breaking news
employment Day
-
గెలిపించి ఉంటే కేంద్రమంత్రి అయ్యేదాన్ని!
సాక్షి, చెన్నై: తన లాంటి ప్రతిభావంతులను ప్రజలు గుర్తించడం లేదని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. తనలాంటి వారి ప్రతిభ వృథా కాకూడదనే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవులు అప్పగించిందన్నారు. సోమవారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన స్టాఫ్ డే (ఉద్యోగ దినోత్సవం) కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. తాను ఈ కార్యక్రమానికి వచ్చే సమయంలో ఓ పెద్దాయన తన వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లను చూసి, రెండు ఫోన్లను ఎలా భరిస్తున్నారని ప్రశ్నించారని చెప్పారు. తాను రెండు రాష్ట్రాలనే పర్యవేక్షిస్తున్నప్పుడు.. ఈ రెండు ఫోన్లను భరించలేనా? అని సమాధానం ఇచ్చానని వివరించారు. ఇక ఆదివారం ఓ కార్యక్రమంలో తాను కిందపడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘రోజుకు 48 గంటలు ఉన్నా కూడా నేను పనిచేయడానికి సిద్ధం. అయినా నేను కిందా మీదా పడి పనిచేస్తుంటే అది వార్తగా రావడం లేదు. అదే కింద పడితే మాత్రం అతిపెద్ద వార్తగా వచ్చేస్తోంది.’’అని తమిళిసై చమత్కరించారు. రాజకీయాల్లో ఆమె ప్రస్థానంపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకూ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ‘‘తమిళ ప్రజలు నన్ను గుర్తించలేదు. గుర్తించి ఉంటే పార్లమెంట్ వెళ్లి, ఆ తర్వాత కేంద్రమంత్రిని కూడా అయ్యేదాన్ని. ప్రజలు ఓడించినా నాలాంటి వారి ప్రతిభ వృధా కాకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం గవర్నర్ పదవులను కేటాయిస్తోంది..’’అని పేర్కొన్నారు. -
‘డిసెంబర్ 2ను ఉపాధి దినంగా ప్రకటించాలి’
హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి వర్థంతి రోజును తెలంగాణ ఉపాధి దినంగా గుర్తించాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఓయూ అతిథిగృహం సెమినార్ హాల్లో నిర్వహించిన శ్రీకాంతాచారి ఏడో వర్థంతి సభలో ఆయన ప్రసంగించారు. శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని కోదండరాం అన్నారు. విశ్వకర్మ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.