breaking news
Kuni Operation
-
ప్రాణం తీసిన కు.ని ఆపరేషన్
సాక్షి, మహబూబ్‌నగర్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. భూత్పూర్ మండలం తాటికొండకు చెందిన నాగలక్ష్మి అనే మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన ను ఉస్మానియా ఆసుపత్రిలో చేయించుకుంది. అయితే.. అది వికటించడంతో నాగలక్ష్మీ మృతిచెందింది. కాగా నాగలక్ష్మీ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తాటికొండ గ్రామంలో బంధువులు బుధవారం ఉదయం ఆందోళన నిర్వహించారు. సమాచారమందుకున్న ఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఎస్పీ భాస్కర్ తదితరులు ఆ గ్రామానికి చేరుకుని నాగలక్ష్మీ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వంతో ఆందోళన విరమించారు. -
కు.ని.కి పురుషులు దూరం..
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని నగరంలో కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు చేయించుకోవడానికి పురుషులు వెనకడుగు వేస్తున్నట్లు రికార్డుల ద్వారా స్పష్టమైంది. మహిళల కంటే పురుషులకు కు.ని. ఆపరేషన్ చాలా సులభమని ప్రభుత్వం అనేక జనజాగృతి కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ పురుషులు చొరవ తీసుకోకపోవడం రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఈ ఆపరేషన్ల విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే పురుషులు ముందుకు రావడం లేదని అధికారులు భావిస్తున్నారు. కు.ని.ఆపరేషన్ చేయించుకుంటే లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయోమోననే భయం, అపోహతోనే పురుషులు ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంటున్నారని పలు సర్వేలు తేల్చిచెప్పాయి. గత రెండు, మూడు సంవత్సరాల కాలంలో కు.ని. ఆపరేషన్లు చేయించుకునే పురుషుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది. మహిళలకు కు.ని.ఆపరేషన్లు చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఈ ఆపరేషన్లు విఫలమైన సందర్భాలు ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. అదే పురుషులకు సంబంధించి 90 శాతానికి పైగా విజయవంతమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే వారి లైంగిక జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు బరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ పురుషులు ముందుకు రాకపోవడం అధికారుల్లో కలవరం లేపుతోంది. పురుషులను చైతన్య పరిచేందుకు గతంలో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టింది. కు.ని. చేయించుకున్న పురుషులకు గతంలో ఇచ్చే రూ.550 ప్రోత్సాహక నగదును కేంద్ర ప్రభుత్వం రూ.1,100 పెంచి ఇచ్చింది. అయినప్పటికీ పురుషులు కు.ని.ఆపరేషన్ చేయించుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.