తల తెగిపడిపోయినా..!
‘‘నా తల తెగిపడినా సరే..’’ అంటూ అప్పుడప్పుడూ భీష్మ శపథం చేస్తుంటారు కొందరు పెద్దమనుషులు. అదో సరదా! కానీ, ఓ అమెరికా కోడి మాత్రం ఈ శపథాన్ని కాస్తంత సీరియస్‌గానే తీసుకున్నట్టు ఉంది. తలే తెగిపడిపోయినా సరే ప్రాణాలు నిలబెట్టుకుంది. అది కూడా ఏదో కాళ్లీడ్చుకుంటూ కాదు. నిటారుగా నిలబడుతూనే, ఠీవిగా నడుస్తూనే!
1945 నాటి సంగతి.. కొలరాడోలోని ఫ్రూటా నివాసి, రైతు లాయిడ్ ఓల్సెన్ మార్కెట్‌కు వెళ్లాడు. ఎన్నో రోజులుగా అతడి భార్య కోడికూర కావాలని పోరు పెడుతుండటమే అందుకు కారణం. రాత్రి భోజనానికి చక్కగా పనికొచ్చేలా ఓ ఐదున్నర మాసాల వయసు కోడిని ఎంచుకున్నాడు. దానికి ఓ పేరు కూడా ఉందండోయ్. అదే 'మైక్' ఈ కోడిని చంకలో బెట్టుకుని ఇంటికి చేరుకున్న ఆయన.. తన కత్తిని పదును పెట్టాడు. రాత్రి వంటకు సిద్ధమయ్యే ముందు ఆ కత్తితో కోడి తలపై ఒక్క వేటు వేశాడు. అంతే.. పీక ఎగిరి అల్లంత దూరాన పడింది. ఇక కూర వండుకు తినడమే తరువాయి అనుకున్నాడు లాయిడ్. కానీ, చిత్రంగా కోడి చావలేదు. పైగా ఏమీ జరగలేదన్నట్టుగా రెండు కాళ్లపై నిటారు నిల్చుంది. దీంతో ఆశ్చర్యపోవడం లాయిడ్ దంపతుల వంతైంది. ఇంత జరిగాక కూడా దాన్ని కోసుకుతింటే బాగోదనిపించి, ఆయన పెంచుకోవడం మొదలుపెట్టాడు. దానికి ఐ డ్రాపర్ సహాయంతో నీళ్లు, ఆహారం అందించేవాడు. అలా దాదాపు 18 నెలలపాటు ఆరోగ్యంగా జీవించింది మైక్. చివరకు ఓ రోజు లాయిడ్ ఆహారం తినిపిస్తుండగా మైక్ ఆహార నాళం పూర్తిగా మూసుకుపోయింది. అలా ఊపిరాడక పైలోకాలకు వెళ్లిపోయింది మైక్..!!