‌పూర్, కావ్రే, మాక్వాన్‌పూర్, సిందూలి, ధాదింగ్ ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగింది. మరో 24గంటలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు నేపాల్ వాతావరణశాఖ తెలిపింది. దీంతో అధికారులు సహాయక చర్యలు మరింత వేగంవంతం చేశారు. -
బడికైనా, గుడికైనా.. ఇలాగే వెళ్తారు!
ఇటు జమ్ము-పూంచ్ హైవే.. అటు చాక్లీ, ఖర్దిను, అప్పర్ పోథా గ్రామాలు. మధ్యలో రాజౌరి ప్రధాన నది. ఈ మూడు గ్రామాల వాసులు బయట ప్రపంచానికి అనుసంధానం కావాలంటే ఈ రాజౌరీ నదిని దాటాలి. కానీ ఈ నదిపై అధికారులు ఎలాంటి వంతెన నిర్మించలేదు. ఫలితంగా ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టి.. సొంతంగా తయారుచేసుకున్న పడవల్లో ఇలా నదిని దాటుతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లాలన్నా.. ఆపత్కాలంలో ఆస్పత్రులకు వెళ్లాలన్నా.. ఇలాంటి ప్రమాదకరమైన పడవలే వారికి దిక్కు. అయినా అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మించడానికి తలపెట్టింది. కానీ నత్తనడకన సాగుతోంది. అది ఎప్పుడూ పూర్తవుతుందో దేవుడికి కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక ఇలా సొంతంగా నిర్మించుకున్న పడవల్లో నదిని దాటి బయటి ప్రపంచానికి అనుసంధానం అవుతున్నామని చాక్లీ గ్రామ ప్రజలు చెప్తున్నారు.