breaking news
Dance Director
-
బ్రిటన్ పార్లమెంట్లో పన్నెండుసార్లు
పదం పలికితే పరవశం. పాదం కదిలితే అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నాట్య వేదికలపై నర్తించి విశ్వవాప్తంగా గుర్తింపు పొందారామె. భారతీయ కళలకు సుపరిచితమైన చిరునామా ఆమె. ఐదో ఏటనే నాట్యంలో అరంగ్రేటం, ఆ పిదప భరతనాట్య శైలిలో మహిళల సాధికారత అంశాలను అక్కున చేర్చుకున్నారు. నర్తిస్తూ, బోధిస్తూ, నృత్య దర్శకత్వం వహిస్తూ నాట్యశాస్త్రం అధ్యయనం చేస్తూ హైదరాబాద్ నగర ఖ్యాతిని ఖండాంతరాలకు చేరుస్తున్నారామె. నగరంలోని చిక్కడపల్లికి చెందిన రాగసుధ.. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న ఆమె, ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసి తన నృత్యంతో ఆకట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న రాగసుధ సోమవారం ‘సాక్షి’తో ముఖాముఖీ మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ.. సాక్షి: నాట్యం ఏ వయసులో నేర్చుకున్నారు? రాగసుధ: ఐదో ఏట నుంచే నృత్యంలో అడుగు పెట్టా. నాన్న వింజమూరి శేషాచార్యులు సాహిత్య అభిరుచి ఉన్నవారు. లలిత కళలు, సాహిత్య అంటే అమితంగా ఇష్టపడతారు. నన్ను నృత్యం చేర్చుకోమన్నారు. సాక్షి: భరతనాట్యానికి సంబంధించిన కోర్సులేమైనా చేశారా? రాగసుధ: హైదరారాబాద్ నగరంలోని రాంకోఠిలో ఉన్న త్యాగరాజ మ్యూజిక్ కళాశాలలో డిప్లొమా కోర్సు చేశాను. ఆ తర్వాత ప్రముఖ నృత్య గురువు డాక్టర్ ఉమారామారావు దగ్గర శిక్షణ పొందాను. నృత్య మెలకువలు నేర్చుకున్నాను. సాక్షి: మీ గురువు గారితో కలిసి నృత్యం చేసిన సందర్భాలు ఉన్నాయా? రాగసుధ: తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో ‘నృత్య నీ రాజనం’ కార్యక్రమ ప్రారంభ నృత్యం డాక్టర్ శోభానాయుడు చేశారు. ఆ తర్వాత మూడోరోజు నృత్య గురువు డాక్టర్ ఉమా రామారావుతో కలిసి అత్యంత క్లిష్టమైన శ్రీనివాస గద్యం చేశాను. ఆ కలియుగ దైవం వేంకటేశ్వరుడి ఆశీస్సులతో బ్రిటిష్ పార్లమెంట్లో నృత్యం చేసే దాకా వెళ్లాను. సాక్షి: మీ నాట్య ప్రయాణం గురించి.. రాగసుధ: నేను హైదరాబాద్ చిక్కడపల్లి వాసిని. ఇక్కడే నృత్యం నేర్చుకొన్నా. ఇక్కడే వేదికలపై చాలాసార్లు నృత్య ప్రదర్శనలు చేశా. సంగీతంలో చాలా మంది కళాకారులు ఉన్నారని, నాన్న నృత్యం వైపు ప్రోత్సహించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మా గురువు డాక్టర్ ఉమా రామారావుతో కలిసి చాలాసార్లు నృత్యం చేశా. సాక్షి: మీ కుటుంబ వివరాలు చెబుతారా.. రాగసుధ: పదేళ్ల క్రితం లండన్ వెళ్లా. భర్త సునీల్ ప్రాజెక్ట్ మేనేజనర్. నేను యూనివర్సిటీ ఆఫ్ సండర్ ల్యాండ్‌లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా. అక్కడ కూడా చాలా మందికి డ్యాన్స్ నేర్పిస్తుంటా. ప్రపంచ తెలుగు మహాసభల్లో రెండోరోజు ప్రధాన వేదికపై నృత్యం చేశాను. సాక్షి: ఏయే అంశాలు ఇష్టపడతారు? రాగసుధ: ఆధ్యాత్మిక అంశాలపై నృత్యం ఇష్టపడతాను. అమ్మవారు అంటే శ్రీశక్తి అని అర్థం. రామదాసు, అన్నమయ్య, వేంకటేశ్వరుడిపై నృత్య ప్రదర్శనలు చేస్తుంటాను. సాక్షి: భరతనాట్యంలో ప్రస్తుత వింత పోకడలపై మీ అభిప్రాయం.. రాగసుధ: భరతనాట్యంలో వింత పోకడలు నిజమే. వాటిని జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. అమ్మవారి ఐటమ్ చేసేటప్పుడు ఉగ్రరూపం వచ్చినప్పుడు నాలుకను బయటకు వచ్చినట్లు దానికి ఎర్రటి రంగు ఉన్నట్లు చూపాలి. రక్తం వచ్చినట్లు అభినయం ప్రకటించాలి. ఎఫెక్ట్‌గా ఉండాలని నాలుక బయటకు తీసి దానికి రక్తపు ఛాయలో రంగు పూసుకొని చూపిస్తున్నారు. అభినయం కంటే ఎఫెక్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాక్షి: మీరు సాధించిన అవార్డులు.. రాగసుధ: గతేడాది ఉగాది నాడు స్విట్జర్లాండ్ తెలుగు సంఘాలు ‘నృత్య నగజా’ బిరుదును అందజేశాయి. యూకేలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వహించే డాక్టర్ సుమల్ నవంబర్‌లో ‘నృత్య కళా శిరోమణి’ ప్రకటించాయి. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ స్వరూపారాణి డాక్టర్ సి. నారాయణ రెడ్డి స్మారక పురస్కారం క్రింద సప్తపది నృత్య పురస్కారం అందజేశారు. సాక్షి: నాట్యంలో మీకు సంతృప్తి కలిగించిన సంఘటనలున్నాయా..? రాగసుధ: ప్రపంచంలోని ఏ దేశ మహిళలూ ఇంత వరకు బ్రిటన్ పార్లమెంట్లో 12 సార్లు నృత్య ప్రదర్శనలు చేయలేదు. ఒక్క తెలుగు మహిళగా, హైదరాబాద్ మహిళగా ఆ అవకాశం నాకే దక్కింది. ఇది నిజంగా ప్రపంచ రికార్డు. బ్రిటన్ పార్లమెంట్లో సామాజిక అంశాలపై నృత్య ప్రదర్శనలు చేశా. ఆయుర్వేదం, వాస్తు శాస్త్రం, బేటీ బచావో, టాగూర్ భావజాలం, మైథిలీ భాషలో శ్రీకృష్ణ లీలలపె నృత్యం చేశా. మహిళల సాధికారతపై సీతమ్మ నుంచి, నేవీ అధికారి రాధిక మీనన్ వరకు అందరి గురించి నృత్యం రూపంలో వివరించా. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు లండన్ పార్లమెంట్ వద్దకు వచ్చినపుడు శివలీలలుపై నృత్య ప్రదర్శన చేశాను. ఈ రికార్డు సాధించిన తొలి తెలుగు మహిళను కావడం సంతోషంగా ఉంది. దీంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నా. -
లారెన్స్‌కు నో చెప్పిన కాజల్
ప్రముఖ నృత్యదర్శకుడు లారెన్స్ ఇప్పుడు నటుడుగా, దర్శకుడుగా, నిర్మాత గానూ మంచి ఫామ్‌లో ఉన్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంచన, కాంచన-2 చిత్రాల విజయాలే అందుకు నిదర్శనం. అలాంటి లారెన్స్ చిత్రంలో నటించడానికి నటి కాజల్‌అగర్వాల్ నో చెప్పడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి కాజల్‌కు కోలీవుడ్‌లో సాధించిన విజయాల సంఖ్య వేళ్లలోనే. తొలి విజయాన్ని నాన్‌మహాన్ అల్ల చిత్రంతో చాలా పోరాటం తరువాత అందుకున్నారు. అయినా తమిళసినిమా ఈ అమ్మడిని దూరంగా పెట్టింది. అలా చాలా గ్యాప్ తరువాత విజయ్‌తో జత కట్టిన తుపాకీ, జిల్లా చిత్రాల విజయాలు కాజల్ ఖాతాలో పడ్డాయి. ఆ తరువాత మళ్లీ గ్యాప్. కారణం అధిక పారితోషికం డిమాండ్, చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనక పోవడం అన్నది కోలీవుడ్ వర్గాల వెర్షన్. కొంత కాలం తరువాత ఇటీవల రీఎంట్రీ అయ్యారు. ధనుష్ సరసన మారి, విశాల్‌కు జంటగా పాయంపులి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. త్వరలో విక్రమ్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరిగినా ఇప్పుడా చిత్రమే డ్రాప్ అంటున్నారు పరిశ్రమ వర్గాలు. సో కాజల్ డైరీ కోలీవుడ్‌లో నిల్ అన్నమాట. ఇలాంటి సమయంలో హిట్ చిత్రాల నటుడు,దర్శకుడు నిర్మాత లారెన్స్ నుంచి అవకాశం వస్తే కాజల్ అందుకోకపోవడం చర్చనీయాంశం అవడం సహజమేగా. ఇక్కడ విషయం ఏమిటంటే లారెన్స్ తన తమ్ముడు ఎల్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నాయకి అయితే బాగుంటుందని కాజల్‌అగర్వాల్‌ను సంప్రదించారు. అయితే పెద్ద హీరోలతోనే నటించాలని నిర్ణయించుకున్నానన్న సాకుతో ఆమె నో చెప్పారట. పారితోషికం విషయంలో సంశయిస్తుందేమేన్న ఆలోచనతో లారెన్స్ రెండు కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం అన్నా కాజల్ సారీ అన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.