breaking news
kg 1rs
-
కిలో దోస@ రూ.1
పొదలకూరు(సర్వేపల్లి): పొదలకూరు మండలంలో దోస సాగు చేపట్టిన రైతులు నిండా మునిగారు. దోసకాయలు అడిగే నాథుడు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతి ఏడాది దోస సాగులో లాభాలు గడించే రైతులు ఈ ఏడాది కూడా సాగుచేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయని ఆశించారు. అయితే దోసకాయల ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో దోసకాయలు రూ.1 మాత్రమే ధర పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర లేకపోవడంతో రైతులు చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరా దోస సాగుకు రూ.10 వేల వరకు ఖర్చుచేస్తే 150 కిలోల దిగుబడి సాధించే అవకాశం ఉంది. సొంత పొలం, ట్రాక్టర్ ఉంటే ఎకరాకు రూ.2 వేల వరకు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. కౌలు రైతులకైతే ఎకరాలకు రూ.10 వేలు అవుతుంది. ఈ క్రమంలో 150 కిలోల దిగుబడి సాధిస్తే ధరలు లేని కారణంగా ఎకరాలకు రూ.150 మాత్రమే వస్తుంది. ఇంత తీవ్రస్థాయిలో నష్టం ఇటీవల కాలంలో ఏ పంట సాగులోనూ రాలేదని రైతులు వాపోతున్నారు. హైదరాబాద్ ప్రాంతానికి కూడా రైతులు దోసకాయలను ఎగుమతి చేస్తున్నారు. అక్కడ కూడా డిమాండ్ లేకపోవడంతో రైతులకు ఆదాయం తగ్గిపోయింది. అయితే నెల్లూరు మార్కెట్ కంటే హైదరాబాద్ మార్కెట్ కొంత వరకు మేలంటున్నారు. ధరలు దిగాలు మండలంలో నావూరుపల్లి, చెన్నారెడ్డిపల్లి, నావూరు, ముదిగేడు, పొదలకూరు, అయ్యగారిపాళెం తదితర గ్రామాల్లో సుమారు 100 ఎకరాల్లో దోస సాగు చేస్తున్నారు. నావూరుపల్లిలో ఒకే రైతు 30 ఎకరాల్లో దోస సాగు చేపట్టి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దోస సాగులో అనుభవం ఉన్నా మార్కెట్ ధరలు పడిపోతుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఆశలు ఆవిరయ్యాయ్ దోస సాగులో ఆదాయం పొందవచ్చని సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మా గ్రామంలో ముగ్గురు రైతులం 10 ఎకరాల్లో దోస సాగు చేసి నష్టపోయాం. దోసకాయలను అడిగే నాథుడు లేడు. మార్కెట్లో ధరలు పెరగకుంటే పశువులను వదిలివేయాలనే ఆలోచనలో ఉన్నాము. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. –కసిరెడ్డి మధురెడ్డి, రైతు, ముదిగేడు. సాగు చేసి నష్టపోయా 30 ఎకరాల్లో దోస సాగు చేసి నష్టపోయాను. కూలీలు, ఇతర ఖర్చులు చూసుకుంటే ఎకరాకు రూ.10 వేలు ఖర్చయింది. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. హైదరాబాద్కు నేనే సొంతంగా ఎగుమతి చేస్తున్నాను. కిలో దోసకాయలు రూ.1 మాత్రమే పడుతున్నాయి. – తలచీరు అరుణప్రసాద్, రైతు, నావూరుపల్లి -
అక్కడ మరోసారి క్షీణించిన ఉల్లి ధరలు
నాసిక్ : నిన్న మొన్నటి దాకా వినియోగదారులకు కళ్లనీరు తెప్పించిన ఉల్లిధరలు ఇపుడు మహారాష్ట్రలో ఉల్లి రైతులను నష్టాల్లోకి నెడుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి పాయల మార్కెట్ లాసల్గాన్ లో గురువారం ఉల్లి ధర భారీగా పడిపోయింది. ఇప్పుడక్కడ మంచి రకానికి చెందిన వంద కిలోల ఉల్లిపాయలు ధర రూ. 425 పలుకుతున్నాయి. కిలో రూ 4.25 గా నమోదైంది. 2012 జూన్ తర్వాత ఈ స్థాయికి దిగి రావడం ఇదే మొదటి సారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మార్కెట్ డిమాండ్ పోలిస్తే సరఫరాలో పెరుగుదలే ధరలు తగ్గుముఖం పట్టడానికి రైతులు భారీ పరిమాణంలో ఉల్లిపాయలు తీసుకువస్తున్నారనీ, డిమాండ్ తక్కువగా ఉందన్నారు. ఇదికాకుండా, మంచి నాణ్యతలేని ఉల్లిపాయల కారణంగా అత్యంత నష్టం వాటిల్లిందని లాసల్గాన్ ఏపీఎంసీ చైర్మన్ జయదత్త హోల్కర్ చెప్పారు. నాణ్యత లేని క్వింటా ఉల్లిని రూ .100 చొప్పున అమ్ముతున్నారని, ఈ ఏడాది ఆగస్టు 16 నాటికి ఉల్లి కనీస టోకు ధర రూ 150 క్వింటాలు వద్ద నిలిచిందని పేర్కొన్నారు. దీంతోపాటుగా మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నుంచి ఉత్పత్తి బావుందన్నారు. ప్రస్తుతం మార్కెట్ కు వస్తున్న ఉల్లిపాయలు వేసవి పంట ఏప్రిల్, మే నెలలది, నాలుగు ఐదు నెలల పాతది కావడంతో ఇప్పటికే మొలకెత్తుతోందని జాతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ డైరెక్టర్ నానాసాహెబ్ పాటిల్ తెలిపారు. ఇది కూడా ధరల క్షీణతకు కారణమన్నారు. మరోవైపు భారతదేశం లో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయవిధానంలోఅవకతవకలు రైతుల నడ్డి విరుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయడ్డారు. ప్రధానంగా ఉల్లి ధరల్లోని భారీ ఒడిదుడుకులకు ఇదే నిదర్శనమన్నారు. ఫలితంగా అటు ఉత్పత్తిదారులు, ఇటు వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలను పటిష్టపర్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్పత్తిదారులకు ప్రభుత్వాలు మార్కెట్ సదుపాయాలు, మంచి, వేగవంతమైన రవాణా వ్యవస్థలను కల్పించి, ధరల్లోని అస్థిరతను తొలగించాలనీ, దీనికి రాజకీయ సంకల్పం అవసరం విశ్లేషకుల వాదన.