సేఫ్టీ ఫిఫ్టీ
జిల్లాలో ఎక్కడ చూసినా అధిక శాతంలో కలుషిత ఆహార పదార్థాలనే విక్రయిస్తున్నారు. రంగులు, రసాయనాలు కలిపిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన వాటిని విక్రయిస్తుండటంతో ఎక్కువమంది అనారోగ్యంబారిన పడుతున్నారు. కలుషిత ఆహారం తినడంతో జీర్ణ, లివర్, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. అదేవిధంగా శరీరంలో అధిక ఫ్యాట్ చేరుకోవడంతో పాటు కేన్సర్ తదితర ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు నగరంలో కొన్ని కార్పొరేట్ స్థాయి హోటళ్లలోనూ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగదారులకు పెట్టే పరిస్థితి నెలకొంది. గతంలో ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో అనేక విషయాలు వెలుగు చూశాయి. నగరంలోని వివిధ హోటళ్లలో నిల్వ ఉంచిన వాటిని వినియోగదారులకు పెడుతున్నట్లు నిర్ధారించి కేసులు నమోదు చేశారు.
అధికారి లేక పోవడంతోనే..
జిల్లాలోని హోటల్స్, మాల్స్, పాల వ్యాపార కేంద్రాలు, ఆహార పదార్థాలు తయారు చేసే ఏ ప్రాంతాల్లో నైనా ఫుడ్‌కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. అనుమానం వస్తే వాటి శాంపిల్స్ సేకరించాల్సి ఉంటుంది. కాగా ఇందుకోసం జిల్లాలో ఆహార నాణ్యతను పరిశీలించాల్సిన అధికారి లేక పోవడంతో తనిఖీలు చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారిగా ఉన్న హనుమంతరావు బదిలీపై నెల క్రితం విజయవాడ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆయన వెళ్లినప్పటి నుంచి ఇంత వరకు వేరే అధికారిని నియమించ లేదు. ఇన్చార్జి బాధ్యతలను ఎవరికీ కేటాయించలేదు. దీంతో కింద స్థాయి అధికారులు కూడా ఏమిచేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఆహార పదార్థాలు తనిఖీలు నిర్వహించేందుకు ముగ్గురు గెజిటెడ్ అధికారులు, ఇద్దరు నాన్గెజెటెడ్ అధికారులు మొత్తం ఐదుగురు అధికారులు ఉండాల్సి ఉంది. వీరిలో ముగ్గురు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. మిగిలిన ఇద్దరిని ఇంకా నియమించలేదు. వీరు కూడా నెల్లూరు, గూడూరు, కావలి పరిధి లోని ఆయా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిం చాల్సి ఉంది. తగినంత సిబ్బంది లేక పోవడంతో కూడా తనిఖీలు చేయలేని పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి.
70కు పైగా లైసెన్స్‌ల పెండింగ్
జిల్లాలో ఏ రకం ఆహార పదార్థాలను తయారు చేయాలనే ఆయా కేంద్రాలు ఫుడ్‌కంట్రోల్ అధికారి నుంచి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నెల్లూరులో దాదాపుగా 70 కేంద్రాలకు పైగా లైసెన్స్లుకోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో 30 మంది వరకు లైసెన్స్‌ల కోసం తిరుగుతున్నారు. లైసెన్స్‌లు ఇవ్వాల్సిన అధికారి లేక పోవడంతో ఆ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.
120 కేసుల నమోదు
జిల్లాలో తినే ఆహారం, తాగేనీరు, తయారీ చేసే ప్రాంతాలు, ట్రాన్స్‌పోర్టు ప్రాంతాల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారులకు తనిఖీలు చేసే అధికారం ఉంది. ప్రధానంగా హోటల్స్, స్వీట్ షాపులు, పాలవిక్రయ కేంద్రాలు, పండ్లరసాల షాపులలో తనిఖీలు నిర్వహించాలి. తనిఖీలు నిర్వహించిన సమయంలో సేకరించిన శాంపిల్స్ హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపుతారు. శాంపిల్స్ రిపోర్టు వచ్చిన తరువాత సంబంధిత షాపు, హోటల్‌పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తారు. కాగా వీటిలో రెండు రకాలుగా కేసులు నమోదు చేస్తారు. మొదటగా పండ్లపై రసాయనాలు ఉపయోగించడం, శీతల పానీయాలు కల్తీ, రంగుల కలిపిన ఆహార పదర్థాలు, దెబ్బతిన్న పండ్ల, స్వీట్లకు సంబంధించిన దుకాణాలపై మొదటి రకం కేసులు నమోదు చేస్తారు. ఈ కేసులు ఇప్పటి వరకు 70 వరకు నమోదు చేశారు. రెండో రకంలో గుట్కా విక్రయాలు, స్టాకు ఉన్న పదార్థాల వంటి వాటిపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై జాయింట్ కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. అదేవిధంగా గతంలో తొమ్మిది ప్రధాన హోటల్స్‌లో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కూడా నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
లైసెన్స్‌లు 30 శాతమే
ఆహార పదార్థాలు విక్రయాలు చేసే ప్రతి సంస్థ, దుకాణం, మాల్స్‌లు తప్పని సరిగా ఆహార భద్రతా ప్రమాణాల చట్టానికి సంబంధించి లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షల లోపు టర్నోవర్ చేస్తున్న షాపులు సంవత్సరానికి రూ.1,000, రూ.12 లక్షలకు పైన, రూ.20 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వాళ్లు ఏడాదికి రూ.2 వేలు కట్టి లైసెన్స్ తీసుకోవాలి. ప్యాక్ చేసి బ్రాండ్ నేమ్ వేసుకునే వారు ఏడాదికి రూ.3 వేలు, వివిధ రకాల తయారీ యూనిట్లు రూ.5 వేలు కట్టి లైన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో మొత్తం వివిధ రకాల ఆహార పదార్థాలు విక్రయాలు చేసే దుకాణాలు, హోటల్స్, మాల్స్ అన్ని దాదాపుగా 10 వేలకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. వీటిలో కేవలం 30 శాతం మాత్రమే లైసెన్స్‌లు తీసుకుని ఉన్నారని అధికారులు చెబుతున్నారు.