breaking news
durgam pond
-
దుర్గం చెరువుపై వేలాడే వంతెన!
సాక్షి, సిటీబ్యూరో: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎస్సార్డీపీ)లో భాగంగా దుర్గం చెరువుపై కేబుల్ స్టే బ్రిడ్జి (వేలాడే వంతెన) నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టు ప్రణాళికలు రూపొందించి రెండేళ్లు దాటినప్పటికీ, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇటీవల మేనెలలో ఆహ్వానించిన టెండర్లకు సైతం పెద్దగా స్పందన లేకపోవడంతో అన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తగు మినహాయింపులనిచ్చింది. దీంతో ఈప్రాజెక్టు కార్యరూపం దాల్చగలదని భావిస్తున్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్ ఇనార్బిట్‌మాల్ వరకు దాదాపు కి.మీ. పొడువున నిర్మించే ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్ రూట్లో వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. అలాగే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకోనుంది. హౌరా– కోల్‌కత్తాల నడుమ నున్న హౌరా బ్రిడ్జిని( రవీంద్ర సేతు) తలపించేలా ఈ వేలాడే వంతెనను నిర్మించనున్నారు రెండేళ్లలో... నిర్మాణం పూర్తయ్యేందుకు రెండేళ్లు పట్టనుంది. ఆరులేన్లతో తగిన ఫుట్‌పాత్‌లతో నిర్మించనున్న ఈబ్రిడ్జిపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. దీనికయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ చెరిసగం భరించనున్నాయి. ముంబై, గోవా, కోల్కత్తా, జమ్మూకాశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఇలాంటి బ్రిడ్జిలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అందుబాటులో లేవు. డిఫెక్ట్ లయబిలిటీ పదేళ్లు.. సాధారణంగా ఏప్రాజెక్టుకైనా డిఫెక్ట్ లయబిలిటీ 2 సంవత్సరాల వరకుంటుంది. ఇలాంటి వంతెన నగరంలో ఇదే కొత్తది కావడం, సాంకేతిక పరిజ్ఞానం సైతం అత్యంతాధునికమైనది, అరుదైనది కావడంతో డిఫెక్ట్ లయబిలిటీ కాలాన్ని పది సంవత్సరాలకు పెంచారు. ఇలాంటì ప్రాజెక్టులు చేసిన గత అనుభవాల్లోనూ కొద్ది మినహాయింపులనిచ్చారు. టెండరు ప్రీమియం కన్నా 5 శాతం కంటే ఎక్సెస్ వేయరాదనే నిబంధన కు సైతం పనుల ప్రత్యేకత దృష్ట్యా మినహాయింపునిచ్చారు. ఎస్ఈ అంతకన్నా పైస్థాయి అధికారులు జారీ చేసిన ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్ ఉంటే కౌంటర్ సిగ్నేచర్ అవసరం లేకుండానూ మినహాయింపులిచ్చారు. వీటితోపాటు మరికొన్ని మినహాయింపులిచ్చారు. ఈబ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. ♦ నగరంలోని ఇతర ప్రాంతాలనుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లే వారికి సదుపాయంగా ఉంటుంది. ♦ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 36, మాదాపూర్ మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ♦ జూబ్లీహిల్స్ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలి వెళ్లేవారికి దాదాపు 2 కి.మీ.ల మేర దూరం తగ్గుతుంది. బ్రిడ్జి ముఖ్యాంశాలు.. ♦ అప్రోచ్‌లతో సహ బ్రిడ్జి పొడవు: 1048 మీ. ♦ కేబుల్ స్టే బ్రిడ్జి (వేలాడే వంతెన): 366 మీ. ♦ అప్రోచ్ వయడక్ట్, ర్యాంప్: 682 మీ. -
దుర్గం చెరువు వద్ద హ్యాంగింగ్ బ్రిడ్జి
నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి హైదరాబాద్: దుర్గం చెరువును పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామని, చెరువు వద్ద త్వరలో హ్యాంగింగ్ బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని నెక్టార్ గార్డెన్, దుర్గం చెరువును ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా నెక్టార్ గార్డెన్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దుర్గం చెరువులో ఉన్న గుర్ర పు డెక్కను వారం రోజులలో తొలగించటంతోపాటు చెరువు గట్టును ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే మురుగునీటి శుద్ధి ప్లాంట్(ఎస్టీపీ)ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా దుర్గం చెరువు అభివృద్ధికి చేపట్టే చర్యలపై నివేదిక రూపొందించేందుకు అయిదు శాఖలతో కూడిన కమిటీని ప్రకటించారు. వారం రోజుల్లో సవివరమైన నివేదికను అందించాలని కమిటీని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఆంధోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.