breaking news
L.venkatram reddy
-
టెన్నికాయిట్ విజేత అనిల్
జింఖానా, న్యూస్‌లైన్: ఎల్.వెంకట్రామిరెడ్డి స్మారక టెన్నికాయిట్ టోర్నీలో హైదరాబాద్ కుర్రాడు అనిల్ విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగం ఫైనల్లో అనిల్ 21-18, 21-19తో వరంగల్‌కు చెందిన ప్రకాష్‌పై గెలుపొందాడు. బాలికల విభాగం ఫైనల్లో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీహర్ష 14-21, 18-21తో రేవతి (ప్రకాశం) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు భారత టెన్నికాయిట్ సమాఖ్య (టీకేఎఫ్ఐ) ఉపాధ్యక్షడు టి. రామమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీకేఎఫ్ఐ కార్యదర్శి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాలోకానికి తీరని లోటు
ఎల్బీ స్టేడియం/జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) మాజీ కార్యదర్శి ఎల్.వెంకట్రామ్ రెడ్డి మృతి రాష్ట్ర క్రీడారంగానికి తీరని లోటని వివిధ క్రీడాసంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. ఏపీఓఏ అధ్యక్షుడు ఎంపీ లగడపాటి రాజగోపాల్, ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, రాష్ట్ర వాలీబాల్ సంఘం కార్యదర్శి వి.రవికాంత్‌రెడ్డి, రాష్ట్ర కార్ఫ్‌బాల్ సంఘం కార్యదర్శి జె.జయరాజ్, హైదరాబాద్ జిల్లా త్రోబాల్ సంఘం కార్యదర్శి ఎం.బి.నర్సింహులు, హైదరాబాద్ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి ప్రొఫెసర్ రాజేష్ కుమార్‌లు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భాయ్ సాబ్‌గా సుపరిచితుడైన ఆయన భౌతికకాయాన్ని శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు క్రీడావర్గాల సందర్శనార్థం ఒలింపిక్ భవన్లో ఉంచుతారు. అనంతరం విఠల్వాడలోని వెంకట్రామ్రెడ్డి స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర జరుగుతుంది. అంబర్పేట్ స్మశానవాటికలో ఆయన అంతిమసంస్కారాలు జరుగుతాయి. రాష్ర్టంలో పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడలను సమర్థంగా నిర్వహించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. వివాదరహితుడిగా పేరున్న భాయ్ సాబ్‌కు దివంగత ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డిలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.కిర ణ్ కుమార్‌రెడ్డి వరకు సన్నిహిత సంబంధాలున్నాయి. పదేళ్ల పాటు రాష్ట్ర వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన తదనంతరం సత్తాగల వాలీబాల్ ఆటగాళ్లను తయారు చేశారు. ఆయన హయాంలోనే ఎంసీహెచ్ శిక్షణ శిబిరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్) స్పోర్ట్స్ ఆఫీసర్‌గా పని చేసిన భాయ్ సాబ్... తన హయాంలోనే జంటనగరాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అంకురార్పణ చేశారు. ఎంసీహెచ్‌లో క్రీడా విభాగం ఏర్పాటు చేసి 40 మంది కోచ్‌లను నియమించారు. తొలుత ఐదు క్రీడాంశాల్లో వందలాది మంది చిన్నారులతో ఆరంభ మైన ఎంసీహెచ్ వేసవి శిక్షణ శిబిరాలు నేడు దాదాపు 53 క్రీడాంశాల్లో 600 మైదానాల్లో వేలాది మంది చిన్నారులకు శిక్షణనిచ్చేలా విస్తరించాయి. స్వాతంత్య్ర సమరయోధుడు నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన వెంకట్రామ్రెడ్డి స్వాతంత్య్ర సమర యోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో గ్రామంలో రజాకార్లను ఎదిరించి తొర్లికొండ గుట్టపై జాతీయ జెండాను ఎగురవేశాడు. ఆర్మూర్ ప్రాంతం నుంచి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న మొట్టమొదటి వ్యక్తి భాయ్ సాబ్. రజాకార్లను ఎదిరించిన సమయంలోనే తొర్లికొండను వదిలి హైదరాబాద్‌కు వెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు. వెంకట్రామ్రెడ్డి శిష్యులు నలుగురు ఈ గ్రామం నుంచి మొట్టమొదట పీఈటీలుగా ఎంపికయ్యారు. మరో 32 మంది ఆయన సలహాలతోనే పీఈటీలయ్యారు. రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి 32 మంది పీఈటీలున్న ఘనత తొర్లికొండకు దక్కిందంటే ఆయన చలవేనంటారు గ్రామస్తులు.