breaking news
dharmika parishat meet
-
'దేవాదాయశాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకం'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'టీడీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం అయినా పట్టించుకోలేదు. కొన్ని మఠాలలో అక్రమాలు జరిగినా చర్యలు తీసుకోలేదు. ధార్మిక పరిషత్‌కి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. దేవాదాయశాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకం. అందుకే 21 మందితో ధార్మిక పరిషత్‌ని ఏర్పాటు చేశాము. సీజీఎఫ్ కమిటీని పూర్తిస్థాయిలో నియమించాం. గతంలో నలుగురు మాత్రమే ఉన్నారు. అందులో మరో ముగ్గురిని చేర్చాం. కలికి కోదండరామిరెడ్డి, మలిరెడ్డి వెంకటపాపారావు, కర్రి భాస్కరరావులను సభ్యులుగా నియమించాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసమే ఈ కమిటీలను నియమించాం. చదవండి: (21 మందితో ధార్మిక పరిషత్) కనీసం గ్రామానికి ఒక దేవాలయానికి దూప, దీప నైవేధ్యం పథకం అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. అన్ని జిల్లాల అధికారులకు దరఖాస్తులను పరిశీలించాలని కోరాం. దీని ద్వారా ప్రతి గ్రామంలో హిందూ దేవాలయలను పరిరక్షించే బాధ్యతను తీసుకున్నాం. ట్రిబ్యునల్ కేసులకు సంబంధించిన వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేస్తున్నాం. దేవాలయాలకు 4లక్షల 9వేల ఎకరాల భూములున్నాయి. వాటిలో కొన్ని ఆక్రమణలో ఉన్నాయి. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని' మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇంటికి సీఎం జగన్) -
21 మందితో ధార్మిక పరిషత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలు, మఠాలు, సత్రాలు, ఇతర హిందూ ధార్మిక సంస్థల వ్యవహారాలపై ప్రభుత్వ పరంగా తీసుకొనే విధాన నిర్ణయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే ధార్మిక పరిషత్ పదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఏర్పాటయింది. దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ఇద్దరు మఠాధిపతులు, ఇద్దరు ఆగమ పండితులు, ఓ రిటైర్డు హైకోర్టు జడ్జి, ఓ రిటైర్డు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి, ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక రిటైర్డు దేవదాయ శాఖ అధికారితో పాటు ఆలయాల నిర్మాణంలో ముఖ్య భూమిక ఉండే ఇద్దరు దాతలు, వివిధ ఆలయాల పాలక మండళ్లకు చైర్మన్లుగా ఉన్న ఆరుగురుని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. అధికారవర్గాల నుంచి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో సభ్యులుగా, దేవదాయ శాఖ కమిషనర్ సభ్య కార్యదర్శిగా (మెంబర్ సెక్రటరీ) ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబరు 571 విడుదల చేసింది. పరిషత్ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్లు కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఉమ్మడి ఏపీలోగానీ, ప్రస్తుత విభజిత ఏపీలోగానీ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కమిటీ సభ్యులు ధార్మిక పరిషత్‌లో దేవదాయ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈవో మినహా మిగిలిన 17 మంది పేర్లు.. మఠాధిపతులు: 1) పెద్ద జియ్యంగార్ మఠం, తిరుమల 2) పుష్పగిరి మఠం, వైఎస్సార్ జిల్లా రిటైర్డు హైకోర్టు జడ్జి: మఠం వెంకట రమణ రిటైర్డు ప్రిన్సిపల్ జడ్జి: కె. సూర్యారావు రిటైర్డు ఐఏఎస్ అధికారి: అజేయ కల్లం ఆగమ పండితులు: పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు, సీహెచ్ శ్రీరామ శర్మ చార్టెడ్ అకౌంటెంట్: శ్రీరామమూర్తి దేవదాయ శాఖ రిటైర్డు అధికారి: ఏబీ కృష్ణారెడ్డి (రిటైర్డు అడిషనల్ కమిషనర్) దాతలు: ఎస్ నరసింహారావు, యూకే విశ్వనాథ్‌రాజు ఆలయ, సత్రాల పాలక మండళ్ల సభ్యులు: ఎం.రామకుమార్ రాజు, భీమవరం (జగన్నాథరాజు సత్రం), ఇనుగంటి వెంకట రోహిత్ (అన్నవరం), జ్వాలా చైతన్య (యడ్ల పిచ్చయ్య శెట్టి సత్రం, కడప), చక్కా ప్రభాకరరావు (చాకా వారి సత్రం, పాలకొల్లు), మాక్కా బాలాజీ, రంజన్ సుభాషిణి. దేవదాయ శాఖలో పరిషత్‌వి విస్త్రత అధికారాలే.. దేవదాయ శాఖ పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో ధార్మిక పరిషత్ అత్యంత ఉన్నత కమిటీ. శాఖ పరిధిలోని రూ.25 లక్షల నుంచి రూ. కోటి లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలు, అన్ని రకాల మఠాల పాలన, ధార్మిక వ్యవహారాలు పూర్తి పరిషత్ ఆధీనంలో కొనసాగాలి. రాష్ట్రంలో చిన్నా పెద్దవి కలిపి మొత్తం 128 మఠాలు ఉన్నాయి. మంత్రాలయం, హథీరాంజీ మఠం వంటివి ఈ కేటగిరిలోకే వస్తాయి. ► ఏటా రూ. 25 లక్షలకు పైబడి కోటి రూపాయలకు తక్కువ వార్షికాదాయం వచ్చే ఆలయాలకు ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పాలక మండళ్ల నియామకం జరుగుతుంది. ► దేవదాయ శాఖ పరిధిలో ఉండే అలయాలు, సత్రాల కార్యకలాపాలపై తీసుకొనే విధాన పరమైన నిర్ణయాల్లో పరిషత్ కీలకంగా వ్యవహరిస్తుంది. ► వందేళ్లు దాటిన ఆలయాల పునర్నిర్మాణానికి ముందుగా పరిషత్ అనుమతి తీసుకోవాలి. ► హిందూ ధార్మిక పరమైన కార్యక్రమాల నిర్వహణలో ధార్మిక పరిషత్‌తో చర్చించే నిర్ణయాలు జరుగుతాయి. ► నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్ మూడు నెలలకొకసారి తప్పనిసరిగా సమావేశమవ్వాలి. అవసరమైతే ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉమ్మడి ఏపీలో ధార్మిక పరిషత్‌ను తొలిసారి ఏర్పాటు చేసింది వైఎస్సే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ధార్మిక పరిషత్‌కు దఖలు పడిన అధికారాలన్నీ అంతకు ముందు ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన వెంటనే తొలిసారి ధార్మిక పరిషత్ ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు జరిగాయి. అయితే, పరిషత్ ఏర్పాటు జీవో విడుదలకు ముందే వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం చెందారు. ఆ తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో విడుదలైంది. అప్పుడు ఏర్పడిన పరిషత్ పదవీకాలం 2012లో ముగిసింది. ఉమ్మడి ఏపీలోనే 2014లో మరోసారి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ, అది బాధ్యతలు చేపట్టక ముందే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పరిషత్ ఏర్పాటుకు ముందే రద్దయింది. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014 – 19 మధ్య రెండు విడతలు ధార్మిక పరిషత్ ఏర్పాటుకు దేవదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం 21 మంది సభ్యులతో పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటుకు ముందుకు రాలేదు. తిరిగి పదేళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ధార్మిక పరిషత్‌ను రెండో విడత పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. -
పీఠాధిపతి నియామకాన్ని 2 నెలల్లో పూర్తిచేయండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా, కందిమల్లయ్య పల్లె గ్రామంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి కన్నుమూసిన నేపథ్యంలో పీఠాధిపతి నియామకాన్ని రెండు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు గురువారం ఏపీ ధార్మిక పరిషత్‌ను ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విని పీఠాధిపతి నియామకం చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ, కుమారుడు ఎన్.గోవిందస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను పీఠాధిపతులుగా బాధ్యతలు నిర్వర్తించకుండా దేవదాయ శాఖాధికారులు జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దుచేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. మఠం పీఠాధిపతిని తాత్కాలికంగా నియమించే అధికారం ధార్మిక పరిషత్‌కు ఉందని స్పష్టంచేశారు. మఠాధిపతులుగా తమను నియమించాలన్న అభ్యర్థనను సింగిల్ జడ్జి పట్టించుకోలేదంటూ గోవిందస్వామి, మారుతి మహాలక్షుమ్మ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం తీర్పునిచ్చిన ధర్మాసనం.. ఇరుపక్షాల వాదనలు విని రెండునెలల్లో మఠం పీఠాధిపతి నియామకాన్ని పూర్తిచేయాలని ధార్మిక పరిషత్‌ను ఆదేశించింది. -
ధార్మిక సభలో ఉద్రిక్తత.. మధ్యలో వెళ్లిపోయిన మంత్రి
హిందూ ధార్మిక సభలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. అడ్డదిడ్డంగా విగ్రహాలు కూల్చేసిన చంద్రబాబు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆలయాలు, విగ్రహాల కూల్చివేతపై విజయవాడలో సోమవారం సాయంత్రం భారీ నిరసన సభ నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు పలు పీఠాల అధిపతులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. నిరసన సభకు విజయవాడ నగరవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సభలో ముందుగా మంత్రి కామినేని శ్రీనివాస్ నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడిన కాసేపటికే భక్తులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కలెక్టర్, కమిషనర్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో సభ మధ్యలోనే కామినేని శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజులతో పాటు దేవాదయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కూడా పాల్గొన్నారు.