breaking news
Freedom movement time
-
తప్పులు సవరించుకున్న ఎన్సీఈఆర్టీ
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఆరోపణలతో వివాదాలకెక్కిన జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఎట్టకేలకు తన తప్పులను దిద్దుకుంది. తాజాగా విడు దల చేసిన ఎనిమిదవ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో వివాదాస్పద భాగాలను తొలగించింది. కాకపోతే కొత్త పుస్తకంలోనూ కొన్ని సవరణలు చేసింది. దేశ విభజన విషయంలో కాంగ్రెస్ వైఖరిని వక్రీకరించింది. వీర్ సావర్కర్ స్వరాజ్ కోసం డిమాండ్ చేశాడన్న విషయాన్ని జోడించింది. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్, నాజీ సిద్ధాంతాల ప్రస్తావనను తొలగించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్సీఈఆర్టీ ‘‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’పేరుతో విడుదల చేసిన పాఠ్యపుస్తకంపై పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇందులోని ఒక అధ్యాయనంలో న్యాయవ్యవస్థలో అవినీతి, పెండింగ్ కేసుల ప్రస్తావనలు ఉండటం వివాదాస్పదమైంది. సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఏ రకంగానూ ఈ వివాదాస్పద పుస్తకం మళ్లీ ముద్రించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఎన్సీఈఆర్టీ కూడా సుప్రీంకోర్టును క్షమాపణలు కోరింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఆ పాఠ్యపుస్తకాన్ని సమీక్షించింది. సవరణలతో కూడిన పుస్తకం ఇటీవలే అందుబాటులోకి వచ్చింది.చేసిన మార్పులేమిటి?స్వాతంత్రోద్యమం, దేశ విభజనకు సంబంధించి ఈ పుస్తకంలో ‘ఇండియాస్ లాంగ్‌రోడ్ టు ఇండిపెండెన్స్’పేరుతో ఒక అధ్యాయం ఉంది. అందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా రాశారు. అలాగే స్వాతంత్య్రం సంపాదించేందుకు దేశ విభజన ఒక్కటే మార్గమన్న విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడం చర్చనీయాంశమని కూడా ఉంది. విభజన సమయంలో భారత ఉపఖండంలో మతహింసలు చెలరేగగా కాంగ్రెస్ అసహాయ స్థితిలో ఉండిపోయిందన్న వ్యాఖ్యను తొలగించారు. హిందూ, ముస్లిం నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తమకు అనుకూలంగా మార్చుకున్న బ్రిటిష్ పాలకులు దేశాన్ని విభజించాలని నిర్ణయించారని, మహాత్మగాంధీ సహా కాంగ్రెస్ నేతలు కూడా విభజనను వ్యతిరేకించారని, కానీ చివరకు ముందుకెళ్లేందుకు అదొక్కటే మార్గమని అంగీకరించారన్న విషయాలను కూడా కొత్త పుస్తకంలో చేర్చలేదు. కొత్త పుస్తకంలో సంపూర్ణ స్వరాజ్యం డిమాండ్‌కు మరిన్ని వివరాలు జోడిస్తూ... 1925లో వీర్ సావర్కర్ కూడా స్వరాజ్ కోసం డిమాండ్ చేసినట్టుగా రాశారు. ఫిబ్రవరిలో ప్రచురితమైన పుస్తకంలో స్వాతంత్య్రం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాయుధ దళాన్ని అభివృద్ధి చేసేందుకు హిట్లర్ సాయం కోరినట్టు ఉంది. అలాగే హిట్లర్ నాజీ భావజాలం, విస్తరణవాదం ఫలితంగానే రెండో ప్రపంచయుద్ధం జరిగిందన్న వివరమూ కొత్త పుస్తకంలో లేకుండా చేశారు. సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వ్యతిరేక శక్తుల సాయం కోరాడని మాత్రమే ఉంచారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన ‘ద రోల్ ఆఫ్ జ్యుడిషరీ ఇన్ సొసైటీ’లో వివాదాస్పద అంశాలను తొలగించిన ఎన్సీఈఆర్టీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ట్రైబ్యునల్స్, ప్రత్యామ్నాయ విభేద పరిష్కార పద్ధతుల సమాచారం జోడించింది. ‘ఆర్థిక నేపథ్యం’జోడింపు...సమాజంలో వివక్షకు కులం, మతం, జాతి, లింగం, వైకల్యం, లైంగికతవి కారణమవుతున్నాయని ఫిబ్రవరిలో ప్రచురితమైన పుస్తకంలో ఉండగా కొత్తదాంట్లో ‘‘ఆర్థిక నేపథ్యం’’అనే అంశాన్ని చేర్చారు. ‘సిటిజన్‌షిప్: రైట్స్ అండ్ డ్యూటీస్’అన్న అధ్యాయంలో వివక్ష అనేది అనైతికమైంది మాత్రమే కాకుండా చట్టపరంగానూ నిషేధించిందని స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా వివక్ష ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల యూజీసీ 2026 సమానత నియమావళి పై జరిగిన చర్చలో ఆర్థిక వెనుకబడిన స్థితి స్పష్టంగా రక్షిత వర్గంగా పేర్కొనలేదన్న విమర్శల మధ్య ఈ మార్పునకు ప్రాధాన్యమేర్పడింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రస్తావన పాఠ్యపుస్తకంలో, ఈ పుస్తకం సుప్రీం కోర్టు రిట్ పిటిషన్ (సివిల్) నెం: 1/2026 ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు మళ్లీ ప్రచురించామని ఎన్సీఈఆర్టీ స్పష్టం చేసింది. కొత్త పుస్తకం తయారీలో పాల్గొన్న రచయితల సంఖ్య 51 నుంచి 48కి తగ్గింది. -
స్వదేశీ కలం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణం స్వాతంత్య్రోద్యమ సమయంలో తనదైన పంథాలో పోరాటం చేసింది. శాంతి పోరాటం చేసే ఎందరో దేశభక్తుల చేతి ఆయుధంగా మారింది. కత్తితో కాదు కలంతోనే స్వాతంత్య్రం సాధించగలమనేవారికి అండగా నిలిచింది. పదునైన మాటలు, పాటలు ఉద్భవించడానికి తోడ్పడింది. అదే ‘రత్నం’ పెన్ను. రాజరాజనరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరం (రాజమండ్రి) కోటగుమ్మం సెంటర్ దగ్గరకు అడుగుపెడుతుండగా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. స్వదేశీ భావన కట్టలు తెంచుకుంటుంది. దేశభక్తి పరిమళాలు గుబాళిస్తాయి. అందుకు కారణం... స్వాతంత్య్ర సమర సమయంలో రూపుదిద్దుకున్న రత్నం పెన్నుల షాపు. స్వాతంత్య్రోద్యమం కదం తొక్కుతున్న సమయంలో 1921లో గాంధీజీ... ‘విదేశీ వస్తువులను నిషేధించి, స్వదేశీ వస్తువుల తయారీపై దృష్టి పెట్టండి’ అని ఇచ్చిన పిలుపును అందుకుని కోసూరి రత్నం అనే స్వర్ణకారుడు ఏదో ఒక స్వదేశీ వస్తువు తయారుచేయాలని భావించారు. ముందుగా గాంధీగారి లితోబ్లాక్ ను తయారుచేసి, నాటి మంత్రివర్యులైన కళావెంకట్రావుగారితో కలిసి వార్ధా వెళ్లి, బాపూజీకి స్వయంగా బహూకరించారు. ఆ సందర్భంలో గాంధీజీ... ‘అందరిలోనూ స్వదేశీ భావాలు నాటాలి’ అని సూచించారు. గాంధీజీ ఉపదేశం... తొలి స్వదేశీ కలం ఆవిర్భావానికి కారణమైంది. పాళీ తయారుచేసి... రాజమండ్రిలో 1931లో జస్టిస్ కృష్ణమాచారి సబ్జడ్జిగా పనిచేసేవారు. ఒకసారి ఆయన వాడే జర్మనీ పెన్ను పాళీ విరిగిపోయింది. ఆయన సన్నిహితులు పెన్నుల తయారీకి రత్నం చేస్తున్న కృషి వివరించి, అక్కడికి వెళ్లమని సూచించారు. రత్నం నివాసానికి కృష్ణమాచారి వెళ్లి పాళీ చూపించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపారు రత్నం. ఆ రోజంతా కష్టపడి... కొత్త పాళీలా తయారు చేసి, కృష్ణమాచారికి ఇచ్చారు. ఆయన రత్నంగారిని మెచ్చుకుని, తక్షణం పెన్నుల కంపెనీ ప్రారంభించమని ఒత్తిడి తెచ్చారు. అదే కాలంలో ‘ది హిందూ’ పత్రిక వ్యవస్థాపకులు సుబ్బారావు పంతులు షష్టిపూర్తికి పలువురు సీనియర్ పాత్రికేయులు, ఇతర పెద్దలు హాజరవుతున్న విషయం చెప్పి, ముఖ్యులకు బహుమతి ఇచ్చేందుకు రెండు పెన్నులు తయారు చేయమని కోరారు. దీంతో వెండి గొట్టాలతో, బంగారు పాళీలతో పెన్నులు తయారుచేసి వారికి అందించారు రత్నం సోదరులు. వీటిని చూసిన అక్కడి పెద్దలు, తమకూ పెన్నులు కావాలని ఒత్తిడి చేయడంతో 1932 లో రత్నం పెన్నుల కంపెనీ వ్యవస్థాపనకు తొలి అడుగు పడింది. అక్షరసేవ... కోసూరి రత్నం, ఆయన సోదరుడు సత్యంతో కలిసి 1932లో ‘రత్నం’ పేరుతో స్వదేశీ పెన్నుల కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ నుంచి వెలువడిన పెన్నుతో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ ఎందరో దేశనాయకులు లేఖాస్త్రాలు సంధించారు. ప్రజలను చైతన్యం చేస్తూ స్వాతంత్య్రోద్యమానికి పురికొల్పిన వేలాది వ్యాసాల రచనకు మాస్టర్ కాపీలను ఈ పెన్నులే అందించాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అక్షర సేవ చేసింది రత్నం సంస్థ. నాటి ప్రస్థానం నేటివరకూ కొనసాగుతూనే ఉంది. గాంధీగారు గుర్తించిన తర్వాతే... ఎందరో మహనీయుల ప్రోత్సాహంతో పెన్నుల తయారీ ప్రారంభించిన రత్నం... తాను తయారు చేసిన పెన్నును వార్ధాలో ఉన్న గాంధీజీకి పోస్టులో పంపారు. ఆ పెన్నును తిప్పి పంపుతూ, ‘‘బెంగుళూరు, కలకత్తాల్లో ఇలాగే విదేశీ పెన్నుల విడి భాగాలను అమర్చి విక్రయిస్తున్నా రు. ఇది కూడా అలాంటిదేనని భావిస్తున్నాను’’ అని లేఖ రాశారు. తమ పెన్నులను స్వదేశీ పెన్నుగా బాపూజీ గుర్తించలేదని రత్నం నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో 1935లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు జె.సి.కుమారప్ప రాజమండ్రి వచ్చి పెన్నుల తయారీకి ప్రభుత్వ సహకారం కావాలంటే తమ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అంతకంటే ముందుగా తనకు ఆ పెన్నులు తయారుచేసి చూపాలని కోరారు. రెండు రోజుల పాటు శ్రమించి రెండు పెన్నులు తయారుచేసి ఆయనకు ఇచ్చారు రత్నం సోదరులు. సుమారు రెండు నెలల తర్వాత 1935 జూలై 16న గాంధీజీ ఆంగ్లంలో స్వదస్తూరీతో రాసిన లేఖ వార్థా నుంచి వచ్చింది. అందులో... ‘‘డియర్ రత్నం, మీరు కుమారప్ప గారి ద్వారా పంపిన పెన్ను అందింది. అందుకు కృతజ్ఞతలు. ఇది నాకు చాలా అవసరం. ఇది విదేశీ పెన్నులకు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది’’ అని రాశారు. గాంధీ గారు రత్నం పెన్ను వాడుతున్నారన్న వార్త దేశమంతా వ్యాపించింది. దాంతో, అనేకమంది నేతలు రత్నం పెన్నుల కోసం ఎగబడ్డారు. అలా రత్నం పెన్నులకు స్వదేశీ పెన్ను అనే ఖ్యాతి దక్కింది. ఇలా నడుస్తోంది... యూజ్ అండ్ త్రో పెన్నుల ధాటికి తట్టుకోలేక ఈ కంపెనీ మూత పడే స్థితికి చేరినా, స్వాతంత్య్ర స్ఫూర్తిని పెట్టుబడిగా మలుచుకుని నేటికీ పెన్నుల తయారీని కొనసాగిస్తున్నారు, రత్నం కుమారుడు కె.వి.రమణమూర్తి. పదేళ్లపాటు వ్యాపారం ఒడిదుడుకుల పాలైనప్పటికీ రత్నం బ్రాండ్‌ను కొనసాగించాలనే నిర్ణయంతో పాతకాలం మెషినరీకి పదునుబెడుతూ ఇప్పటికీ పెన్నులు తయారుచేస్తున్నారు. ప్రపంచంలో అతి చిన్న పెన్ను తయారుచేసినందుకుగాను రికార్డులకెక్కారు. బంగారం పెన్నుపై గాంధీగారు, భారతమాత చిత్రాలను గీసిన ఖ్యాతి దక్కింది. స్వాతంత్య్ర ఉద్యమానికి అక్షరరూపం ఇచ్చిన రత్నంగారి కృషి కి నేటికీ ప్రభుత్వ గుర్తింపు లభించకపోవడం కాస్త బాధ కలిగించే విషయమే! - దేవళ్ల సూర్యనారాయణ మూర్తి, సాక్షి, రాజమండ్రి ఫొటోలు: వీరభగవాన్ తెలగరెడ్డి ఆవిర్భావం... ‘పిన్ను నుంచి పెన్ను వరకు’ అన్న గాంధీజీ మాటల్లోని ‘పెన్ను’ నాన్నగారిని ఆకర్షించింది. 1922 నుంచి పెన్నుల తయారీ పై దృష్టిపెట్టారు. అప్పట్లో చలామణీలో ఉన్న విదేశీ పెన్నులను అయ్యంగారి శ్రీరామమూర్తి మచిలీపట్నంలోని ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ల్యాబ్‌లో పరీక్ష చేయించి, అందులో వాడే మూల పదార్థాలను నాన్నగారికి వివరించారు. ముందుగా 14 క్యారెట్ల బంగారంతో పాళీ తయారుచేశారు. 1930 నాటికి స్వదేశీ పెన్నుకు రూపు తెచ్చారు. - కె.వి.రమణమూర్తి, (రత్నం కుమారుడు) వీరంతా రత్నం పెన్నులు వాడారు... ఉమ్మడి మద్రాసు రాష్ట్ర గవర్నర్‌గా, ముఖ్యమంత్రిగా పని చేసిన సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు, నెహ్రూ,పిఠాపురం మహారాజు ఎం.ఎస్.థామ్సన్, రిజర్వ్‌బ్యాంకు నాటి గవర్నర్ బి.వెంకటప్పయ్య, బెనారస్ మహారాజు విజయానంద గజపతి, నైజాం ప్రభుత్వ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు , భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన సమకాలీనులు రత్నం పెన్నులను విరివిగా వినియోగించారు.


