breaking news
IIT Mandi
-
'కుంభవృష్టికి కారణం.. జంతు హింసే..'
డెహ్రాడూన్: మాంసం కోసం జంతువులను చంపడం వల్లే హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా అన్నారు. ఈ కారణంగానే కుంభవృష్టి వంటి విపత్తులు సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు. జంతువులను చంపడం వల్లే పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుందని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాంసం కోసం జంతువులను చంపడం వల్ల పర్యావరణం ఎలా ప్రభావితమౌతుందో ప్రస్తుతం ప్రజలు చూడలేకపోతున్నారని బెహెరా చెప్పారు. కానీ త్వరలో ఈ పరిణామాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. ప్రసంగంలో మంచి మనుషులుగా మారడానికి ఏం చేయాలని బెహెరాను కొందరు విద్యార్థులు అడిగారు. ఇందుకు మాంసం తినడం మానేయాలని బెహెరా చెప్పారు. ఈ సందర్భంలోనే రాష్ట్రంలో విపత్తులు జంతువులను చంపడం వల్లనే వస్తున్నాయని అన్నారు. విద్యార్థుల చేత మాంసం తినడం మానేసేలా జపించాలని కోరారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాంసం తినడానికి అతి వర్షాలకు సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించాయి. నదులు పొంగి ప్రవహించాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 250 మంది వరకు మరణించారు. రూ.2,913 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ఇదీ చదవండి: G20 Summit:ఢిల్లీలో భారీ భద్రత.. ట్రాక్టర్‌పై పోలీసుల పెట్రోలింగ్ -
ఐఐటీలో ఘర్షణ.. నలుగురి మృతి
మండి: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి ఐఐటీ ప్రాంగణం రక్తసిక్తంగా మారింది. శనివారం రెండు గ్రూపులకు మధ్య తలెత్తిన ఘర్షణలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మండి ఎస్పీ మోహిత్ చావ్లా తెలిపిన వివరాల ప్రకారం.. 2011లో ఏర్పాటయిన మండి ఐఐటీలో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, హిమాచల్ వ్యాప్తంగా నిర్మాణ కూలీలకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఓ యూనియన్ శనివారం బంద్‌కు పిలపునిచ్చింది. అయితే ఐఐటీ నిర్మాణంలో పనిచేస్తోన్న కూలీలు మాత్రం యథావిథిగా పనికి హాజరయ్యారు. విషయం తెలుసుకున్న యూనియన్ నాయకులు, ఇతర కూలీలు.. ఐఐటీ ప్రాంగణానికి వచ్చి పనులు నిలిపివేయాలని ఆందోళన చేశారు. వీరిని చెదరగొట్టేందుకు సదరు నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టరుకు చెందిన ప్రైవేట్ గన్ మన్ లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడటంతో రెచ్చిపోయిన యూనియన్ కార్యకర్తలు గన్మెన్లు, ఐఐటీలో పనిచేస్తున్న కూలీలలపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. అటువైపు నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిఘటన వచ్చింది. పదుల సంఖ్యలో వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. సమాచారం తెలసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టాయి. దాడుల్లో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కూలీల యుద్ధాన్నిచూసి హడలిపోయిన ఐఐటీ విద్యార్థినీ విద్యార్థులు, సిబ్బంది పోలీసులు వచ్చేవరకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిచామని, కూలీల మృతికి కారణమైనవారిని విడిచిపెట్టబోమని ఎస్పీ తెలిపారు.