breaking news
False notes
-
ఏటీఎంలో దొంగనోట్లు
ఖర్చుల కోసం డబ్బులు తీయడానికి ఏటిఎంకు వెళ్లిన ఓ ఉపాధ్యాయుడు తన ఎకౌంట్లో నుంచి రూ. 9 వేలు డ్రా చేశాడు. కిరాణ దుకాణంలో బిల్లు చెల్లించడానికి డబ్బులు ఇవ్వగా.. షాపు యజమాని మీరు ఇచ్చింది 'దొంగ నోటు సార్..' అని చెప్పడంతో షాక్ తిన్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ దొంగ నోట్లే అని తేలడంతో.. లబోదిబో మనుకుంటూ బ్యాంకు అధికారులను ఆశ్ర యించాడు. బ్యాంకు అధికారులు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని ఏటీఎంల నిర్వాహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించామని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా తగరపువలసలో మంగళవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ ఉపాధ్యాయుడు భీమిలి రోడ్డులోని ఆంధ్రాబ్యాంక్ సమీపంలోగల ఎస్బీఐ ఏటీఎం నుంచి రూ. 9 వేలు డ్రా చేశాడు. అనంతరం అవన్ని దొంగనోట్లు అని తేలడంతో.. అవాక్కై బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించినా లాభం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జోరుగా దొంగనోట్ల చెలామణి
భద్రాచలం : భద్రాచలంలో దొంగనోట్లు జోరుగా చెలామణి అవుతున్నాయి. దొంగనోట్ల కారణంగా చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పట్టణంలోని పాత మార్కెట్ సెంటర్లో గల కూరగాయల దుకాణాల నిర్వహించే వారికి కొంతమంది దొంగనోట్లను అంటగట్టారు. రెండు రోజులుగా ఇదే తంతు జరుగుతుండటంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కూరగాయలు అమ్మితే రూ.200ల వరకూ ఆదాయం వస్తుందని, కానీ దొంగనోట్ల వల్ల దీన్ని పోగొట్టుకుంటున్నామని వెంకటమ్మ అనే కూరగాయల వ్యాపారి తెలిపింది. రూ.100 నోటు వస్తే తీసుకొని కూరగాయలు ఇవ్వటంతో పాటు, తిరిగి చిల్లర కూడా ఇచ్చానని చెప్పింది. తీరా సాయంత్రం వ్యాపారికి డబ్బులు కట్టే సమయంలో అది దొంగనోటు అని తెలియటంతో ఆ చిరు వ్యాపారి గుండెలు గుబేలు మన్నాయి. రోజంతా మండుటెండులో కూర్చుని అమ్మిన ఆదాయం పోయిందిన ఆవేదన వ్యక్తం చేసింది. మార్కెట్ సెంటర్లో ఇటీవల కాలంలో ఏదో ఒకచోట ఇలా దొంగనోట్లు బయట పడుతున్నాయి. ఇందులో మార్కెట్ ఏరియాలో ఉన్న కొంతమంది ప్రముఖ వ్యాపారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఇటీవలనే దొంగనోట్ల ముఠాను భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. కానీ దొంగనోట్ల చెలామణి మాత్రం ఆగకపోవటంతో పట్టణ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు దీనిపై నిఘా ఏర్పాటు చేయాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.