పడతులదే పైచేయి!
                  
	 ఓటరు నమోదులో మళ్లీ మహిళలదే హవా
	  కొత్తగా చేరిన వారు 17,410 మంది
	  ఈ సారి విజయనగరానిది ఆధిక్యం
	  జిల్లా ఓటర్లు 17,31,610 మంది
	 
	 విజయనగరం కంటోన్మెంట్: అతివలు మళ్లీ పైచేయి సాధిం చారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఓటరుగా నమోదు చేయించుకోవడం లో మహిళలు ముందున్న సంగతి తెలిసిందే. జిల్లాలోనూ మహిళలే ఓటరు నమోదులో దూకుడు చూపించారు. ఇటీవల ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం విజయనగరం జిల్లా ఓటర్ల సంఖ్య 17,31,610 మంది. 2014 అక్టోబర్ 12న ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు.
	 
	  జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ల వద్దా, ఆన్లైన్లోనూ ఈ ఓటర్ల నమోదు, తొలగింపు, అడ్రస్ మార్పు వంటి సవరణలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొత్తగా 17,410 మంది వయోజన ఓటరుగా నమోదు చేసుకోవడంతో వాటిని పరిశీలించిన అధికారులు వారికి ఓటరుగా గుర్తింపు ఇచ్చారు. ఈ నెల 25న జరిగే జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వీరికి కార్డులు అందించనున్నారు. ఈ సారి జిల్లాలో చనిపోయిన, డబుల్ ఎంట్రీలున్న వారిని గుర్తించి చేసిన దరఖాస్తు ప్రకారం 5932 మంది ఓటర్లను తొలగించారు. దీంతో ఇక నుంచి వీరికి ఓటరు జాబితాల్లో చోటు దక్కే పరిస్థితి లేదు. జిల్లాలో కొత్త ఓటరు జాబితాలను అన్ని పోలింగ్ కేంద్రాల వద్దా ఉంచుతున్నట్లు ఎన్నికల సెల్ అధికారులు తెలిపారు.
	 
	  కొత్తగా చేరిన 17,410 మంది ఓటర్లలో మహిళలు ఎక్కువగా ఉన్నారు.
	  పురుషులు 8093 మంది ఉండగా మహిళలు 9307 మంది కావడం గమనార్హం.
	  హిజ్రాలకు గత సవరణ కార్యక్రమాల నుంచి ఓటరు నమోదు అవకాశం ఇవ్వగా ఆ సంఖ్య 143కు పెరిగింది.
	  గతంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్నా బొబ్బిలి అతి ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గంగా గుర్తింపు పొందితే ఇప్పడు ఆ స్థానాన్ని విజయనగరం కైవసం చేసుకుంది.
	  జిల్లాలో అత్యధికంగా 2,18,513 మంది ఓటర్లు విజయనగరం నియోజకవర్గంలోనే ఉన్నారు.
	  విజయనగరంలో 34 మంది ఇతరులు(హిజ్రాలు) ఉండగా ఎస్.కోటలో 31 మంది ఉన్నారు.
	  ఎస్.కోట తర్వాతి స్థానం నెల్లిమర్లది. ఇక్కడ 21 మంది హిజ్రాలు ఇతరులుగా ఓటరు నమోదు చేసుకున్నారు.
	  మిగతా నియోజకవర్గాల్లో కొద్ది సంఖ్యలోనే వీరి నమోదు జరిగింది.
	  మొత్తం మీద 143 మంది ఇతర ఓటర్లు నమోదయ్యారు.
	  తొలగించిన 5,932 మంది ఓటర్లలో మహిళలు 2,981 మంది కాగా పురుషులు 2950 మంది ఉన్నారు.
	  మళ్లీ ఓటరు జాబితా సవరణ జరిగే వరకూ ఈ జాబితాలోని సంఖ్యే అధికారికంగా ఉంటుంది.  
	 
	 కొత్త జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య ఈ కింది విధంగా ఉంది
	 నియోజకవర్గం    పురుషులు    మహిళలు    మొత్తం
	 కురుపాం    86,769    90941    1,77,741
	 పార్వతీపురం    86,326    88,322    1,74,659
	 సాలూరు    86,764    90,914    1.77,695
	 బొబ్బిలి    1,04,787    1,07,698    2,12,490
	 చీపురుపల్లి    94,852    94765    1.89.631
	 గజపతినగరం    92,526    95,468    1,87,998
	 నెల్లిమర్ల     94,421    95,510    1,89,952
	 విజయనగరం    1,07,496    1,10,983    2,18,513
	 శృంగవరపు కోట    99,547    1,03,378    2,02,931