breaking news
llc workers
-
20 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు రూ. 1,300 కోట్లు
సాక్షి, బళ్లారి : తుంగభద్ర బోర్డు పరిధిలోని బళ్లారి – కర్నూలు జిల్లాల మధ్య ఎల్ఎల్సీ (లో లెవల్ కెనాల్) ద్వారా 20 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు చేసేందుకు ఏకంగా రూ.1,300 కోట్లు కేటాయిస్తూ ఎన్నికల ముంగిట జారీ అయిన జీవో వెలుగు చూడటం కలకలం రేపుతోంది. తుంగభద్ర బోర్డు అనుమతి లేకుండా సాధారణ పనికి ఇంతపెద్ద మొత్తంలో నిధుల కైంకర్యానికి గత చంద్రబాబు ప్రభుత్వం వ్యూహం రచించడం పట్ల నీటి పారుదల శాఖ నిపుణులు విస్తుపోతున్నారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. పలువురు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టారని సమాచారం. తుంగభద్ర డ్యాం నుంచి ప్రారంభమయ్యే ఎల్ఎల్సీ 250 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ కాలువ అధ్వానంగా మారడంతో 0 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఆధునికీకరణ పనుల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. కాగా, మిగిలిన 180 కిలోమీటర్ల మేర పనులు మొదలవ్వలేదు. ఈ కాలువ మొత్తం లైనింగ్, ఆధునికీకరణ పనులు చేపట్టడానికి మరో రూ.1,200 కోట్ల నిధులు అవసరమవుతాయి. అలాంటిది కేవలం 20 కిలోమీటర్ల పైప్‌లైన్ కోసం రూ.1,300 కోట్లు వెచ్చించడానికి సిద్ధపడటంలో ఆంతర్యం కమీషన్ల బాగోతమేనని నీటి పారుదల రంగానికి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. లాభం కంటే నష్టమే ఎక్కువ ఆధునికీకరణకు నోచుకోని ఎల్ఎల్సీని పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిని పట్టించుకోని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులకు మాత్రం రూ.1,300 కోట్లు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 2న (జీవో ఆర్టీ నంబర్–153) జీవో జారీ చేసింది. చివరన ఉన్న కోడుమూరు ప్రాంతానికి నీటిని నేరుగా తీసుకెళ్లేందుకు పైప్ లైన్ వేస్తున్నామని అప్పట్లో చంద్రబాబు సర్కారు చెప్పినప్పటికీ ఈ పనులు చేపడితే బళ్లారి, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయాన్ని విస్మరించి గత ప్రభుత్వం జీవో జారీ చేయడం వల్ల ప్రస్తుతం లైనింగ్ పనులు చేపట్టేందుకు ఇబ్బందికరంగా మారిందని బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎల్ఎల్సీ ద్వారా ప్రస్తుతం 1,800 క్యూసెక్కులు వెళుతున్నాయి. ఈ పైప్‌లైన్ వేస్తే 72వ కిలోమీటర్ నుంచి 185వ కిలోమీటర్ వరకు నీటి సరఫరాను 600 క్యూసెక్కులకు తగ్గించి పైప్‌లైన్‌కు మళ్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ఇన్‌ఫ్లో తగ్గి రైతులు నష్టపోతారని, ఇందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలని అంటున్నారు. పైగా పైప్‌లైన్ వేయడానికి భూసేకరణకు మరో రూ.200 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కర్ణాటకలోని సిరిగేరి వద్ద 72వ కిలోమీటర్ నుంచి 185వ కిలోమీటర్ కర్నూలు జిల్లా హళగుంద వరకు బోర్డు పరిధిలోకి వస్తుంది. ఈ దృష్ట్యా బోర్డు అనుమతి తీసుకుని జీవోను విడుదల చేయాలి. అయితే అప్పట్లో టీడీపీలో చేరిన కర్నూలు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకునికి పనులు కట్టబెట్టేందుకే చంద్రబాబు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ ప్రభుత్వం రాగానే ఆ మేరకు నిధులు కేటాయిస్తామని అప్పట్లో చెప్పినట్లు తెలిసింది. -
ఆగని ఆందోళనలు
సాక్షి, చెన్నై: ఎన్ఎల్సీ కార్మికులు మరో మారు సమ్మె నోటీస్ ఇచ్చారు. కార్మికుడి కాల్చివేత ఘటనను కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. మంగళవారం ఆందోళనలతో నైవేలి అట్టుడికింది. బంద్ వాతావరణం నెలకొనడంతో జన జీవనం స్తంభించింది. ఉద్యోగుల హెచ్చరికలతో లిగ్నైట్ కార్పొరేషన్ యాజమాన్యం దిగి వచ్చింది. తమ డిమాండ్లకు యాజమాన్యం ఏ మేరకు తలొగ్గుతుందో దాని ఆధారంగా తదుపరి తమ నిర్ణయం ఉంటుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కడలూరు జిల్లా నైవేలిలోని కేంద్ర ప్రభుత్వ లిగ్నైట్ కార్పొరేషన్లో వివాదం రాజుకుంది. కాంట్రాక్టు కార్మికుడు రాజా అలియాస్ రాజశేఖర్‌ను సీఐఎస్ఎఫ్ జవాన్ కాల్చి చంపడంతో ఆ పరిసరాలు సోమవారం రణరంగాన్ని తలపించాయి. ఈ ఘటనను కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. ఇప్పటికే తమ మీద పలు మార్లు ప్రతాపం చూపించిన సీఐఎస్ఎఫ్ను వెనక్కు పంపించాలన్న డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతం చేయడానికి నిర్ణయించారు. మంగళవారం ఇంజనీర్లు మినహా తక్కిన కార్మికులందరూ విధులు బహిష్కరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, జీవా కాంట్రాక్టు కార్మికులు, తోముసా, పీఎంకే అనుబంధ కార్మిక సంఘాల నేతృత్వంలో పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. ధర్నాలు, రాస్తారోకోలతో నైవేలి అట్టుడికింది. దుకాణాలన్నీ మూతబడ్డాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బంద్‌ను తలపించే రీతిలో నైవేలి నిర్మానుష్యంగా మారింది. సోమవారం అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్‌పై దాడి చేసి, అక్కడి వస్తువులు, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ పరిసరాల్లో భారీ బలగాల్ని మోహరింప చేశారు. డీఐజీ మురుగేషన్, ఎస్పీ రాాధిక అక్కడే తిష్ట వేసి పరిస్థితిని సమీక్షించారు. అలాగే ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేశాయి. చెన్నైలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టి.పాండియన్ నేతృత్వంలో సైదాపేటలో ఆందోళన చేశారు. అయితే, కార్మిక సంఘాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. కార్మికుడిని సీఐఎస్ఎఫ్ హతమార్చినా, యాజమాన్యం నోరుమెదపక పోవడాన్ని తీవ్రంగా పరిగణించాయి. యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఎండగట్టే రీతిలో సమ్మె నోటీసు జారీ చేశారుు. దీంతో యాజమాన్యం ఉలిక్కి పడింది. ఇది వరకు సాగిన సమ్మె ప్రభావం నుంచి తేలుకోని యాజమాన్యం మళ్లీ సమ్మె బాటలో కార్మికులు పయనించకుండా ముందు జాగ్రత్తల్లో పడింది.చర్చలు : ఎన్ఎల్సీ ఉన్నతాధికారులు కార్మిక సంఘాలతో మధ్యాహ్నం చర్చలు చేపట్టారు. అయితే, కొన్ని డిమాండ్లను యాజమాన్యం ముందు కార్మిక సంఘాలు ఉంచాయి. కార్మికుల డిమాండ్ల మంగళవారం రాత్రి ఎన్ఎల్సీ దిగి వచ్చింది. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. అంత్యక్రియల నిమిత్తం రూ.50 వేలు మంజూరు చేసింది. మృతుడి భార్యకు పర్మినెంట్‌గా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తమ సానుభూతిని రాజా కుటుంబానికి తెలియజేశారు. అదే సమయంలో సీఐఎస్ఎఫ్ను వెనక్కు తీసుకునే విషయమై ఎలాంటి హామీని ఎన్ఎల్సీ ఇవ్వలేదు. అయితే, కొన్ని చోట్ల ఉత్తరాదివారిని కాకుండా, తమిళనాడుకు చెందిన సిబ్బందిని భద్రతా విధుల్లో దించే రీతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చర్చలు సత్ఫలితాన్ని ఇవ్వడంతో కార్మిక సంఘాలు తదుపరి కార్యాచరణకు సమావేశం అయ్యారు. ఈ సమావేశానంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అన్ని సంఘాలు ఏకాభిప్రాయానికి వచ్చిన పక్షంలో అర్ధరాత్రి నుంచి విధులకు వెళతామని, లేని పక్షంలో బుధవారం ఉదయం విధులకు హాజరు అవుతామని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. ఏకాభిప్రాయం కుదరని పక్షంలో అని విలేకరులు ప్రశ్నించగా బుధవారం ఉదయాన్నే ప్రకటిస్తామన్నారు. హత్యకేసు...అరెస్టు: రాజాను కల్చి చంపడాన్ని పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. రాజాను తుపాకీతో కాల్చిన సీఐఎస్ఎఫ్ జవాన్‌ను అతి కష్టం మీద గుర్తించారు. జవాన్ నోమన్‌ను అరెస్టు చేసి కడలూరు కోర్టులో హాజరు పరిచారు. అతడిని ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అతడిని కడలూరు జైలుకు తరలించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ నేతృత్వంలో ఆ పార్టీనాయకులు పెద్ద ఎత్తున నైవేలికి చేరుకుని లాఠీ చార్జ్‌లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. రాజాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరు చంటి బిడ్డ. భర్తను కోల్పోయిన వేదనలో ఆస్పత్రి ఆవరణలో ఆమె విలపిస్తుండడం కార్మికులను కంట తడి పెట్టించింది. రాజా కుటుంబాన్ని ఓదార్చారు.