breaking news
Gaja Swimmers
-
పుష్కరాల్లో ఈదేదెలా
- గజ ఈతగాళ్లకు అందని కూలి సొమ్ము - పడవలు తెచ్చి మరీ విధులు నిర్వర్తిస్తున్న మత్స్యకారులు - జిల్లాలో రూ.99.61 లక్షల బకాయిలు కొవ్వూరు : పుష్కరాల సందర్భంగా భక్తులు స్నానాలు చేసే సమయంలో ప్రమాదంబారిన పడితే రక్షించేందుకు ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్లకు ఇప్పటి వరకు కూలి సొమ్ము చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేటకు వెళితే వచ్చే ఆదాయం కంటే కూలి తక్కువైనా అధికారుల మాటకు విలువనిచ్చి విధులు నిర్వహిస్తున్నామని, కనీసం అల్పాహారం కూడా సక్రమంగా అందజేయడం లేదని వారు వాపోతున్నారు. 2 వేల ఈతగాళ్లు.. 700 పడవలు జిల్లావ్యాప్తంగా ఉన్న 97 స్నానఘట్టాల్లో 2 వేల మంది గజఈతగాళ్లు, 700 పడవలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం మత్య్సశాఖకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. గజ ఈతగాళ్లకు రోజుకి రూ.449, పడవకి రూ.700 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకి రూ.14.23 లక్షల చొప్పున గడిచిన వారం రోజులకు రూ. 99.61 లక్షలు బకాయిలు చెల్లించాలి. నాలుగు రోజులకోసారి కూలి సొమ్ము చెల్లిస్తామని అధికారులు ముందుగా హామీ ఇచ్చారు. జిల్లాలో ఏ గ్రేడు 14 స్నానఘట్టాల్లో ఒక్కో షిఫ్ట్‌కి 12 మంది, 54 బి గ్రేడ్ స్నానఘట్టాల్లో షిఫ్ట్‌కి 8 మంది చొప్పున రోజుకి మూడు షిఫ్టులకు, సి గ్రేడ్‌లో ఉన్న 29 స్నాన ఘట్టాల్లోనూ, మరో 15 చోట్ల ఏర్పాటైన తాత్కాలిక స్నాన ఘట్టాల్లో వీరంతా విధులు నిర్వర్తిస్తూ పుష్కర భక్తులకు సేవలందిస్తున్నారు. అంతేకాకుండా నదిలో భక్తులు విడిచిపెట్టిన పువ్వులు, పూజా ద్రవ్యాలు నెట్ వలలతో ఎప్పటికప్పుడు తొలగిస్తూ నది కాలుష్యంలో చిక్కుకోకుండా కాపాడుతున్నారు. గతంలోనూ ఇంతే 2003 పుష్కర సమయంలో కూడా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పట్లో విధులు నిర్వహించిన మత్స్యకారులకు సగం సొమ్ములు ఇవ్వకపోవడంతో గజఈతగాళ్లు ఆందోళనకు దిగారు. కూలి సొమ్ములు, పడవల అద్దె కోసం రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగామని వాడబలిజ సంఘం అధ్యక్షుడు పరిమెళ్ల నాగరాజు గుర్తు చేశారు. అడ్వాన్సులు అందిస్తాం పుష్కర విధుల్లో ఉండడం వల్ల సకాలంలో కూలి డబ్బులు, పడవలకు అద్దె చెల్లించలేకపోయాం. ఒకటి, రెండు రోజుల్లో అందరికీ అడ్వాన్సులు చెల్లిస్తాం. పుష్కరాలు ముగిసిన వెంటనే మిగిలిన సొమ్ము చెల్లిస్తాం. - ఎస్కే.లాల్ మహ్మద్, ఇన్చార్జ్ డెప్యూటీ డెరైక్టర్ మత్య్సశాఖ -
జలకాలాట.. జర జాగ్రత్త!
భైంసా, న్యూస్‌లైన్ : గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద భద్రత కరువైంది. గేట్ల వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించడం లేదు. ఇక్కడ వెళ్లేవారిని ఎవరూ నియంత్రించడం లేదు. సాయంత్రం దాటితే మందుబాబులు గేట్ల వద్ద జల్సా చేస్తున్నారు. తాగి ఖాళీ సీసాలు అక్కడే పారేస్తుండడంతో గాజు పెంకులు సందర్శకులకు గుచ్చుకునే ప్రమాదం ఉంది. గజ ఈతగాళ్లు లేరు నియోజకవర్గంలోనే గడ్డెన్నవాగు ప్రాజెక్టు పెద్దది. కాని ఇక్కడ ఒక్క గజ ఈతగా డు లేడు. వేసవిలో ఉపశమనం కోసం యువకులు, పట్టణవాసులు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుంటారు. ప్రాజెక్టు నీటి లో జలకాలాడుతూ కనిపిస్తారు. కొంతమంది యువకులు వేసవి సెలవుల్లో ప్రాజెక్టు నీటిలో ఈత నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కాని ఇక్కడ ఎలాంటి భద్రత లేకపోవడంతో ఇప్పటికే ఈతకు వెళ్లిన ఐదారుగురు యువకులు నీటి మునిగి చనిపోయారు. గత శుక్రవారం భైంసా పట్టణానికి చెందిన భానుచందర్‌గౌడ్ (రాజుగౌడ్) ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాతపడ్డాడు ప్రాజెక్టు వద్ద గజ ఈతగాళ్లు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఎందరో గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాజెక్టులో పడి ఇప్పటి వరకు దాదాపు 15 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాజెక్టు వద్ద భద్రత కల్పిస్తే ఇలాంటి సంఘటనలను అరికట్టవచ్చు. కాని ఎవరూ ఈ విషయాలను పట్టించుకోవడం లేదు. ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ప్రాజెక్టు గేట్ల వద్దకు వెళ్లే రోడ్డుపై ఉన్న స్తంభాలకు అమర్చిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. తక్కువ ఎత్తులో తీగలు ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. అయినా వీటిని ఎవరూ సరిచేయడం లేదు.