breaking news
Gajadonga
-
‘గజదొంగ’గా సప్తగిరి
సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్న కమెడియన్ సప్తగిరి మరోసారి హీరోగా నటిస్తున్న సినిమా గజదొంగ. తొలి రెండు చిత్రాల్లో కామెడీ జానర్లో నటించిన సప్తగిరి మూడో సినిమాగా యాక్షన్ ఎంటర్టైనర్ను ఎంచుకున్నారు. ఈ చిత్రాన్ని నంద నందనా ప్రాజెక్ట్స్ పతాకంపై శర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి చిత్రాన్ని నిర్మించనున్నారు. గీతా ఆర్ట్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థల్లో దర్శకత్వ శాఖలో పనిచేసిన డి.రామకృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు శర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి మాట్లాడుతూ ‘సప్తగిరికి యాప్ట్ సబ్జెక్ట్ ఇది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మహానటుడు ఎన్టీఆర్ నటించిన ‘గజదొంగ’కూ, దీనికీ సంబంధం లేదు. ఇందులో సప్తగిరిది దొంగలకు దొంగలాంటి పాత్ర. అసలు సిసలు దొంగల్ని దోచుకుని సమాజానికి ఉపయోగపడే దొంగగా కనిపించనున్నాడు. విలేజ్, టౌన్ బ్యాక్డ్రాప్లో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఆగస్టు తొలి వారంలో చిత్రీకరణ మొదలుపెడతాం’ అని తెలిపారు. -
గజదొంగను మహర్షిగా మార్చిన నారదుడు
పురానీతి ఒకానొకప్పుడు రత్నాకరుడు అనే గజదొంగ ఉండేవాడు. ఒక అరణ్య మార్గాన్ని స్థావరంగా ఎంచుకుని దారిదోపిడీలనే వృత్తిగా చేసుకుని జీవించేవాడు. అడవి దారిలో ప్రయాణించే బాటసారులను నిర్దాక్షిణ్యంగా చంపేసి, వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులను దోచుకునేవాడు. రత్నాకరుడి పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఒంటరిగా అడవి దారిలో వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఒకనాడు నారద మహాముని ఆ అడవి మార్గం మీదుగా వెళుతుండగా, రత్నాకరుడు ఆయనను అడ్డగించాడు. డబ్బు దస్కం ఏమేమి ఉన్నాయో బయటకు తీయమని గద్దించాడు. నారద మహాముని అతడి మాటలకు ఏమాత్రం బెదిరిపోలేదు. ప్రశాంతంగా అతడి వైపు చూసి... ‘ఎందుకిలా దారికాచి ప్రజలను దోచుకుంటూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నావు?’ అని ప్రశ్నించాడు. ‘నా కుటుంబాన్ని పోషించుకోవడానికే ఇలా దోపిడీలకు పాల్పడుతున్నాను.’ అని బదులిచ్చాడు. ‘నీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?’ అడిగాడు నారద మహాముని. ‘నేను, నా భార్య, నా కొడుకు... ఇంకా వయసుమళ్లిన నా తల్లిదండ్రులు... వాళ్లందరి బాగోగులు నేనే చూసుకోవాలి’ బదులిచ్చాడు రత్నాకరుడు. ‘వాళ్లందరి బాగోగులు చూసుకోవడం కచ్చితంగా నీ బాధ్యతే! అయితే, అందుకోసం అమాయకులను చంపి దోచుకోవడం పాపం కదా! ఇందుకు నరకంలో శిక్షలు తప్పవు. నీ కుటుంబంలో ఎవరైనా నీ పాపాలకు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారేమో కనుక్కో’ అన్నాడు నారద మహాముని. ‘సరే... నా ఇంట్లో వాళ్లను కనుక్కుంటాను’ అని బయలుదేరడానికి రత్నాకరుడు సిద్ధపడ్డాడు. అయితే, తాను తిరిగి వచ్చేలోగా నారద మహాముని ఎక్కడికైనా పారిపోతాడేమోనని భావించి, ఆయనను ఒక చెట్టుకు కట్టేశాడు. నేరుగా ఇంటికి వెళ్లాడు. ‘నిన్ను పెళ్లి చేసుకున్నాక... నిన్ను బాగా చూసుకోవడానికి దారిదోపిడీలు చేస్తున్నాను. నన్ను ఎదిరించిన అమాయకులను చంపేస్తున్నాను. ఈ పాపాలకు నరకంలో నాకు శిక్షలు తప్పవు. నా బదులుగా నువ్వు నరకంలో శిక్షలు అనుభవిస్తావా..?’ అని భార్యను అడిగాడు. ‘నన్ను పోషించడం భర్తగా నీ ధర్మం. అందుకు నువ్వు ఏ పాపం చేసినా ఫలితం నువ్వు అనుభవించాల్సిందే’ తేల్చి చెప్పింది భార్య. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు... ‘వృద్ధులైన మిమ్మల్ని పోషించడానికి దారిదోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నా పాపాలకు నరకంలో శిక్షలు ఉంటాయి. మీ కోసమే ఇవన్నీ చేస్తున్నాను కదా..! నా పాపాలకు మీరు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధపడతారా?’ అని అడిగాడు. ‘నిన్ను కన్న తర్వాత నిన్ను పెంచి పెద్ద చేయడానికి నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వయసు మళ్లిన దశలో కాటికి కాళ్లు చాచుకుని ఉన్నాం. ఈ దశలో మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే. నీ పాప పుణ్యాల ఫలితం నువ్వే అనుభవించాలి గానీ, మేమెలా అనుభవిస్తాం’ అన్నారు. చివరిగా కొడుకును అడిగాడు. ‘నిన్ను పెంచి పెద్దచేయడానికి దోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నరకంలో నా బదులుగా శిక్షలు అనుభవించడానికి నువ్వు సిద్ధమేనా?’ ససేమిరా అనేశాడు కొడుకు. ‘నన్ను కన్నందుకు పెంచి పోషించాల్సిన బాధ్యత తండ్రిగా నీపై ఉంది. నీ పాప పుణ్యాలతో నాకేమీ సంబంధం లేదు. వాటి ఫలితాన్ని నువ్వు స్వయంగా అనుభవించాల్సిందే’ అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైంది రత్నాకరుడికి. హుటాహుటిన అడవికి చేరుకుని, చెట్టుకు కట్టేసి ఉన్న నారద మహామునిని బంధ విముక్తుడిని చేశాడు. ఆయన కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకున్నాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు. భగవన్నామ స్మరణతోనే పాపాలు నశిస్తాయని, ఇక నుంచి మంచిగా బతకమని సెలవిస్తాడు నారద మహాముని. ఇక అప్పటి నుంచి రత్నాకరుడు దైవధ్యానంలో మునిగి మహర్షిగా మారాడు. ఆయనే వాల్మీకి మహర్షి.