breaking news
Kazipet Town Railway Station
-
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ‘భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ట్రైన్ నంబరు 17233 సికింద్రాబాద్ నుంచి బల్లర్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల పదమూడు నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది. ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతించుచున్నాం.’ ఇదీ నిత్యం స్టేషన్లలో వినిపించే రైల్వే అధికార ప్రకటనలు. కొంతకాలంగా రైళ్ల రాకపోకలు తీవ్ర ఆలస్యమవుతూ ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ఎప్పుడొస్తయో తెలియదు బల్లర్షా నుంచి కాజీపేట మధ్య నడిచే కాజీపేట ఎక్స్‌ప్రెస్, సిర్పూర్టౌన్ నుంచి భద్రాచలంరోడ్డు వరకు వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌లు ఏ రోజూ సమయపాలన పాటించడం లేదు. ఉదయం, సాయంత్ర పూట ఆ యా స్టేషన్లలో ప్రయాణికులు గంటల కొద్దీ వేచి చూ స్తున్నారు. రైళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక సమ యం వృథా చేసుకుంటున్నారు. దీంతో తమ రోజూ వారి కార్యకలాపాల్లోనూ ప్రభావం చూపుతోంది. ‘భాగ్యనగర్’ రోజూ లేటే! బల్లార్షా నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి బల్లార్షా మధ్య రోజూ నడుస్తున్న ట్రైన్లు ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఆలస్యంగానే నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి 3.35 గంటలకు బయలుదేరి కాగజ్‌నగర్ వరకు వెళ్లాలంటే రాత్రి ఒకటి, రెండు గంటలవుతోంది. దీంతో మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచిని రోడ్, ఆసిఫాబాద్ రోడ్, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ) వరకు వెళ్లాల్సిన ప్రయాణికులు అరిగోస పడుతున్నారు. రాత్రి పూట రైలు దిగి ఇంటికి వెళ్ళేందుకు రవాణా సౌకర్యం లేక స్టేషన్లోనే పడుకుని తెల్లారి వెళ్తున్నారు. గతంలో 9 గంటలకే వస్తుండగా ప్రస్తుతం తీవ్ర జాప్యం జరుగుతోంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లూ ఆలస్యమే సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్సిటీ, కాగజ్‌నగర్ సూపర్‌పాస్ట్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఏపీ, గ్రాండ్ ట్రంక్, నవజీవన్, చెన్నై సెంట్రల్, రాప్తిసాగర్తో పాటు పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు సైతం గంట, రెండు గంటల ఆలస్యంతో నడుస్తున్నాయి. అన్ని రైళ్లూ ఆలస్యమేనా? దూరం, దగ్గర అని తేడా లేకుండా చవక, భద్రత, సౌకర్యవంతంగా గమ్యస్థానాలను చేరుకునేందుకు ఎక్కువగా పేద, మధ్య తరగతి వారు రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తారు. అయితే సకాలంలో రైళ్లు స్టేషన్లకు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది నెలలుగా ఇదే తీరుగా ఉండడంతో వివిధ అవసరాల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, సికింద్రాబాద్, విజయవాడ, చెన్నై వైపు వెళ్లే వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యంగా నడుస్తున్నాయని మైకుల్లో అనౌన్స్ చేసి అసౌకర్యానికి చింతించుచున్నాం అంటూ చెప్పి రైల్వే అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న జిల్లా నుంచి కాజిపేట నుంచి కాగజ్‌నగర్, భద్రాచలం రోడ్ స్టేషన్ల మధ్య నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు ప్రయాణం చేస్తుంటారు. వీరితో పాటు వివిధ అవసరాలకు హైదరాబాద్ రాకపోకలు సాగించేవారు ఉన్నారు. పెరిగిన టికెట్ రేట్లు గతంతో పోలిస్తే టికెట్ల రేట్లు సైతం భారీగా పెరిగాయి. కరోనా ప్రభావంతో సీనియర్ సిటిజన్స్, వివిధ కేటగిరీలకు ఇస్తున్న రాయితీలు సైతం ఎత్తేశారు. ప్యాసింజర్ ట్రైన్ల చోట ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. దీంతో టికెట్ రేట్లు సైతం పెరిగాయి. గతంలో ఉన్న టికెట్ ధరలతో పోలిస్తే రూ.15 నుంచి 20 వరకు పెరిగాయి. -
కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో విజిలెన్స్ దాడులు
టికెట్ బుకింగ్ క్లర్క్ వద్ద లభించిన అదనపు డబ్బు కాజీపేట రూరల్ : కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లోని టికెట్ బుకింగ్ కౌంటర్ కార్యాలయంలో ఆదివారం విజిలెన్స్ దాడులు జరిగాయి. సికింద్రాబాద్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కౌంట ర్లో తనిఖీ చేయగా, బుకింగ్ క్లర్క్ జేబులో టికెట్ల డబ్బులు కాకుండా అదనంగా కొంత దొరికాయి. దీనిపై అధికారులు ప్రశ్నించగా వినాయకుడి నవరాత్రి ఉత్సవాల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించేందుకు తన సొంత డబ్బులు తీసుకొచ్చానని చెప్పాడు. దీంతో అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయడంతో పాటు అదనపు డబ్బును రైల్వే ఖాతాలో జమ చేశారు. దీనిపై విచారణ పూర్తయ్యాక కేసు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. కాగా కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో జరిగిన విజిలెన్స్ దాడులతో రైల్వే అధికారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తాయి. కాజీపేట జంక్షన్ కేంద్రంగా కొన్ని విభాగాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారులు దాడులు చేపడుతున్నారని సమాచారం. -
ప్రధాని దృష్టికి కాజీపేట రైల్వే సమస్యలు
కాజీపేటరూరల్ : కాజీపేట రైల్వే సమస్యలను కాజీపేట తెలంగాణ రైల్వే జేఏసీ బృందం ఈనెల 25వ తేదీన ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించనుంది. ఈ మేరకు అనుమతి లభించినట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ బి.రాంనాథం ఆదివారం తెలిపారు. జేఏసీ బృందం ఈ నెల 24న ఢిల్లీకి బయలుదేరనుందని పేర్కొన్నారు. విన్నవించే సమస్యలివే.. రెండున్నర దశాబ్దాల క్రితం కాజీపేటకు మంజూరై పంజాబ్‌లోని కపుర్తాలకు తరలిన కోచ్‌ఫ్యాక్టరీ స్థానంలో ఇక్కడ కొత్తగా కోచ్‌ఫ్యాక్టరీ మంజూరు చేయూలి. కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలి. జంక్షన్ సబ్ డివిజన్ పరిధిలో ప్రధాన రైల్వే డిపోలను అభివృద్ధి చేయూలి. కాజీపేటకు మంజూరైన రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు వెంటనే ప్రారంభించాలి, పిట్లైన్లను నిర్మించాలి. డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్లను పీఓహెచ్ షెడ్లుగా, ఇక్కడి రైల్వే ఆస్పత్రిని సబ్‌డివిజన్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయూలి. ఐటీఐ విద్యార్థులకు అప్రెంటీస్ ఆక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించి ఢిల్లీ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ, చెన్నై, కేరళ, తదితర దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలి. కాజీపేట జంక్షన్ నుంచి విజయవాడ, బల్లార్షా మార్గంలో కొత్త రైళ్లు ప్రారంభించాలి. కాజీపేట రైల్వే మిక్స్డ్ హైస్కూల్లో సెంట్రల్ సిలబస్‌ను ప్రవేశపెట్టి బయటి విద్యార్థులకు కోటా కల్పించాలి.