breaking news
Forma City
-
యజమాని అంగీకరిస్తేనే భూ సేకరణ!
సాక్షి, హైదరాబాద్: యజమానుల అంగీకారంతోనే భూ సేకరణ జరపాలన్న కీలక షరతుతో ఫార్మా సిటీ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల శాఖ పర్యావరణ అనుమతులు జారీ చేసింది. నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఫార్మాసిటీ నిర్మాణంతో నూతన అధ్యాయానికి తెరలేవనుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని 19,333.20 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ పారిశ్రామికవాడ నిర్మాణంతో 5.6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రభుత్వ అంచనా ప్రకారం.. ఫార్మా సిటీ ఔషధ ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.1.4 లక్షల కోట్ల టర్నోవర్ సాధించడంతోపాటు రూ.58 వేల కోట్ల విలువైన ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేయనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించనున్న ఫార్మాసిటీ కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. రూ.16,784 కోట్ల అంచనా వ్యయంతో నిర్మి స్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అంచనా వేసింది. హైదరాబాద్ నుంచి 298 కాలుష్య కారక ఔషధ పరిశ్రమలను ఫార్మా సిటీకి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నేతృత్వంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ నెల 7న ఢిల్లీలో సమావేశమై.. ఫార్మా సిటీ ప్రాజెక్టుకు 18 షరతులతో కూడిన పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసులు చేసింది. 18 షరతులివీ.. ♦ పర్యావరణ పరిరక్షణ నిబంధనల అమలు బాధ్యత టీఎస్‌ఐఐసీదే. ♦ పరిహారం చెల్లించి భూయజమానుల అంగీకారంతోనే మిగులు భూ సేకరణ జరపాలి. ♦ భూ నిర్వాసితులకు సరైన శిక్షణ అందించి వారి నైపుణ్యాన్ని పెంపొందించి, ఫార్మా సిటీలో వారికి టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఆవాసాలను మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాలి. సాధ్యం కాకుంటే ప్రస్తుతమున్న జనా వాసాలు, పరిశ్రమల మధ్య కనీసం ఒక కిలోమీటర్ బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి. ♦ ఫార్మాసిటీ నిర్మిత స్థలం, అడవుల మధ్య 100 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి. ♦ జల వనరులు కలుషితం కాకుండా 100 మీటర్ల బఫర్ జోన్‌తో రక్షణ కల్పించాలి. ♦ ఫార్మా సిటీ ప్రతిపాదిత ప్రాంతానికి 5 కి.మీల పరిధిలో ఉన్న గ్రామాల్లో వార్షిక ఆరోగ్య సర్వే నిర్వహించాలి. గ్రామస్తులకు వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవాలి. ♦ బాయిలర్ల కోసం సహజ వాయువులనే వినియోగించాలి. మీథేన్ వాయువుల ఉద్గారాన్ని నిరంతరంగా సమీక్షిస్తుండాలి. ♦ భూ ఉపరితల జలాలు, భూగర్భ జలాల నాణ్యతలపై క్రమం తప్పకుండా సమీక్షలు జరిపి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, పీసీబీలకు త్రైమాసిక నివేదికలు సమర్పించాలి. ♦ ఫార్మా సిటీ అవసరాలకు భూగర్భ జలాలను వినియోగించరాదు. ♦ కేంద్ర/రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ఎప్పటికప్పుడు గాలి, నీటి నాణ్యతల సమాచారాన్ని తెలిపే ఆన్లైన్ సమీక్షల విధానాన్ని ఏర్పాటు చేయాలి. ♦ అటవీ శాఖతో సంప్రదింపులు జరిపి రిజర్వు ఫారెస్టు సంరక్షణ ప్రణాళిక అమలు చేయాలి. మూడేళ్లలో రూ.28.22 కోట్లు ఖర్చు చేసేలా చూడాలి. పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)లో భాగంగా ప్రతిపాదించిన ఖర్చులకు ఇది అదనం. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం టీఎస్ఐఐసీ, అటవీ శాఖతోపాటు ఈ అంశంలో అవగాహన కలిగిన 2 జాతీయ గుర్తింపున్న స్వచ్ఛంద సంస్థలతో కమిటీ ఏర్పాటు చేయాలి. పర్యావరణం, కాలుష్యంపై సమీక్షల కోసం మరో కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ రెండు కమిటీలు ఏడాదికి కనీసం రెండుసార్లు సమావేశమై పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ రాష్ట్ర భూగర్భ జల శాఖ సహకారంతో ప్రాజెక్టు ప్రాంతంలో పీజోమీటర్లు ఏర్పాటు చేయాలి. భూగర్భ జలాల నాణ్యతలను త్రైమాసికంగా పరీక్షించి పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ ఫార్మా సిటీకి 5 కి.మీల పరిధిలో ఉన్న పంట పొలాల స్థితిగతులు, దిగుబడులపై వార్షిక అధ్యయనం జరిపి పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ సిటీ మూడో విడతలో ఆరెంజ్, గ్రీన్, వైట్ కేటగిరీల పరిశ్రమలనే ఏర్పాటు చేయాలి. ♦ ఫార్మా సిటీలోని ప్రతి పరిశ్రమ సొంత వ్యర్థాల శుద్ధి కర్మాగారం (ఈటీపీ) ఏర్పాటు చేసుకునే విధంగా సంబంధిత నియంత్రణ సంస్థ చర్యలు తీసుకోవాలి. ఫార్మా సిటీలోని కేంద్ర వ్యర్థాల శుద్ధి ప్లాంట్‌పై ఒత్తిడి పెరగకుండా బల్క్ ఔషధాలు, రసాయన మిశ్రమాల ఉత్పత్తి పరిశ్రమలు ఈటీపీలు ఏర్పాటు చేయాలి. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలి. సరైన విరుగుడు మందులతోనే రసాయనాల రవాణా జరపాలి. రసాయ నాలు రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. పర్యావరణ పరిరక్షణ నివేదికలో పేర్కొన్నట్టు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి -
ఫార్మాసిటీని రద్దు చేయండి
పార్లమెంటరీ బృందానికి కాంగ్రెస్ నేతల వినతి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పేదల భూములతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని ఆరోపిం చింది. శనివారం నగర పర్యటనకు వచ్చిన రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి సారథ్యంలోని కేంద్ర శాస్త్ర, సాంకేతిక అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులను డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆధ్వరంలో కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఫార్మాసిటీ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతి, ప్రజాభిప్రాయసేకరణ లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భూసేకరణ జరుపుతోందని ఎన్డీఆర్ఎఫ్ మాజీ చైర్మన్ ఎం.శశిధర్‌రెడ్డి, కిసాన్–ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, పర్యావరణవేత్త ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి వివరించారు. వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం జీవనోపాధి కోల్పోతుందని, నగరానికి సరఫరా అయ్యే కూరగాయలు, పాలు, పండ్ల ఉత్పత్తులపై ప్రభావం పడుతుందనే అంశాన్ని విస్మరించడం శోచనీయమన్నారు.