breaking news
Idea Forge
-
పబ్లిక్ ఇష్యూకి ఐడియాఫోర్జ్
న్యూఢిల్లీ: డ్రోన్ తయారీ కంపెనీ ఐడియాఫోర్జ్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని ఐపీవోలో భాగంగా కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 48,69,712 షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు రూ. 135 కోట్లు, ప్రొడక్ట్ డెవలప్మెంట్కు రూ. 40 కోట్లు చొప్పున వెచ్చించనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా మానవరహిత ఏరియల్ వాహనా(యూఏవీ)లను రూపొందిస్తోంది. తద్వారా ఈ విభాగంలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తోంది. కంపెనీ కస్టమర్ల జాబితాలో సాయుధ దళాలు, పోలీసు, అటవీ శాఖలు, విపత్తు నిర్వహణా దళాలు తదితరాలున్నాయి. -
ఐడియాఫోర్జ్‌లో ఇన్ఫోసిస్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్, డ్రోన్లకు సంబంధించిన సొల్యూషన్లను అభివృద్ధి చేసే భారత స్టార్టప్, ఐడియా ఫోర్జ్‌లో పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులకు వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి ఆమోదం పొందాల్సి ఉన్నట్టు ఇన్ఫోసిన్ తెలిపింది. ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారన్నది మాత్రం వెల్లడించలేదు. కొన్నేళ్లుగా ఇన్ఫోసిస్ తన ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతోంది. ఐడియాఫోర్జ్ రూపొందించే డ్రోన్లను భారత సైనిక దళాలు వాడుతున్నాయి. నిఘా, భారీ సమావేశాలు జరిగేటప్పుడు, రెస్క్యూ కార్యకలాపాలకు ఈ డ్రోన్లను భారత సైన్యం ఉపయోగిస్తోంది. విస్తరించడానికి సహకారం!! ఐడియాఫోర్జ్ అత్యున్నత పనితీరు గల డ్రోన్లను భారత్‌లోనే డిజైన్ చేసి తయారు చేస్తోందని, వీటిని పారిశ్రామికంగా వినియోగించడానికి భారీగా అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితిక సూరి చెప్పారు. కాగా ఇన్ఫీ తమ సంస్థలో పెట్టుబడులు పెట్టడం సంతోషకరమని ఐడియాఫోర్జ్ వ్యవస్థాపకుల్లో ఒకరు,, సీఈఓ అంకిత్ మెహతా చెప్పారు. పారిశ్రామికంగా విస్తరించడానికి ఇన్ఫోసిస్ సహకారం కీలకం కానున్నదన్నారు. 2013లో ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 2015లో ఈ ఫండ్‌ను 50 కోట్ల డాలర్లకు పెంచి పరిపుష్టం చేసింది. కృత్రిమ మేధస్సు వంటి వినూత్నమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసే స్టార్టప్‌లకు ఈ ఫండ్ రుణాలందిస్తోంది. -
ఐఐటియన్ల ఐడియా ఫోర్జ్
ఐఐటియన్లు సాధారణంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో భారీ ప్యాకేజీలకు ఉద్యోగాలు పొందడం ద్వారానే వార్తల్లోకి వస్తుంటారు. అయితే ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ అంటే కేవలం కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులను తయారుచేసే కర్మాగారమే కాదు... దేశ అవసరాలకు తగిన యువతను కూడా తీర్చిదిద్దుతుందనే విషయం అప్పుడప్పుడు నిరూపితమవుతుంది. ఐఐటియన్లు దేశ అవసరాలను కూడా పూరిస్తున్నారు. తమ తెలివితేటలతో చక్కటి ఆవిష్కరణలు చేయగలరని రుజువు చేసుకుంటున్నారు. ఇలాంటి ఫీట్ తోనే ఇటీవల వార్తల్లోకి వచ్చారు ఐఐటీ ముంబై విద్యార్థులు కొందరు. ‘ఐడియా ఫోర్జ్’ అనే కంపెనీతో కొత్త ఆవిష్కరణలు చేస్తున్న వారి నేపథ్యమిది... ఇటీవల ఉత్తరాఖండ్ వరద బీభత్స కాండ అందరికీ గుర్తుండే ఉంటుంది. కొన్ని లక్షల మంది వరదబాధితులైన ఆ సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం భారత మిలటరీకే కష్టం అయ్యింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఒక మిలటరీ హెలికాప్టర్ కూలి కొంతమంది సైనికులు కూడా మరణించిన విషయం తెలిసిందే. సహాయకార్యక్రమాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో ‘నేత్ర’ రెస్క్యూ ఆపరేషన్లలో చక్కటి సహకారాన్ని అందించింది. బాధితుల ఉనికిని గుర్తించడంలో సైన్యానికి సహాయం అందించింది. ‘నేత్ర’ అంటే మానవరహిత వాయు వాహనం (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్) బ్యాటరీ ద్వారా నడిచే ఈ వాహనం అరగంట సేపు గాలిలో విహరించి బాధితుల ఉనికిని గుర్తించగలదు. తద్వారా సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయగలదు. ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంలో ‘నేత్ర’కు మంచి గుర్తింపు వచ్చింది. అంకిత్ మెహతా, విపుల్ జోషి, ఆశిష్భట్, అమర్దీప్ సింగ్, రాహుల్ సింగ్... ఈ ఐఐటీ అల్యూమినీ ‘నేత్ర’ను ఆవిష్కరించింది. వీరందరూ దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చినవారు, విభిన్న డిపార్ట్మెంట్లలో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవాళ్లు. అయితే వీరికి రోబోటిక్స్ మీద ఉన్న ప్రత్యేక ఆసక్తి ‘నేత్ర’కు రూపకల్పన చేసింది. ఈ ఐదుగురూ కలిసి మొదట ‘ఐడియా ఫోర్జ్’ అనే కంపెనీని నెలకొల్పారు. వీరి ఆలోచనా విధానమే ఈ కంపెనీకి పునాది వేసింది. ఐఐటీలో చదువు పూర్తయిన తర్వాత అనేక కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన జాబ్ ఆఫర్స్‌ను కాదనుకొని వీరు స్టార్ట్ అప్ మీద ఆసక్తి చూపించారు. ఒక కంపెనీని నెలకొల్పి దేశ, సమాజ అవసరాలకు తగిన ఆవిష్కరణలు చేయడంతో పాటు, సొంతంగా ఉపాధిని కల్పించుకొన్నామనే తృప్తిని కూడా పొందాలనుకున్నారు. ఆశిష్ భట్.. ఐడియా ఫోర్జ్ ఆలోచన ఇతడిదే. ముంబై ఐఐటీలో బీటెక్ చేసే సమయంలో ఎటువంటి టెక్ కాంపిటీషన్లు జరిగినా ఆశిష్ ఆలోచనకు, ఆవిష్కరణకు ప్రైజ్ గ్యారెంటీ. ప్రశంసలు గ్యారెంటీ. కాలేజీ జీవితం ఇతడికి ‘నువ్వు ఏదైనా సాధించగలవు...’ అనే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ ఆత్మవిశ్వాసానికి వాస్తవ రూపమే ‘ఐడియా ఫోర్జ్’. అంకిత్ మెహతా ఇతడికి తోడయ్యాడు. అంకిత్ ఎమ్‌టెక్ పూర్తి చేశాడు. ఆరు నెలలపాటు ఒక మార్కెటింగ్ కన్సల్టెన్సీలో పనిచేశాడు. అయితే తన లక్ష్యాలకూ, సిద్ధాంతాలకూ ఏమాత్రం సరిపోని ఉద్యోగాలను వద్దనుకొన్న అంకిత్ ఆశిష్‌కు తోడయ్యాడు. రాహుల్‌సింగ్... కొత్త కొత్త వస్తువుల ఆవిష్కరణలో ఆసక్తి ఉన్న రాహుల్ బీటెక్ పూర్తిచేశాడు. వేరే జాబ్ ప్రయత్నాలు చేయకుండానే ఐడియాఫోర్జ్‌లో మెంబరయ్యాడు. ఇక అనుదీప్ సింగ్... ఏరోస్పేస్ టెక్నాలజీలో బీటెక్, ఎమ్‌టెక్ పూర్తి చేసిన అనుదీప్ తన సబ్జెక్ట్ విషయంలో తిరుగులేని ఇంటెలిజెంట్. స్టూడెంట్‌గా యూనివర్సిటీలో తెచ్చుకొన్న గుర్తింపు, మెడల్సే ఇందుకు రుజువు. ఈ న లుగురూ ఐఐటీ ముంబై స్టూడెంట్స్ కాగా విపుల్ జోషి మాత్రం స్విట్జర్లాండ్‌లో ఎమ్బీఏ పూర్తిచేశాడు. వీరితో కలిసి ‘ఐడియా ఫోర్జ్’లో భాగస్వామి అయ్యాడు. ఈ ఐదుగురు యువకులు సమష్టి కృషితో కొత్త ఆవిష్కరణలు చేయాలని తపిస్తున్నారు. అందులో భాగంగా ‘నేత్ర’తో తొలి విజయం సాధించారు. మరిన్ని ఆవిష్కరణలు, మరిన్ని విజయాలతో ముందుకు వెళతామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ ఐదుగురు యువకులూ సమష్టి కృషితో కొత్త ఆవిష్కరణలు చేపట్టాలని తపిస్తున్నారు. అందులో భాగంగా ‘నేత్ర’తో తొలి విజయం సాధించారు. మరిన్ని ఆవిష్కరణలు, మరిన్ని విజయాలతో ముందుకు వెళతామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.