breaking news
jyotibuddha Prakash
-
రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధప్రకాశ్ సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీగా బదిలీ అయ్యారు. సింగరేణి సంస్థ సీఎండీ అదనపు బాధ్యతల నుంచి డి.కృష్ణభాస్కర్‌ను ప్రభుత్వం ఉపసంహరించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలుగా విభజించిన ప్రభుత్వం ఈ మూడింటికి ప్రత్యేకాధికారి (స్పెషల్ ఆఫీసర్)గా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను నియమించడంతోపాటు, మూడు కార్పొరేషన్లకు ముగ్గురు ఐఏఎస్‌లను కమిషనర్లుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, నాన్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నైనీ బొగ్గు బ్లాకు ఓవర్‌బర్డన్ తొలగింపునకు సంబంధించి నిర్వహించిన టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సింగరేణి సీఎండీగా అదనపు బాధ్యతల్లో ఉన్న కృష్ణభాస్కర్‌ను తప్పించి పూర్తిస్థాయి సీఎండీగా జ్యోతిబుద్ధప్రకాశ్‌ను ప్రభుత్వం నియమించింది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచీ ఘోష్‌కు ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఎస్సీల అభివృద్ధి విభాగం కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు పోస్టుల బాధ్యతల నుంచి జ్యోతిబుద్ధప్రకాశ్‌ను ఉపసంహరించుకుంది. ఎస్టీల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఎస్టీల అభివృద్ధి విభాగం కమిషనర్‌గా సబ్యసాచీ ఘోష్‌కు మరో రెండు పోస్టుల్లో కూడా సర్కార్ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు పోస్టుల అదనపు బాధ్యతల నుంచి జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ను ఉపసంహరించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ డి.దివ్యకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ పోస్టు అదనపు బాధ్యతల నుంచి శ్రుతి ఓఝాను తప్పించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 7 కార్పొరేషన్లు, 20 పురపాలికలను విలీనం చేసి ఏర్పాటు చేసిన కొత్త జీహెచ్ఎంసీని ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్విభజించిన విషయం తెలిసిందే. కాగా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ను అదే పోస్టులో కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు జి.సుృజన, టి.వినయ్‌కృష్ణారెడ్డిలను సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లుగా బదిలీ చేసింది. సెర్ప్ అదనపు సీఈఓ పి.కాత్యాయినీ దేవిని ప్రజావాణి నోడల్ అధికారిగా బదిలీ చేస్తూ ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి డి.దివ్యను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం జేఎండీగా అదనపు బాధ్యతల్లో పి.కాత్యాయినీ దేవి కొనసాగుతారని స్పష్టం చేసింది. హైదరాబాద్ జలమండలి ఈడీని అదే సంస్థ జేఎండీగా బదిలీ చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్డీ యు.రఘురామ్శర్మను పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆయన మంత్రి శ్రీధర్‌బాబుకు ఓఎస్డీగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపింది. -
లీజు భూముల ఆక్రమణ
► రూ.500 కోట్ల విలువైన స్థలాలు కబ్జా ► 17 అసెస్మెంట్లు చేసిన కమిషనర్ ► మున్సిపల్ వైస్ చైర్మన్ , కౌన్సిలర్ల ఫిర్యాదుతో వెలుగులోకి.. ► సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఆగ్రహం ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపాల్టీ లీజు భూములు కబ్జాకు గురయ్యాయి. వందల కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. బల్దియా వైస్ చైర్మన్ , కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ –వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ స్టాండింగ్ అడ్వకేట్ హన్మంత్‌రావు, జేసీ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, ఆదిలాబాద్ ఎమ్మార్వో, అసిస్టెంట్ ల్యాండ్ రికార్డు సర్వేయర్లతో ఇటీవల ప్రత్యేకంగా మూడు గంటలకు పైగా సమీక్ష సమావేశం నిర్వహించి.. లీజు భూముల ఆక్రమణపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారులతో కమిటీ వేసి తాను ప్రత్యక్షంగా దృష్టి సారిస్తానని పేర్కొన్నట్లు తెలిసింది. 45 నుంచి 25కు చేరిన లీజు భూములు ఆదిలాబాద్ మున్సిపాల్టీలో గతంలో 45 లీజు భూములు ఉండేవి. రాను రాను ప్రస్తుతం 24 భూములు మాత్రమే మిగిలాయి. ఇందులో ప్రధానంగా రూ.500 కోట్ల విలువైన భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో కోట్ల విలువైన మున్సిపల్ లీజు భూములు సిమెంట్ పైపు ఇండస్ట్రీస్ పేరుతో అర్పన్ లాల్ సూరికి 1968లో 15 ఏళ్లపాటు మున్సిపల్ అధికారులు లీజుకు ఇచ్చారు. లీజు గడువు ముగియడంతో అర్పన్ Sలాల్ సూరి మళ్లీ 1984లో లీజు గడువు పొడగింపునకు దరాఖాస్తు చేశారు. ఆ గడువు 1989 వరకు పొడగిస్తూ మున్సిపల్ కౌన్సిల్ నంబరు 62తో తీర్మానించింది. 1989 నుంచి 2016 వరకు లీజు డబ్బులు రూ.8,44,553 అర్పన్ Sలాల్ సూరి బకాయి పడ్డాడు. బకాయి చెల్లించాలని కమిషనర్ అలివేలు మంగతాయారు 17 నవంబర్ 2016న అండర్ సెక్షన్ 194 ఆఫ్ ఏపీఎం యాక్టు 1965 ప్రకారం నోటీసులు అందజేశారు. లీజు కట్టని పక్షంలో మున్సిపల్ ఆధీనంలోకి తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో అర్పన్ లాల్ సూరి భూమి, అక్కడి స్థలం తమదేనని లీజు చెల్లించనని, ఇది మున్సిపల్ స్థలం కాదని తిరిగి బదులు ఇచ్చారు. లీజు భూములకు 17 అసెస్మెంట్లు చేసిన కమిషనర్ అర్పన్ లాల్ సూరి లీజు ల్యాండ్ మున్సిపాలిటీదే అయినప్పటికీ 2006లో అప్పటి రెవెన్యూ అధికారులు, కుమ్మక్కై వారు కుటుంబ సభ్యుల పేరిట ఐదు పట్టాలు అందించారు. ఒక్కో పట్టాకు రూ.96 వేలు తీసుకుని, రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇంక్రోచ్మెంట్ కింద పట్టాలు ఇచ్చారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ వాటికి నోఆబ్జక్షన్ కాపీని అందించడం గమనార్హం. జీవో నంబర్ 508 ప్రకారం చిన్న ఇల్లు ఉన్నవారికి మాత్రమే ఇటువంటి జీవో వర్తిస్తుంది. కమర్షియల్ బిల్డింగ్‌లకు ఇది వర్తించదు. నిబంధనల ప్రకారం 480 గజాలు ఉన్న భూములకు సైతం ఈ జీవో వర్తించదు. దీంతోపాటు సర్వే నంబర్ 1 ప్రాంతం చెరువు ప్రాంతంగా గుర్తించారు. చెరువు ఉన్న ప్రాంతంలో పట్టాలను నిబంధనలకు విరుద్ధంగా అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్పన్ లాల్ సూరికి ప్రస్తుత కమిషనర్ నోటీసులు అందించిన తర్వాత 16 ఫిబ్రవరి 2017లో అర్పన్ లాల్ సూరి సబ్ లీజర్ల పేరిట 17 మందికి అసెస్మెంట్లు చేయడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ కల్పించుకోని పక్షంలో వందల కోట్ల లీజు ల్యాండ్లు కబ్జాదారుల చేతిలోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినోదానికి ఇస్తే కమర్షియల్ చేశారు... మున్సిపల్ పరిధిలోని లీజు ల్యాండ్ 2002లో గణేశ్ థియేటర్ వినోదం కోసం దండ మహేశ్ పేరుపై లీజుకు ఇచ్చారు. దీని గడువు 2007లో ముగిసింది. తిరిగి 2007లో 17ఏళ్లపాటు పొడగించారు. ప్రస్తుతం 2017 మేలో లీజు గడువు ముగియనుంది. ఈ లీజుల్యాండ్ థియేటర్ నిర్వహణ కోసం వినోదం కోసం అప్పటి కలెక్టర్ సుకుమార్ అప్పగించారు. థియేటర్ నిర్వాహకులు దాని ముందర కమర్షియల్‌గా 29 దుకాణాలు నిర్మించి.. ఒక్కో దుకాణదారు నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు తీసుకుంటూ, అడ్వాన్స్ గా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు తీసుకుంటున్నారు. సంవత్సరానికి రూ.కోటిపైగా ఆర్జిస్తూ మున్సిపాలిటీకి మాత్రం రూ.7.80 లక్షలు చెల్లిస్తున్నారు. ఫలితంగా ఏడాదికి రూ.కోటిపైగా మున్సిపాలిటీ నష్టపోతోంది. ఏళ్లుగా సాగుతున్న ఈ తంతు రానున్న మేలో గడువు ముగియనుంది. అధికారులు దృష్టి సారించి లీజు గడువును పొడగించకుండా మున్సిపాలిటీ ఆదాయాన్ని పరిరక్షించాలి్సందిగా ప్రజలు కోరుతున్నారు. మరింత ఆక్రమణలు.. మున్సిపాలిటీలో అప్రూవల్ లే ఔట్లు, బహిరంగ స్థలాలు, పార్కింగ్ స్థలాలు కబ్జాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని స్పిన్నింగ్ మిల్లు సమీపంలో యాక్షన్ ప్లాటు నం.1, నం.2లో మున్సిపల్ ఇచ్చిన విస్తీర్ణం కంటే అదనంగా ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే తరహాలో పట్టణ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే ద్వారకానగర్‌లోని రఘునాథ్ మిట్టల్ కేరాఫ్ జీఎన్ రావు పెట్రోల్ బంక్ ప్రాంతంలో మున్సిపాలిటీ రోడ్డు స్థలం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలంలో జిల్లాకు చెందిన బడానేత హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి.


