breaking news
Lifting 72KG
-
కండ కలిగితే ఆయుష్షు కలదోయ్!
ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. దీంతోపాటు అప్పుడప్పుడూ కండలు పెంచేందుకు బరువులెత్తండి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే కండలు ప్రదర్శనకు మాత్రమే కాదు...నాలుగు కాలాలు ఎక్కువ బతికేందుకూ సాయపడతాయట. ఇదేదో ఆషామాషిగా చేసిన అధ్యయనం కాదండోయ్. అమెరికాలో సుమారు 30 ఏళ్లుగా 1.5 లక్షల మంది నర్సులను పరిశీలించి చేసుకున్న నిర్ధారణ. రెండేళ్లకు ఒకసారి వీరి నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. వారంలో 90 – 120 నిమిషాలపాటు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు (బరువులు, పుషప్స్, బెంచ్ ప్రెస్, పుల్అప్స్, డంబెల్స్, బార్బెల్స్) చేస్తే చేయని వారితో పోలిస్తే అకారణంగా మరణించే అవకాశాలు 13% తగ్గినట్లు తేలింది. అలాగే గుండెజబ్బులతో మరణించే చాన్స్ 19%, నాడీ సమస్యలతో చావు ముప్పు 27% తక్కువైనట్లు తెలిసింది. బరువులు ఎత్తితే ఆరోగ్యమన్నారు కదా అని అతిగా చేయొద్దని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. వారానికి రెండు గంటల కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు చేసినా అదనపు ప్రయోజనం ఏదీ లభించలేదు. మరో విషయం.. ఏరోబిక్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు రెండు చేస్తే లాభమెక్కువ. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి కనీసం రెండున్నర గంటలు చేసిన వారిలో చావు ముప్పు 26 నుంచి 43 % తక్కువగా ఉన్నట్లు స్పష్టం కాగా... స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు జోడిస్తే ముప్పు మరింత తగ్గింది. ఒకే ఒక్క మినహాయింపు ఏమిటంటే... కేన్సర్ ఉన్న వాళ్లు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు కొంత తగ్గించడం అవసరం. వారంలో గంటపాటు చేసినా మెరుగైన ఫలితాలుంటాయి. కండలతో దీర్ఘాయుష్షు ఎలా...? శరీరం మొత్తమ్మీద జీవక్రియల పరంగా బాగా చురుకుగా ఉండేవి కండల్లోని కణజాలాలు. అందువల్లనే కండలు బలంగా ఉంటే రక్తంలోని గ్లూకోజు నియంత్రణ సాధ్యమవుతుంది. మధుమేహం నుంచి రక్షణ లభిస్తుందన్నమాట. ఇది కాస్తా గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. కండరాలు ముడుచుకుపోయినప్పుడు విడుదలయ్యే మైయోకైన్స్ అనేక జబ్బులకు దారితీయగల ఇన్ఫ్లమేషన్ (మంట/వాపు)లను తగ్గిస్తుంది. కండలు కాలేయం, కొవ్వు కణజాలం, రక్తనాళాలు, ఎముకలు, మెదళ్లకూ మేలు జరుగుతుంది. దీర్ఘకాలంలో ఈ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు రక్తపోటును తగ్గించడమే కాకుండా.. రక్తనాళాలు పెళుసు బారకుండా చేస్తాయి. ఇవి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కండలు గట్టిగా ఉంటే పట్టు బాగా ఉంటుంది కాబట్టి పడిపోవడం, ఎముకలు విరగడం వంటివి తక్కువగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం...జిమ్‌కు వెళ్లినా వెళ్లకపోయినా.. ఇంట్లోనే రోజూ కాసేపు బరువులు ఎత్తేయండి. దీర్ఘాయుష్మాన్ భవ అని మీకు మీరే దీవించేసుకోండి! –సాక్షి, నేషనల్ డెస్క్ -
నూకల ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: నూకల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తెలిపింది. ప్రభుత్వ గోడౌన్లలో బియ్యం నిల్వలు పుష్కలంగా ఉండటంతో పాటు రిటైల్ ధరలూ అదుపులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిల్వలు భారీగా పెరగడంతో ఎగుమతులకు ఆమోదం ఇవ్వాలంటూ ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని గతంలో కోరారు. కాగా 2022 సెప్టెంబర్‌లో నూకల ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. గత ఏడాది బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతుల కోసం నిర్దేశించిన టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) ప్రభుత్వం తొలగించింది. అలాగే ఈ రకం ఎగుమతులపై ఉన్న పూర్తి నిషేధాన్ని ఉపసంహరించుకుంది. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో గాంబియా, బెనిన్, సెనెగల్, ఇండోనేషియా తదితర దేశాలకు 194 మిలియన్ డాలర్ల విలువైన నూకలు ఎగుమతి చేసింది. 2022–23లో 983 మిలియన్ డాలర్లు, 2021–22లో 1.13 బిలియన్ డాలర్ల విలువ చేసే నూకలు భారత్ నుంచి విదేశాలకు చేరాయి. -
వెయిట్... 52 వెయిట్ లిఫ్ట్... 72!
పది.. ముప్ఫై.. యాభై.. కాదండీ! ఏకంగా 72 కిలోల బరువు.. స్వీట్ అండ్ క్యూట్ హీరోయిన్ సమంత కాస్త కష్టపడుతూనే 72 కిలోల వెయిట్‌ను లిఫ్ట్ చేశారు. మరి, ఇంతకీ సమంత వెయిట్ ఎంతో తెలుసా? కొంచెం అటూ ఇటూగా 52 కిలోలు మాత్రమేనట. ఇప్పుడు సమంత వెయిట్ లిఫ్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కంటే 20 కిలోలు ఎక్కువ బరువును ఎత్తడంతో ఆశ్చర్యపోవడం వీక్షకుల వంతైంది. హీరోయిన్లు అంటేనే సున్నితత్వానికి మారుపేరన్నట్టు వ్యవహరిస్తుంటారు. కష్టపడే పనులకు దూరంగా జరుగుతారు. మరి, సమంతకు ఎందుకీ వెయిట్ లిఫ్టింగ్‌లు, వగైరా అంటే.. ఓ రకమైన ఫిట్నెస్ ప్రొగ్రామ్ ఇది. ప్రస్తుతం ఫిట్నెస్ కాపాడుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ పవర్ ట్రైనింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. అందులో ఈ వెయిట్ లిఫ్టింగ్ కూడా ఓ వ్యాయమం. ఐ లైక్ జిమ్.. లవ్ వెయిట్స్ అని కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు సమంత. నాగచైతన్య, మస్కతి ఐస్‌క్రీమ్, వర్క్ - ఈ మూడూ లేకుండా జీవించలేనని ఆ మధ్య సమంత చెప్పారు. ఆ లిస్ట్‌లో ఇక వెయిట్ లిఫ్టింగూ చేరుతుందేమో!


