breaking news
Government of Malaysia
-
ఆ శకలం బోయింగ్‌దే!
హిందూ మహాసముద్రంలో దొరికిన శకలంపై మలేసియా కౌలాలంపూర్: హిందూ మహాసముద్రంలో దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదేనని మలేసియా ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దీంతో ఏడాది కిందట అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన బోయింగ్ రకానికి చెందిన ఎమ్హెచ్ 370 విమానానికి సంబంధించిన శకలం అదేనని అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఇటీవల హిందూ మహాసముద్రంలోని రినియన్ ద్వీపం వద్ద దొరికిన విమాన శకలం బోయింగ్ 777 రకానికి చెందినదేనని మలేసియా ఉప రవాణా మంత్రి అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీపై దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారికి కూడా ఈ విషయం తెలిపామన్నారు. రినియన్ ద్వీపానికి ఒక బృందాన్ని పంపుతామని, ఆ శకలం ఎమ్హెచ్ 370కి సంబంధించినదా... కాదా అనే విషయం మరికొన్ని రోజుల్లో తెలుస్తుందని తెలిపారు. ఇప్పటివరకైతే ఆ శకలం ఎమ్హెచ్ 370 దేనని నిర్ధారణ కాలేదన్నారు. విమాన ఆచూకీపై ఫ్రాన్స్ సంస్థతో తాము సేకరించిన సమాచారం పంచుకుంటామని చెప్పారు. మరింత కచ్చితమైన ఆధారాలు లభించకుండా దొరికిన శకలం ఎమ్హెచ్ 370 దేనని చెప్పడం తొందరపాటు చర్య అవుతుందన్నారు. మరోవైపు దొరికిన శకలంపై ఉన్న 637 బీబీ నంబర్.. బోయింగ్ విమానానిదేనని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, అదృశ్యమైన విమానంపై దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా.. దొరికిన శకలం ఎమ్హెచ్ 370 విమానానిదైనా.. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని కనిపెట్టడం కష్టమని పేర్కొంది. గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్హెచ్ 370 విమానం హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. కాగా, ఇన్నాళ్లుగా గాలిస్తున్నా అదృశ్యమైన విమానానికి సంబంధించి ఏలాంటి ఆధారాలను దర్యాప్తు అధికారులు కనుక్కోలేకపోయారు. -
ఉగ్రవాదులు కూల్చేశారా?
* మలేసియా విమాన అదృశ్యంపై వీడని మిస్టరీ * దొంగ పాస్‌పోర్టులతో ఎక్కిన ఇద్దరూ ఉగ్రవాదులని అనుమానం.. * ఆ దిశగా దర్యాప్తు కౌలాలంపూర్/బీజింగ్: మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ వెళుతూ శనివారం అదృశ్యమైన బోయింగ్ విమానం ఏమైందన్న మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ ఘటనలో ఉగ్రవాదుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సిందిగా మలేసియా ప్రభుత్వం ఆదివారం అధికారులనుఆదేశించింది. 239 ప్రయాణికులు, సిబ్బందితో వెళుతున్న విమానంలో ఇద్దరు దొంగిలించిన (ఒకటి ఇటలీవాసిది, రెండోది ఆస్ట్రియావాసిది) పాస్‌పోర్టులతో ఎక్కారని తేలిన నేపథ్యంలో.. ఉగ్రవాద చర్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ ఇద్దరు వ్యక్తులను సీసీటీవీల ఆధారంగా గుర్తించి వారిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా మలేసియా కోరిక మేరకు ఆ విమానం చివరి సిగ్నళ్లు అందిన ప్రాంతంలో వియత్నాం సహా ఆరు దేశాలు గాలిస్తున్నప్పటికీ రెండో రోజూ ఆచూకీ తెలియలేదు. కూలిపోయిన విమానానివిగా భావిస్తున్న శకలాలు తమ దేశానికి చెందిన థోచు ద్వీపం వద్ద సముద్రంలో కనిపించాయని వియత్నాం సహాయక బృంద అధికారులు చెప్పారు. అయితే దీన్ని మలేసియా పౌర విమానయాన సంస్థ ఖండించింది. అదృశ్యమైన విమానానికి, ఆ శకలాలకు ఏ మాత్రం పోలికలేదని పేర్కొంది. కాగా ఈ విమానంలో ఓ రెక్క 2012లో స్వల్పంగా విరిగిపోయింది. మరమ్మతుల తర్వాత అది చాలాసార్లు ప్రయాణించిందని చెబుతున్నారు. విమానం కనిపించకుండా పోవడానికి పలు అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటంటే... వెనక్కు వస్తూ?: కౌలాలంపూర్ నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. అంతకుముందు ఆ విమానం ఏదో కారణం చేత వెనక్కు బయల్దేరిందని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సాంకేతికలోపం తలెత్తడం వల్ల అది వెనక్కు వస్తూ కూలిపోయి ఉండొచ్చని ఒక అంచనా. బాంబు పేలిందా?: ఉగ్రవాదులు ఒకవేళ విమానంలో బాంబులు పెట్టి దాన్ని పేల్చేశారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. సైనిక చర్యనా?: కొన్ని దేశాల సైన్యాలు అనుకోకుండా విమానాలను కూల్చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 1988లో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ విన్సినెస్ పొరబాటున ఇరాన్ విమానాన్ని కూల్చే యడంతో అందులోని 290 మంది మరణించారు. 1983లో కొరియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని రష్యా యుద్ధ విమానం కూడా ఇలాగే కూల్చేసింది. అలాగే ఈ విమానాన్ని కూడా ఏ దేశ సైన్యమైనా కూల్చేసి ఉండొచ్చా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా, విమానం గాల్లోకి లేచాక పైలట్ ‘ఆటో పైలట్’ ను యాక్టివేట్ చేసి మర్చిపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానమూ ఉంది.