breaking news
India- France
-
ఫ్రాన్స్ అధ్యక్షుడు, సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ
జి–20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోమ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. భారత్–ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మాక ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భదత్రా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. మోదీ, మాక్రాన్ నడుమ ఫలవంతమైన చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువరూ అభిప్రాయాలను పంచుకున్నారని వెల్లడించింది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడనున్నాయని పేర్కొంది. నరేంద్ర మోదీ రోమ్‌లో సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్‌తోనూ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను ఈ సందర్భంగా సమీక్షించారు. లూంగ్‌తో మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్విట్టర్లో వెల్లడించింది. భారత సంతతి ప్రజలతో సమావేశం ఇటలీలోని పలువురు భారత సంతతి ప్రజలు, భారతీయులను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ఈ మేరకు ఫొటోలను మోదీ ట్విట్టర్లో పంచుకున్నారు. -
మోదీ దేశద్రోహానికి పాల్పడ్డారు
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదంలో మంగళవారం కొత్తగా మరో అంశం తెరపైకి వచ్చింది. భారత్–ఫ్రాన్స్‌లు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ముందే దీని గురించి పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి సమాచారం అందిందనీ, అంబానీ నాడు ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్–యైవ్స్ లీ డ్రియాన్స్ కార్యాలయాన్ని కూడా సందర్శించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు రుజువుగా ఆయన ఓ ఈ–మెయిల్‌ను బహిర్గతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోద అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి అనిల్ అంబానీకి రఫేల్ ఒప్పంద వివరాలను ముందుగానే తెలియజేయడం ద్వారా దేశద్రోహానికి పాల్పడ్డారంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్‌కు మధ్యవర్తిగా మోదీ వ్యవహరించారని అన్నారు. బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది. అసలు ఆ ఈ–మెయిల్లో ఉన్న విషయం రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించినదే కాదని బీజేపీతోపాటు అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ స్పష్టం చేసింది. ఎయిర్‌బస్ సంస్థ ఉద్యోగి హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించిన వివరాలను అందులో ప్రస్తావించారంది. ‘కాంగ్రెస్ బయట పెట్టిన ఈ–మెయిల్ రిలయన్స్ డిఫెన్స్, ఎయిర్‌బస్ సంస్థల మధ్య పౌర, రక్షణ హెలికాప్టర్ల ఒప్పంద చర్చలకు సంబంధించినది. ఇందులో రఫేల్ ప్రస్తావన లేదు.’ అని రిలయన్స్ డిఫెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. రక్షణ మంత్రి కన్నా ముందు అంబానీకే.. 2015 మార్చి 28 నాటి తేదీతో ఉన్న, ఎయిర్‌బస్ ఉద్యోగి నికోలస్ ఛాముస్సీ ‘అంబానీ’ అనే సబ్జెక్ట్‌తో ముగ్గురికి పంపిన ఈ–మెయిల్‌ను రాహుల్ మీడియాకు విడుదల చేశారు. రఫేల్ ఒప్పందం ఖరారు కావడానికి ముందే అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ మంత్రిని కలిసి నాటికి ఇంకా రూపుదిద్దుకుంటున్న ఎంవోయూ గురించి మాట్లాడారనీ, మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఒప్పందాన్ని ఖరారు చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారని రాహుల్ ఆరోపించారు. అంటే నాటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్‌లకంటే ముందుగానే అనిల్ అంబానీకి రఫేల్ ఒప్పందం విషయం తెలుసునని రాహుల్ పేర్కొన్నారు. ‘ఇది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన. నాటికి ఈ ఒప్పందం గురించి తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి ప్రధాని మోదీయే అనిల్‌కు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఇది దేశద్రోహమే. గూఢచారులు చేసే పనిని మోదీ చేస్తున్నారు. రహస్యాలను వెల్లడించనని ప్రమాణం చేసిన తర్వాత ఆయన రక్షణ ఒప్పందాల రహస్యాలను బయటపెడుతున్నారు. అనిల్‌కు మధ్యవర్తిగా మోదీ వ్యవహరిస్తున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై నేర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రఫేల్ అంశం గతంలో కేవలం అవినీతి, విధానపరమైన అవకతవకలకు సంబంధించినదేనని తాము భావించామనీ, ఇప్పుడు ఇది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘనగా తేలడంతో మరింత తీవ్రమైన అంశంగా మారిందన్నారు. రఫేల్‌పై జేపీసీ విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు. రాహుల్ తన మొహంపైనే పేడ కొట్టుకున్నారు: బీజేపీ ప్రధానమంత్రిని నిందించడం ద్వారా రాహుల్ తన మొహంపైనే పేడ కొట్టుకున్నారనీ, ఆయన అబద్ధాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘గాంధీ కుటుంబం నుంచి వచ్చిన గత ప్రధాన మంత్రులతో మా పార్టీకి తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయి. వారి హయాంలో జరిగిన అనేక అవినీతి రక్షణ ఒప్పందాలే ఇందుకు కారణం. కానీ మేం ఎన్నడూ వారిపై దేశద్రోహం ఆరోపణలు చేయలేదు. రాహుల్ ఓ అబద్ధాల యంత్రం. తాజా అబద్ధాలు ఆయన సిగ్గులేని తనానికి, బాధ్యతారాహిత్యానికి ఓ నిదర్శనం’ అని అన్నారు. రాహుల్ బయటపెట్టిన ఎయిర్బ స్ ఈ–మెయిల్ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించినది తప్ప రఫేల్ యుద్ధ విమానాల అంశం అందులో లేదని స్పష్టం చేశారు. రాహులే విదేశీ కంపెనీలకు లాబీయిస్ట్‌గా పనిచేస్తున్నారన్నారు. ఎయిర్‌బస్ సంస్థ అంతర్గత ఈ–మెయిల్ రాహుల్‌కు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. -
'మోదీజీ.. పనికిమాలిన యుద్ధ విమానాలు కొనొద్దు'
రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీ అహేతుకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న మోదీ.. 36 రఫల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ రూపొందించే రఫల్ యుద్ధవిమానాలు అత్యంత పనికిమాలినవని, ప్రపంచంలోని మిగతా దేశాలేవీ ఆ విమానాలని కొనుగోలు చేసేందుకు ముందుకురాలేదని స్వామి చెప్పారు. 'రఫల్ ఫైటర్ల ఇంధన సామర్థ్యం చాలా తక్కువ. ఇక పనితీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైగా మొదట ఆ డీల్ కుదుర్చుకుంది గత యూపీయే ప్రభుత్వం! వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆ యుద్ధవిమానాల్ని కొనొద్దని మోదీకి విన్నవిస్తున్నా' అని అన్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒకవేళ ఈ విషయంలో ప్రభుత్వ మొండిగా వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఒప్పంద పత్రాలు పరిశీలించిన అనంతరం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని చెప్పారు.