మొబైల్ ఫోన్లకూ నాణ్యతా ప్రమాణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డైటీ) కొత్త అధ్యాయానికి తెరతీసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) రిజిస్ట్రేషన్ తప్పనిసరి జాబితాలో మొబైల్ ఫోన్లనూ చేర్చింది. దీని ప్రకారం బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గట్టుగా కంపెనీలు నాణ్యమైన మోడళ్లను తయారు చేయాల్సిందే. భారత్‌లో విక్రయించాలనుకున్న ప్రతి మోడల్‌ను దేశ, విదేశీ కంపెనీలు బీఐఎస్ వద్ద నమోదు చేయించాలి.
నాణ్యత ఉంటేనే విక్రయించుకునేందుకు బ్యూరో అనుమతిస్తుంది. డైటీ జాబితాలో మొబైల్స్‌తోపాటు పవర్ బ్యాంక్స్, చార్జర్లు, యూపీఎస్/ఇన్వర్టర్లు, ఆల్కలైన్ బ్యాటరీలు వంటి 15 ఉత్పత్తులు చేర్చారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వీడియో గేమ్స్, ల్యాప్‌టాప్, నోట్‌బుక్, ట్యాబ్లెట్ పీసీలు వంటి 15 రకాల ఉత్పత్తులు జాబితాకెక్కాయి. తాజాగా ప్రకటించిన ఉత్పత్తులకు ఆరు నెలల గడువిచ్చారు. ఈలోపు బీఐఎస్ ప్రమాణాలకు తగ్గట్టుగా కంపెనీలు తయారీ విధానాన్ని మార్చుకోవాల్సిందే.