breaking news
Kalyana Brahmotsava
-
మన గుడి... మన ఉత్సవం: వీరభద్రా... శరణు
గిరిజనులు, గిరజనేతరులు ఉమ్మడిగా కొలిచే దేవుడు కురవి వీరభద్రుడు. వీరన్నా అని శరణు కోరితే కోరికలు నెరవేరతాయని, గండాలు తొల గుతాయని, భూతపిశాచాలు వదులుతాయనీ విశ్వాసం.. ఇక్కడ పూజలు, భక్తుల మొక్కులు చెల్లించడం, వాటిని నెరవేర్చేందుకు చేసే పూజలు వైవిధ్యంగా ఉంటాయి. ప్రతిఏటా శివరాత్రి నుంచి మొదలుకొని మూడు నెలలపాటు జరిగే ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచేగాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు..శైవాగమం...శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఆదిశైవులు శైవాగమం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం సంపూర్ణాభిషేక పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు. అన్నపూజా కార్యక్రమం...ప్రతి దేవాలయంలో శివుడికి నైవేద్యం, పండ్లు పెడతారు. కానీ ఇక్కడ పెరుగు, అన్నం కలిపి శివలింగానికి అలంకరణ చేస్తారు. ఇలా చేస్తే వీరభద్రుని కొలిచే భక్తులకు బాగా పంటలు పండుతాయని, అన్నం లోటు లేకుండా చూస్తాడని నమ్మకం. కరువు కాటకాలు వచ్చిన సందర్భాల్లో కూడా కురవి వీరభద్రుని భక్తులు ఏనాడు ఇబ్బందులు పడలేదని, అంతావీరన్న మహిమ అంటారు భక్తులు.భద్రకాళికి బోనం... కోరిన కోర్కెలు తీరడంతో వీరభద్ర స్వామికి ఉపవాసాలు, నియమాలతో పూజలు నిర్వహించిన భక్తులు.. స్వామివారి పూజ ముగియగానే పక్కనే ఉన్న భద్రకాళీ అమ్మవారికి బోనాలను సమర్పించుకుని నైవేద్యం పెడతారు. అలాగే ఏటపోతులు, కోళ్లను బలి ఇచ్చి మొక్కు చెల్లించుకుంటారు. పొర్లుదండాలు, పానసారం...పిల్లలు లేనివారు సంతాన్రపాప్తి కోసం స్నానం చేసి తడిదుస్తులతో ఆలయ ఆవరణలో పానసారం పట్టి స్వామివారిని వేడుకుంటారు. అలాగే పొర్లుదండాలు పెట్టడం, భూత పిశాచాలు పట్టిన వారు, అనారోగ్యానికి గురైన వారు సైతం తడిబట్టలతో పానసారం పట్టి, ధ్వజస్తంభం ఎక్కించి కట్టివేస్తారు. కోరమీసం పెడితే గౌరవం...కోరమీసం సమర్పిస్తే గౌరవం, అధికారం కల్గుతుందనేది నానుడి. అందుకోసమే రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీచేసేటప్పుడు, ఉద్యోగ దరఖాస్తు చేసేటప్పుడు. వ్యాపారులు తమ వ్యాపారప్రారంభించేటప్పుడు, విదేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు చేసే ప్రయత్నానికి ముందు.. కురవి వీరభద్రునికి కోరమీసం సమర్పిస్తామని మొక్కుకుంటారు. కోరికలు తీరగానే బంగారం లేదా వెండితో కోరమీసాల ఆకృతి తయారు చేసి స్వామివారికి అలంకరిస్తారు. కళ్యాణ బ్రహ్మోత్సవాల వివరాలు ఫిబ్రవరి 25, మంగళవారంఉదయం 9–00 గంటలకు పసుపు కుంకుమలు. ఆలయ పూజారి ఇంటినుంచి పసుపు కుంకుమలు రావడంతో జాతర పనుల ఆరంభం. సా. గం. 7కు గణపతిపూజ, పుణ్యాహవచనం పంచగవ్య్రపాశన, కంకణధారణ, దీక్షాధారణ, అంకురారోపణం, అఖండ దీపారాధన, కలశ స్థాపన, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణం. రాత్రి 10 గంటలకు బసవముద్ద.26 బుధవారం మహాశివరాత్రి. ఉదయం 4–00ల నుండి స్వామివారి దర్శనం. ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 వరకు పూర్ణాభిషేకం, సాయంత్రం 4 నుండి శ్రీ స్వామివారు అలంకారంతో దర్శనం, పాదాభిషేకం, శివాలయంలో ఉదయం 5 నుంచి, రాత్రి 12 వరకు శ్రీ పార్వతీ రామలింగేశ్వరస్వామి వారికి అభిషేకాలు. సాయంత్రం 7కు గ్రామసేవ, ఎదురుకోలు. రాత్రి గం 12–30కు శ్రీ భద్రకాళీ వీరభద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం27 గురువారం, 28 శుక్రవారం నిత్యం ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నిత్యౌపాసన, బలిహరణ.. సాయంత్రం 6 గంటలకు హోమం, సేవలు, గ్రామసేవమార్చి 1, శనివారం ఉదయం 6 నుంచి 12వరకు అభిషేకాలు సాయంత్రం 6–30 గంటలకు తెప్పొత్సవం (కురవి పెద్ద చెఱువు నందు)3, సోమవారం ఉదయం 6 గంటలకు అభిషేకాలు, నిత్యౌపాసన, బలిహరణ సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, మంగళవారం ఉదయం 10–30కు పూర్ణాహుతి. సాయంత్రం 4గంటలకు బండ్లు తిరుగుట, పారువేట. రాత్రి 10–00 గంటలకు ద్వజ అవరోహణ, బసవముద్ద. – ఈరగాని భిక్షం సాక్షి, మహబూబాబాద్/కురవి -
వైభవంగా ముగిసిన భద్రకాళి బ్రహ్మోత్సవాలు
చివరి రోజు వైభవంగా సుదర్శన ప్రతిష్ట, చక్రస్నానం హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీభద్రకాళి ఆలయంలో కొనసాగుతున్న భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశారుు. చివరిరోజు ఉదయం 5 గంటల నుంచి నిత్యాహ్నికం, చతుస్థానార్చన, గణపతి పూజలు చండీహవనం, చూర్ణోత్సవం నిర్వహించారు. 11గంటలకు అమ్మవారిని యోగలక్ష్మీగా అలంకరించి శరభవాహనంపై ఊరేగిం చారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి, ఒంటి గంటకు బలిహరణ జరిపారు.. ధ్వజారోహణం చేశారు. జిల్లా మేదరి సంఘం, కురుమ సంఘం సౌజన్యంతో ప్రసాదాల వితరణ జరిగింది. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ముఖ్యార్చకులు చెప్పెల వెంకటనాగరాజుశర్మ, అర్చకులు టక్కరసు సత్యం, సుధాకరశర్మ, సంఖ్యా శాస్త్ర నిపుణులు మల్లావజ్జుల రామకృష్ణశర్మ, దత్తసాహిత్శర్మ , వేదవిద్యార్థులు శ్రీభద్రకాళి శరణం మమః అంటూ అస్త్రబేరాన్ని తలపై మోస్తూ భద్రకాళి చెరువులోకి వెళ్లి వైభవంగా సుదర్శన చక్రస్నానం నిర్వహిం చారు. ఆలయంలో జరిగే ఉత్సవాల్లో అవబృధస్నానం నిర్వహిస్తుండడం సాధారణం. మొదటిసారిగా సుదర్శన ప్రతిష్టతోపాటు చక్రస్నానం నిర్వహించడం విశేషం. వైభవంగా పుష్పయాగం.. సాయంత్రం 7గంటలకు అమ్మవారిని మోక్షలక్ష్మీగా అలంకరించి పుష్పరథంపై ఊరేగించారు. పలుప్రాంతాల నుండి తెప్పించిన కిలోల కొద్దీ పసుపు, ఎరుపు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు భద్రకాళి శేషు అధ్వర్యంలో నారింజ రంగు గులాబీలు, కనకాంబరాలు, మల్లెలు, లిల్లీలు, వివిధ రంగుల చామంతులతో శోభాయమానంగా పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ కట్టా అంజనీదేవి, సీనియర్ ఉద్యోగులు కూచన హరినాథ్, అద్దంకి విజయ్, వెంకటయ్య, కృష్ణ, రాము, చింతశ్యాం పర్యవేక్షించారు. పుష్పయాగంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్, రేవతి దంపతులు, బ్రాహ్మణసంఘం రాష్ట్ర అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్శర్మ, జిల్లా అర్బన్ అధ్యక్షులు వల్లూరి పవన్‌కుమార్ , ఆర్యవైశ్యప్రముఖులు అయితాగోపినాధ్ పాల్గొన్నారు. ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ జేసీ రఘునాధ్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, నర్సింగరావు దంపతులు పాల్గొన్నారు.