breaking news
good dancer
-
ఔను.. అది నిజమే!
చార్మి ఎంత మంచి నటో, అంత మంచి డాన్సర్ కూడా. ఆమె ఎంత బాగా డాన్స్ చేస్తుందో చెప్పడానికి ఓ ఉదాహరణ ‘డమరుకం'లోని ‘ఏస్కో నా గుమా గుమా ఛాయ్...’ పాట. ప్రస్తుతం చార్మి ఆ తరహా మాస్ మసాలా సాంగ్ చేస్తున్నారనీ, ఇది తమిళ స్టయిల్ డాన్స్ అని ఓ వార్త ప్రచారంలో ఉంది. ‘ఔను.. ఆ వార్త నిజమే’ అని చార్మి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తమిళ చిత్రం ‘పత్తు ఎణ్రదుకుళ్ల’ కోసం ఆ చిత్రకథానాయకుడు విక్రమ్‌తో కలిసి చార్మి ఈ పాటకు కాలు కదుపుతున్నారు. తొమ్మిది నిమిషాల నిడివితో సాగే ఈ పాట చిత్రీకరణ గురువారం చెన్నైలో మొదలైంది. దీనికోసం భారీ సెట్ వేశారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగులో ప్రస్తుతం ‘మంత్ర 2’ చిత్రంలో నటిస్తున్న చార్మి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మి' చిత్రం చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె బాగా సన్నబడ్డారు కూడా. ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. మార్చి ప్రథమార్ధంలో షూటింగ్ షురూ కానుంది. -
కొండంతవాడు!
పాత్రలో సగం నీటిని చూసి నిరాశావాది ఉసూరంటాడు.. సగం ఖాళీ ఉందని విసుక్కుంటాడు.. ఆశావాది మాత్రం సగమైనా నిండి ఉందని సంబరపడతాడు.. పదమూడేళ్ల ఆ కుర్రాడు రెండో కోవకు చెందిన వాడు.. జీవితంలో ఏదీ లేదని నిరాశపడే వారు ఎక్కువవుతున్న లోకాన ఆ ఆశాసంపన్నుడు వేగుచుక్కలా వెలుగుతున్నాడు. కష్టాలు కడలి కెరటాల్లా విరుచుకు పడినా చిరునవ్వుతో బతకాలని సందేశమిచ్చేలా కులాసాగా కాలం గడుపుతున్నాడు. కాళ్లివ్వని విధిని నిందించడం కాదు.. చేతులిచ్చి బతుకుకు ఆసరా కల్పించినందుకు దండం పెట్టాలంటున్నాడు.. రాళ్లూముళ్లున్న జీవితపథంలో కష్టాలను భరిస్తూ పురోగమిస్తున్నాడు. బతుకు బరువు చూసి భయపడేవారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. గొలుగొండ, న్యూస్‌లైన్ : ఉదయం ఎనిమిది గంటల వేళ.. చలికాలం కావడంతో మంచుతెరలు ఇంకా తొలగలేదు.. ఆ చలిలో గొలుగొండ మండలం భీమునిపట్నం నుంచి జోగుంపేట వెళ్లే రోడ్డు మీద ఓ కుర్రాడు చురుగ్గా నడుస్తున్నాడు.. జిల్లా పరిషత్ హైస్కూలు దిశగా వడివడిగా సాగిపోతున్నాడు.. ఏ ఒక్క రోజో కాదు.. నిత్యం అతడు నాలుగు కిలోమీటర్ల దూరాన్ని నడుచుకునే వెళ్లాడు.. ఇంటికి నడుచుకునే వస్తాడు. ఎందరో పిల్లలు రోజూ స్కూలుకు అలాగే వెళ్తున్నప్పుడు ఇందులో ఆశ్చర్యం ఏముందీ అనిపిస్తుంది కదూ! నిజమే.. ఇందులో ఆశ్చర్యమేమీ ఉండదు కానీ.. ఆ బాలుడికి కాళ్లనే నిర్మాణాలు లేవు.. పదమూడేళ్ల ఉల్లి రాము శరీరంలో పాదాలు తప్ప కాళ్లు కానరావు.. విధి జన్యులోపం రూపంలో చిన్నచూపు చూడడంతో అతడికి శరీరం బాగానే ఉన్నా కాళ్లు మాత్రం లేకుండా పోయాయి. అడుగులు వేయడానికి పాదాలు మాత్రం మిగిలాయి. పేద గిరిజన కుటుంబంలో పుట్టిన రామును ఆర్థిక సమస్యలూ వెంటాడుతున్నాయి. అయితేనేం.. చిన్నవాడైనా ఆత్మవిశ్వాసంలో కొండంతవాడైన రాము మనో నిబ్బరం ముందు ఈ కష్టాలు తలవంచాయి. పొట్టివాడైనా, గట్టివాడైన రాముకు సమస్యలు ‘పాదాక్రాంత’మయ్యాయి. అడుగులో అడుగు.. : కాళ్లు లేవని రాము కుంగిపోడు.. ఉత్సాహంతో ఉరకలేస్తాడు.. కాళ్లు, చేతుల సాయంతో ఉదయం 4 కిలోమీటర్లు, సాయంత్రం 4 కిలోమీటర్లు ‘నడిచి’ చదువుకుంటున్నాడు. జోగుంపేట జిల్లాపరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న రాము అన్ని రంగాల్లో సహాధ్యాయులతో పోటీ పడతాడు. చదువులో ప్రతిభ చూపుతాడు.. నృత్యంలో అదరగొడతాడు. హైస్కూల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యం చేసి పలువురి అభినందనలు అందుకున్నాడు. ప్రశంసాపత్రాలు కూడా పొందాడు. రెండడుగులే.. :నిరుపేద గిరిజన తెగకు చెందిన రాముకు రాము తండ్రి అప్పారావు, తల్లి వరలక్ష్మి. కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. రాముకు ఇద్దరు అక్కలు ఉన్నారు. జన్యులోపంతో పుట్టిన రాము పొడవు రెండడుగుల ఎనిమిది సెంటీమీటర్లే. బస్సు సౌకర్యం లేకపోవడంతో స్వగ్రామం నుంచి స్కూలుకు నడుచుకు వెళ్తాడు. ఇందుకు గంటన్నర సమయం పడుతుంది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో బయల్దేరి పది గంటలకు స్కూలుకు వెళ్తాడు. సాయంత్రం మళ్లీ సుమారు ఆరున్నరకు ఇంటికి వస్తాడు. ఇన్ని కష్టాలున్నా చదువులో మాత్రం రాణిస్తున్నాడు. యూనిట్ టెస్టు నుండి ప్రతి పరీక్షలో 85 శాతానికి పైగా మార్కులు పొందుతున్నాడు. డ్యాన్స్‌లో ఘనుడు చేతులే ఆధారంగా రాము డ్యాన్స్‌లో అదరగొడతాడు. రెండేళ్లుగా గొలుగొండ మండలంతో పాటు కంఠారం, బాలారం, బకులూరు, నర్సీపట్నం ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చాడు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలుస్తున్నాడు. హైస్కూల్లో ఎఫ్పుడు ఉత్సవాలైనా రాము డ్యాన్స్ ఉండాల్సిందే. చిత్రలేఖనంలో కూడా ప్రతిభ చూపుతున్నాడు. ఉపాధ్యాయుల సహకారంతో నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు. పాఠశాలలో ప్రథమస్థానంలో నిలుస్తున్నాడు.