Kuravi Veerabhadra Swamy Temple.
-
మన గుడి... మన ఉత్సవం: వీరభద్రా... శరణు
గిరిజనులు, గిరజనేతరులు ఉమ్మడిగా కొలిచే దేవుడు కురవి వీరభద్రుడు. వీరన్నా అని శరణు కోరితే కోరికలు నెరవేరతాయని, గండాలు తొల గుతాయని, భూతపిశాచాలు వదులుతాయనీ విశ్వాసం.. ఇక్కడ పూజలు, భక్తుల మొక్కులు చెల్లించడం, వాటిని నెరవేర్చేందుకు చేసే పూజలు వైవిధ్యంగా ఉంటాయి. ప్రతిఏటా శివరాత్రి నుంచి మొదలుకొని మూడు నెలలపాటు జరిగే ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచేగాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు..శైవాగమం...శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఆదిశైవులు శైవాగమం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం సంపూర్ణాభిషేక పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు. అన్నపూజా కార్యక్రమం...ప్రతి దేవాలయంలో శివుడికి నైవేద్యం, పండ్లు పెడతారు. కానీ ఇక్కడ పెరుగు, అన్నం కలిపి శివలింగానికి అలంకరణ చేస్తారు. ఇలా చేస్తే వీరభద్రుని కొలిచే భక్తులకు బాగా పంటలు పండుతాయని, అన్నం లోటు లేకుండా చూస్తాడని నమ్మకం. కరువు కాటకాలు వచ్చిన సందర్భాల్లో కూడా కురవి వీరభద్రుని భక్తులు ఏనాడు ఇబ్బందులు పడలేదని, అంతావీరన్న మహిమ అంటారు భక్తులు.భద్రకాళికి బోనం... కోరిన కోర్కెలు తీరడంతో వీరభద్ర స్వామికి ఉపవాసాలు, నియమాలతో పూజలు నిర్వహించిన భక్తులు.. స్వామివారి పూజ ముగియగానే పక్కనే ఉన్న భద్రకాళీ అమ్మవారికి బోనాలను సమర్పించుకుని నైవేద్యం పెడతారు. అలాగే ఏటపోతులు, కోళ్లను బలి ఇచ్చి మొక్కు చెల్లించుకుంటారు. పొర్లుదండాలు, పానసారం...పిల్లలు లేనివారు సంతాన్రపాప్తి కోసం స్నానం చేసి తడిదుస్తులతో ఆలయ ఆవరణలో పానసారం పట్టి స్వామివారిని వేడుకుంటారు. అలాగే పొర్లుదండాలు పెట్టడం, భూత పిశాచాలు పట్టిన వారు, అనారోగ్యానికి గురైన వారు సైతం తడిబట్టలతో పానసారం పట్టి, ధ్వజస్తంభం ఎక్కించి కట్టివేస్తారు. కోరమీసం పెడితే గౌరవం...కోరమీసం సమర్పిస్తే గౌరవం, అధికారం కల్గుతుందనేది నానుడి. అందుకోసమే రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీచేసేటప్పుడు, ఉద్యోగ దరఖాస్తు చేసేటప్పుడు. వ్యాపారులు తమ వ్యాపారప్రారంభించేటప్పుడు, విదేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు చేసే ప్రయత్నానికి ముందు.. కురవి వీరభద్రునికి కోరమీసం సమర్పిస్తామని మొక్కుకుంటారు. కోరికలు తీరగానే బంగారం లేదా వెండితో కోరమీసాల ఆకృతి తయారు చేసి స్వామివారికి అలంకరిస్తారు. కళ్యాణ బ్రహ్మోత్సవాల వివరాలు ఫిబ్రవరి 25, మంగళవారంఉదయం 9–00 గంటలకు పసుపు కుంకుమలు. ఆలయ పూజారి ఇంటినుంచి పసుపు కుంకుమలు రావడంతో జాతర పనుల ఆరంభం. సా. గం. 7కు గణపతిపూజ, పుణ్యాహవచనం పంచగవ్య్రపాశన, కంకణధారణ, దీక్షాధారణ, అంకురారోపణం, అఖండ దీపారాధన, కలశ స్థాపన, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణం. రాత్రి 10 గంటలకు బసవముద్ద.26 బుధవారం మహాశివరాత్రి. ఉదయం 4–00ల నుండి స్వామివారి దర్శనం. ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 వరకు పూర్ణాభిషేకం, సాయంత్రం 4 నుండి శ్రీ స్వామివారు అలంకారంతో దర్శనం, పాదాభిషేకం, శివాలయంలో ఉదయం 5 నుంచి, రాత్రి 12 వరకు శ్రీ పార్వతీ రామలింగేశ్వరస్వామి వారికి అభిషేకాలు. సాయంత్రం 7కు గ్రామసేవ, ఎదురుకోలు. రాత్రి గం 12–30కు శ్రీ భద్రకాళీ వీరభద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం27 గురువారం, 28 శుక్రవారం నిత్యం ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నిత్యౌపాసన, బలిహరణ.. సాయంత్రం 6 గంటలకు హోమం, సేవలు, గ్రామసేవమార్చి 1, శనివారం ఉదయం 6 నుంచి 12వరకు అభిషేకాలు సాయంత్రం 6–30 గంటలకు తెప్పొత్సవం (కురవి పెద్ద చెఱువు నందు)3, సోమవారం ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నిత్యౌపాసన, బలిహరణ సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, మంగళవారం ఉదయం 10–30కు పూర్ణాహుతి. సాయంత్రం 4గంటలకు బండ్లు తిరుగుట, పారువేట. రాత్రి 10–00 గంటలకు ద్వజ అవరోహణ, బసవముద్ద. – ఈరగాని భిక్షం సాక్షి, మహబూబాబాద్/కురవి -
ఏళ్లుగా ఇలాగే..
కురవి(డోర్నకల్): రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మండలకేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు కొన్నేళ్లుగా మోక్షం లభించడంలేదు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆలయ అభివృద్ధికి రూ.కోటిన్నర నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేయకుండా అర్ధంతరంగా వదిలేశారు. ఇన్నేళ్లుగా పనులు సగంలో ఉన్నాయి. అయితే ఆలయానికి ఏటా భక్తుల సంఖ్యతోపాటు ఆదాయం కూడా పెరుగుతోంది. ఈమేరకు సౌకర్యాలు మెరుగుపడటం లేదు. 2015–2016 ఆర్థిక సంవత్సరంలో రూ.2,18,68,925 ఆదాయం రాగా, ఖర్చు రూ.2,16,61,101గా నమోదైంది. దీంతో ఆదాయంలో ఖర్చు మినహాయిస్తే ఆలయ అభివృద్ధికి మిగులు లేకపోయింది. గత మహాశివరాత్రి సందర్భంగా సీఎం కేసీఆర్ వీరభద్రస్వామి వారికి కోరమీసాలు సమర్పించి మొక్కు చెల్లించారు. ఇదే సమయంలో ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు విడుదల చేస్తామని నిధులను మంజూరు చేశారు. ఏడాది కావస్తున్నా ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఈ శివరాత్రికి కూడా భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. శివరాత్రిని పురస్కరించుకొని ఈనెల 12న కురవి జాతరకు అంకురార్పణ జరగనుంది. రెండుసార్లు టెండర్లు పిలువడానికే కొద్ది నెలలు సమయం పట్టగా, కాంట్రాక్టర్ పనులను నేటికీ మొదలు పెట్టలేదు. జనవరి 12న రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీనికితోడు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నేటికీ ఒప్పందం కుదుర్చుకోలేదు. శంకుస్థాపన తర్వాత వెంటనే పనులు మొదలు పెట్టి ఉంటే ఈ 25 రోజుల్లో సత్రాల వద్ద బంజార సత్రం నిర్మాణం పూర్తయ్యేది. ఈ జాతరలో వేలాది మంది గిరిజన భక్తులు సేదతీరేవారు. కానీ మళ్లీ పాత ఇబ్బందులే ఉండనున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు రూ.48లక్షలతో నిర్మించిన ప్రాకార మండపం 95శాతం పనులు పూర్తయ్యాయి. కాలక్షేప మండపానికి రూ.41.60లక్ష లు కేటాయించగా పనులు మాత్రం స్లాబ్ లెవల్ వరకు నిర్మించారు. ఆలయ ఆవరణ పూర్తిగా ఫ్లోరింగ్ చేసేందుకు రూ.30లక్షలు కేటాయించగా 1శాతం పనులు కాలేదు. ప్రాకార మండపంపై సాలారం కట్టాల్సి ఉంది. ఆ పనులు మొదలు పెట్టకపోవడంతోపాటు ప్రాకార మండపాన్ని సైతం పూర్తి చేయలేదు. దీంతో రెండు పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఆలయ ఆవరణలో చేయాల్సిన గ్రానైట్ రాయితో చేయాల్సిన ఫ్లోరింగ్ పూర్తి కాలేదు. పనులు పెండింగ్‌లో ఉండడంతో అభివృద్ధి కనిపించడంలేదు. రూ.5కోట్ల పనుల వివరాలు వీరభద్రస్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.5కోట్ల అభివృద్ధి పనులను వివిధ పనులకు కేటాయించారు. ప్రాకార మండపానికి (బ్యాలెన్స్పని) రూ.75లక్షలు, ఆలయ ఆవరణలో గ్రానైట్ ఫ్లోరింగ్‌కు రూ.50లక్షలు, మూడు స్టోర్స్ రాజగోపురానికి రూ.30లక్షలు, మినీ రాజగోపురానికి రూ.10లక్షలు, యాగశాలకు రూ.10లక్షలు, రథశాలకు రూ.10.50లక్షలు, నవగ్రహ మండపానికి రూ.3.50లక్షలు, భద్రకాళీ ఆలయ ప్రాకారానికి రూ.13.50లక్షలు, బంజార సత్రానికి రూ.1కోటి, కల్యాణకట్ట పనులకు రూ.16లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.17.50లక్షలు, కాలక్షేప మండపానికి రూ.25లక్షలు, వీరభద్రస్వామి సత్రానికి రూ.60లక్షలు, రెండవ బంజార సత్రానికి రూ.48లక్షలు, ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.3.50లక్షలు, నాగమయ్య ఆలయానికి రూ.13లక్షలు, రథం నిలిపే స్థలానికి ప్రహరీకి రూ.14.50లక్షలు కేటాయించి టెండర్లు పూర్తి చేశారు. -
మొక్కులపై ఆలోచించి మాట్లాడండి: కేసీఆర్
వరంగల్ రూరల్: దేవుళ్లకు మొక్కులు సమర్పించే విషయంలోనూ కొందరు విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? అని ప్రశ్నించారు. దేవుడి మొక్కు విషయంలో కొందరు సన్నాసులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి లాంటి వారు దేవుడి మొక్కులపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని వీరభద్ర స్వామిని మొక్కుకున్నానని గుర్తు చేశారు. శివుడికి ప్రీతికరమైన శివరాత్రి రోజున కురవి వీరభద్రస్వామికి బంగారు కోర మీసాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నానని తెలిపారు. కాగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామికి బంగారు కోర మీసాలు సమర్పించి మొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. పాత వరంగల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం కురవి వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు, డోర్నకల్, మరిపెడ అభివృద్ధికి రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. డోర్నకల్ నియోజకవర్గంలోని 77 గ్రామపంచాయతీలకు రూ. 25 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో టెక్స్టైల్స్ పార్కుకు భూసేకరణ పూర్తయ్యిందని తెలిపారు. త్వరలోనే టెక్స్టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాను ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా సస్యశ్యామలం చేస్తానని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. త్వరలోనే రెండు పంటలకు సరిపడా నీరు అందిస్తామన్నారు.