breaking news
Degree syllabus Changes
-
డిగ్రీ సిలబస్‌లో మార్పులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) మార్గదర్శకాల మేరకు డిగ్రీ కోర్సుల్లో అమలవుతున్న చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబీసీఎస్) పటిష్టత, ప్రమాణాలు మెరుగుపడే రీతిలో సిలబస్‌లో మార్పులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రెండు రోజులుగా సమావేశమై చర్చలు సాగించింది. ఆయా వర్సిటీల డీన్ల అభిప్రాయాలను తెలుసుకుంది. కాలేజీల లెక్చరర్లు, విద్యార్థులు, ఇతర విద్యారంగ నిపుణులతోనూ చర్చించి సిలబస్‌లో మార్పులు చేయడంతోపాటు ప్రస్తుత సీబీసీఎస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి సూచనలు చేయనుంది. కమిటీ తొలి భేటీ ఇలా..: డిగ్రీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ విధానాన్ని యూజీసీ 2015–16 నుంచి అమల్లోకి తెచ్చింది. దీనిపై మార్గదర్శకాలు విడుదల చేసి ఐదేళ్లపాటు అమలయ్యేలా గడువు నిర్దేశించింది. ఈ గడువు 2020 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీబీసీఎస్ విధానాన్ని సమగ్రంగా సమీక్షించి వాటిలోని లోటుపాట్లను సవరించి మరింతగా పటిష్టం చేసేందుకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (నెల్లూరు) మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ జి.రాజారామిరెడ్డి చైర్మన్‌గా ఏడుగురు ఉన్నత విద్యారంగ నిపుణులతో ఉన్నత విద్యామండలి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తొలి భేటీ మంగళ, బుధవారాల్లో విజయవాడలోని మండలి కార్యాలయంలో జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, కమిటీ చైర్మన్ జి.రాజారామిరెడ్డి, ప్రొఫెసర్ ఎన్.కిషోర్‌బాబు(ఆంధ్రావర్సిటీ), ప్రొఫెసర్ కె.త్యాగరాజు(ఎస్వీ వర్సిటీ), డాక్టర్ జి.శ్రీరంగం మాథ్యూ(ఆంధ్రాలయోలా కాలేజీ, విజయవాడ), డాక్టర్ బీ.ఆర్.ప్రసాదరెడ్డి (అసోసియేట్ ప్రొఫెసర్, ధర్మవరం), మెంబర్ కన్వీనర్లు డాక్టర్ కె.వి.రమణారావు(రిటైర్డ్ ప్రిన్సిపాల్), బి.ఎస్.సెలీనా(లెక్చరర్, అకడమిక్ సెల్, ఏపీఎస్సీహెచ్ఈ) పాల్గొన్నారు. అమలు తీరుపై డీన్లతో చర్చ..: ఆయా వర్సిటీలలోని అకడమిక్ అఫైర్స్ డీన్లతో కమిటీ చర్చించింది. ఐదేళ్లక్రితం సీబీసీఎస్ విధానం ఎలా ప్రారంభించారు? ఇప్పుడెలా అమలవుతోంది? అన్న అంశాల్ని తెలుసుకుంది. ప్రస్తుత సీబీసీఎస్ విధానంలో మార్పులుచేర్పులు అవసరమా? అడ్వాన్సు చేయాలా? కొత్తగా వస్తున్న పరిణామాలకు అనుగుణంగా ఏయే నూతన అంశాల్ని సిలబస్‌లో చేర్చాల్సి ఉంటుందో నివేదించారు. కాగా, బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల సిలబస్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు సబ్జెక్టు కమిటీల్ని ఏర్పాటు చేయనున్నారు. -
డిగ్రీ తెలుగులో ఆధునిక కవులకు పెద్దపీట
* సిలబస్‌లో మార్పులు ఖరారు * ఉన్నత విద్యామండలికి కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: డిగ్రీ సిలబస్ మార్పుల్లో భాగంగా ద్వితీయ భాష తెలుగులో తెలంగాణకు చెందిన ఆధునిక కవులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేష్, సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.గోపి మంగళవారం జరిగిన సమావేశంలో డిగ్రీ తెలుగు సిలబస్‌లో తేనున్న మార్పులను ఓకే చేశారు. అనంతరం సిలబస్ కమిటీ నివేదికను ఉన్నత విద్యామండలికి అందజేసింది. తెలంగాణకు చెందిన ప్రాచీన కవుల రచనలు, కథానికలకు పెద ్దపీట వేస్తూనే ఇప్పటివర కు ఏ సిలబస్‌లోనూ లేని తెలంగాణ కవులకు ఇందులో స్థానం కల్పించింది. వారి రచనలు, ప్రత్యేకతలను వివరిస్తూ పాఠ్యాంశాలుగా పొందుపరిచింది. ఇదే కమిటీ సిలబస్‌లో తీసుకురానున్న మార్పులకు అనుగుణంగా కవులు, రచయితల రచనలతో పాఠ్యాంశాలను పొందుపర్చి డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ తెలుగు పుస్తకాలను కూడా రాసింది. ఈ పుస్తకాలు 2015-16 విద్యా సంవత్సరంలో అమల్లోకి రానున్నాయి. సమావేశం సందర్భంగా అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య మృతికి తెలంగాణ ఉన్నత విద్యామండలి సంతాపం వ్యక్తం చేసింది. సిలబస్ కమిటీ సమావేశంలోనూ ఈ మేరకు తీర్మానం చేసింది. పాఠ్య పుస్తకాల్లో చోటు కల్పించిన ఆధునిక రచయితలు, కవులు ⇒ వేణుగంటి నర్సింహాచార్యులు (బుద్ధుని ఉపదేశం రచయిత) ⇒ శంషోద్దీన్ (కలంపేరు కౌముది, రచన అల్విదా) ⇒ పల్లా దుర్గయ్య (ఉస్మానియా యూనివర్సిటీ మొదటి పీహెచ్డీ చేశారు) ⇒ గడియారం వెంకట శేషశాస్త్రి ⇒ కవిరాజ మూర్తి (రచన, మానవ సంగీతం) ⇒ నెల్లూరి కేశవస్వామి (హైదరాబాద్ కథలు) ⇒ నీలగిరి ఇందిర (ఇది ఒక కలే) ⇒ రాఘవరావు (రుద్రమదేవిపై పూర్తిగా తెలంగాణ మాండలికంలో కథానిక) ⇒ ఇన్నాళ్లు రాజకీయ నాయకునిగానే చూసిన బూర్గుల రామకృష్ణారావును రచయితగా (తెలుగు భాషపై ఉర్దూ ప్రభావం)పేర్కొంది. వీరితోపాటు మరింత మంది రచనలు, కవితలకు డిగ్రీ సిలబస్‌లో చోటు కల్పించారు.