breaking news
good start
-
Australian Open 2023: జొకోవిచ్ అలవోకగా...
మెల్బోర్న్: కోవిడ్ టీకా వేసుకోనందున... గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడే అవకాశం కోల్పోయిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఈసారి అలవోక విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–0తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలుపొందాడు. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. కార్బెలాస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 26 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచిన ఈ మాజీ నంబర్‌వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా 22వ విజయాన్ని నమోదు చేశాడు. ఈ టోర్నీలో 2019, 2020, 2021లలో విజేతగా నిలిచిన జొకోవిచ్ గతేడాది బరిలోకి దిగలేదు. ముర్రే మారథాన్ పోరులో... మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే తొలి రౌండ్లో అతికష్టమ్మీద విజయం అందుకున్నాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 49వ ర్యాంకర్ ఆండీ ముర్రే 6–3, 6–3, 4–6, 6–7 (7/9), 7–6 (10/6)తో గెలుపొందాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 10 ఏస్‌లు సంధించి, 34 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు బెరెటిని 31 ఏస్‌లు సంధించినా, ఏకంగా 59 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నెట్ వద్దకు 39 సార్లు దూసుకొచ్చిన ముర్రే 23 సార్లు పాయింట్లు గెలుపొందగా... బెరెటిని 49 సార్లు నెట్ వద్దకు వచ్చి 32 సార్లు పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా శ్రమించి గెలుపొందాడు. ‘లక్కీ లూజర్’ యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)తో జరిగిన తొలి రౌండ్లో జ్వెరెవ్ 4–6, 6–1, 5–7, 7–6 (7/3), 6–4తో గెలిచాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 21 ఏస్‌లు కొట్టాడు. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–6 (8/6), 6–7 (5/7), 6–3తో టొమాస్ మచాచ్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–3, 6–4, 6–2తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై, ఎనిమిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–2, 4–6, 7–5తో బాసిలాష్విలి (జార్జియా)పై విజయం సాధించారు. ముగురుజాకు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో 2020 రన్నరప్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) 3–6, 7–6 (7/3), 6–1తో ముగురుజాను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా) 7–6 (10/8), 4–6, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–0తో కేథరీన్ సెబోవ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో తెరెజా మార్టిన్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. -
Womens Asia Cup T20: చెలరేగిన జెమీమా
సిల్హెట్: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి చెలరేగడంతో ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ తొలి లీగ్ పోరులో భారత్ 41 పరుగులతో శ్రీలంకపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (10) జట్టు స్కోరు 23 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకట్టిన జెమీమా భారత్ స్కోరును మెరుపు వేగంతో నడిపించింది. ఇద్దరు కలిసి దాదాపు 13 ఓవర్లపాటు క్రీజులో నిలవడంతో లంక బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జెమీమా 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. నిజానికి భారత్ స్కోరు మరింత పెరగాలి. అయితే డెత్ ఓవర్లలో జెమీమాతో పాటు రిచా ఘోష్ (9), పూజ (1) విఫలమవడంతో ఆశించినన్ని పరుగులు రాలే దు. అనంతరం శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు హేమలత (3/15), పూజ (2/12), దీప్తి శర్మ (2/15) లంకను దెబ్బ తీశారు. హర్షిత (26; 5 ఫోర్లు), హాసిని పెరీరా (30; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 9 వికెట్లతో థాయ్‌లాండ్‌పై గెలిచింది. -
సానియా జంట శుభారంభం
న్యూఢిల్లీ: మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఈ టాప్ సీడ్ జంట 6-1, 6-0తో ఎలీనా బొగ్డాన్ (రుమేనియా)-నికోల్ మెలిచార్ (అమెరికా) జోడీపై అలవోకగా గెలిచింది. 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం తమ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. పేస్ జోడీ ఓటమి: మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)- క్లాసెన్ (దక్షిణాఫ్రికా); బోపన్న (భారత్)- నెస్టర్ (కెనడా) జంటలకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. మొదటి రౌండ్లో పేస్-క్లాసెన్ 4-6, 2-6తో ఫాగ్నిని-బొలెలీ (ఇటలీ)ల చేతిలో; బోపన్న-నెస్టర్ 3-6, 6-7 (4/7)తో ఇస్నెర్- క్వెరీ (అమెరికా)ల చేతిలో ఓడిపోయారు.