breaking news
devineni umamaheswarrao
-
విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ను రాజకీయంగా ఏకాకిని చేయడానికి పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. విజయవాడ నగరం కేంద్రంగా ఎత్తులకు పైఎత్తులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కేశినేని నాని కుమార్తె శ్వేత స్థానంలో నగర కార్పొరేషన్ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ భార్య రమాదేవిని రంగంలోకి దించాలని వ్యూహం రచించాయి. అయితే పాత పద్ధతిలోనే మున్సిపోల్స్‌ను పునఃప్రారంభించాలని ఎస్ఈసీ ఆదేశించిన నేపథ్యంలో రమాదేవి పేరు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. పార్టీ అధిష్టానం అండతోనే.. కేశినేనికి వ్యతిరేక వర్గంగా గుర్తింపున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, వర్ల రామయ్య, తాజాగా వివాదాస్పదునిగా గుర్తింపు పొందిన కొమ్మారెడ్డి పట్టాభిరాం తదితరులకు అధిష్టానం నుంచే ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. కేశినేనిని విభేదిస్తూ ఆయనకు వ్యతిరేకంగా తాజాగా చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే... ♦విజయవాడ పార్లమెంటు జిల్లా పార్టీ కార్యదర్శి నియామకం విషయంలో నాయకుల మధ్య బేధాభిప్రాయాలు తీవ్రమయ్యాయి. కేశినేని మైనార్టీ వర్గానికి చెందిన ఫతావుల్లా పేరును ప్రతిపాదించారు. కానిపక్షంలో బీసీ వర్గానికి చెందిన గోగుల వెంకటరమణను సూచించారు. తనకు తెలియకుండా పశ్చిమ నియోజకవర్గం నుంచి మరో మైనార్టీ నాయకుడిని ఎలా సిఫార్సు చేస్తారంటూ నాగుల్‌మీరా అభ్యంతరం వ్యక్తంచేయడంతో పాటు బుద్దా వెంకన్న సహకారం పొందారు. వీరివురూ బొండా ఉమాతో మంతనాలు చేసి సెంట్రల్‌కు చెందిన ఎరుబోతు రమణ పేరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తను పొలిట్‌బ్యూరో సభ్యుడినని, తన లెటర్‌హెడ్‌తో పంపుతున్న ప్రతిపాదనకు ప్రాధాన్యం ఉంటుందని ఎరుబోతు రమణకే పదవి దక్కుతుందని బొండా భరోసా ఇచ్చారంటున్నారు. ♦పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీది మూడుముక్కలాట అయ్యింది. బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, జలీల్‌ఖాన్‌లు ఒక్కటయ్యారు. పార్టీ అవసరాల దృష్ట్యా 8 నెలల కిందట ఆ నియోజకవర్గాన్ని చూడాలని కేశినేని నానికి చంద్రబాబు బాధ్యత అప్పగించారు. దీంతో కార్పొరేట్ అభ్యర్థులను కూడా ఎంపీనే ఎంపికచేశారు. తమ నియోజకవర్గంలో ఆయన పెత్తనమేంటంటూ బుద్దా, మీరాలు ఒక్కటై మనలో ఎవరో ఒకరం ఇన్చార్జులుగా ఉండాలే తప్ప మరొకరి జోక్యాన్ని అంగీకరిచకూడదనే అవగాహనకు వచ్చారు. నగరంలో ఎంపీ వ్యతిరేకవర్గీయులను ఏకతాటిపైకి తీసుకురావడంలోనూ వారివురూ పావులు కదుపుతున్నారు. అంతకుముందు బుద్దా, కేశినేనిల మధ్య సోషల్‌మీడియాలో వార్ జరిగిన సంగతి తెలిసిందే. ♦ఎంపీ కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తించిన కొమ్మారెడ్డి పట్టాభిరాం అక్కడ విభేదించి క్రమంగా పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చేరుకున్నారు. తనదైన శైలిలో లోకేష్‌కు సన్నిహితంగా మెలుగుతూ కేశినేనికి నగరంలోని నాయకులు దూరమయ్యారనే వ్యతిరేక ప్రచారంతో అనునిత్యం పావులు కదుపుతూ పట్టాభి తీరికలేకున్నారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ♦లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నందిగామ పార్టీ ఇన్చార్జి తంగిరాల సౌమ్య రాజకీయ అవసరాల రీత్యా ఉమాతో మైత్రి కొనసాగించక తప్పదు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, తిరువూరు నాయకులు స్వామిదాసు తదితరులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాత్రం కేశినేనితో సాన్నిహిత్యం కలిగి ఉన్నారని పారీ్టవర్గాలు అంటున్నాయి. పలకరింపూ లేదాయె... తూర్పు నియోజకవర్గంతో పాటు నగరంలో ఏ ముఖ్య కార్యక్రమానికైనా, సంఘటన జరిగినా కేశినేని శ్వేత తప్పకుండా వెళ్లేవారు. తూర్పు పరిధిలో ఉన్న పట్టాభిపై దాడి జరిగినా ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత అటువైపు కన్నెత్తి చూడలేదు. పట్టాభితో సరిపడకపోయినా తాజా పరిణామాల నేపథ్యంలో బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా వర్గం తీరిగ్గా పరామర్శకు ఇంటికి వెళ్లడం పరిశీలనాంశం. మూడు ముక్కలైన ‘టీం విజయవాడ’! విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నాయకులతో ‘టీం విజయవాడ’ పేరిట ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు నిన్న మొన్నటివరకు కేశినేని భవన్‌పై ఉండేవి. తాజాగా నగర పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరుల ఫొటోలు ఆ టీంలో లేకపోవడం కొసమెరుపు. (చదవండి: మరింత వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..) టీడీపీ కార్యకర్తల అరాచకం -
‘దేవినేని నీచరాజకీయాలు చేస్తున్నారు’
-
‘వ్యక్తిగత చనువుతోనే ఆయనతో రాజకీయాలు మాట్లాడాను’
సాక్షి, అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలియడంతోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ హోంమంత్రి, వైఎస్సార్సీపీ నేత వసంత నాగేశ్వరరావు విమర్శించారు. వ్యక్తిగత పరిచయంతోనే గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నర్సింహారావుతో రాజకీయాలు మాట్లాడానని, అంతే కానీ ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదన్నారు. అధికార బలంతో బెదిరించి గుంటుపల్లి ఈఓ చేత నాపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నర్సింహారావు మా సొంత గ్రామంలో పనిచేశారు. ఆయనతో నాకు చాలా చనువు ఉంది. గుంటుపల్లిలో వైఎస్సార్సీపీ బ్యానర్లను, జెండాలను ఏకపక్షంగా తొలగిస్తున్నారని గ్రామస్తుల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో ఈఓ నర్సింహారావు అక్కడే ఉన్నట్లు తెలియడంతో ఆయనకు ఫోన్ చేశా. పాత పరిచయం ఉండటంతో రాజకీయాలు మాట్లాడాను. అదే చనువుతో ఆయన కుటుంబం, పిల్లల గురించి అడిగాను. దానిని ఇంత నీచంగా చిత్రీకరిస్తారా? నోను ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు కాల్ రికార్డింగ్‌ను వక్రీకరించారు. నా అనుమతి లేకుండా కాల్ రికార్డు చేయడం ఎంత వరకు సమంజసం‘ అని వసంత నాగేశ్వరరావు ప్రశ్నించారు. మైలవరం నియోజక వర్గంలో వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజామద్దతు దేవినేని తట్టుకోలేకనే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ జెండాలు తీయించడం, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని మండి పడ్డారు. మంత్రి దేవినేని అవినీతిని తన కుమారుడు కృష్ణ ప్రసాద్ ప్రజల్లో ఎండగడుతున్నారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో బ్యానర్ల విషయంపై మాట్లాడటానికి ఫోన్ చేసిన నాగేశ్వరరావు, ఈవోని బెదిరించాడని టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నాగేశ్వరరావుపై కేసు కూడా పెట్టారు. -
రేవంత్‌పై సమాధానం దాటవేసిన దేవినేని
-
రేవంత్‌పై సమాధానం దాటవేసిన దేవినేని
సాక్షి, విజయవాడ: ఊహించినట్లుగానే తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి విమర్శలపై నోరు విప్పాలంటేనే వారు వణికి పోతున్నారు. ఆయన సూటిగా లేవనెత్తిన అంశాలకు వారి దగ్గర సమాధానం లేకుండాపోయింది. ప్రస్తుతం ఆ పార్టీలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రేవంత్ విషయంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించడానికి వెనకడుగు వేశారు. రేవంత్ రెడ్డి ఏపీ మంత్రులపై చేసిన ఆరోపణల విషయంలో ఎలా స్పందిస్తారని ప్రశ్నించిన మీడియాకు ఉమ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఆయన చేస్తున్న విమర్శలపై సమాధానం దాట వేశారు. రేవంత్ విమర్శలను తమ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుతుందని ఆయన తప్పించుకున్నారు. -
'మంత్రి దేవినేనిని బర్తరఫ్ చేయండి'
హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల దోపిడీ జరుగతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. నగరంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాయడమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. ప్రభుత్వ అవినీతిని సొంత పార్టీ ఎంపీనీ ప్రశ్నించారు.. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. వాటాలో లెక్కలు తేలక ఒకరి దోపిడీ మరొకరు బయట పెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. దోపిడీపై విచారణ చేయించే ధైర్యం మీకుందా అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు నేరుగా సవాల్ విసిరారు. కాంట్రాక్టు కంపెనీలను తక్షణమే బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలన్నారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ అధికారులను వేధిస్తున్నారంటూ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.