breaking news
damages road
-
మరమ్మతులు లేక రోడ్లు నీళ్లపాలు
సాక్షి, హైదరాబాద్: అసలే నిధులు లేక రోడ్ల నిర్వహణ అధ్వానంగా మారిన తరుణంలో... భారీ వర్షాలు రోడ్లను తీవ్రంగా దెబ్బతీశాయి. కొన్నేళ్లుగా మరమ్మతులు లేక రోడ్ల తారుపూత బలహీనంగా మారటంతో, భారీ వర్షాలకు కొట్టుకుపోతున్నాయి.ఈ వానాకాలంలో ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలతో రోడ్లకు రూ.1,543 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 1,641 కి.మీ. మేర రోడ్డు ఉపరితల భాగం దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 1,500 ప్రాంతాల్లో రోడ్లకు నష్టం వాటిల్లింది. గత నెలలో కురిసిన అతి భారీ వర్షాలతో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లగా, తాజా తుపాను ప్రభావంతో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ తుపానుతో 400 ప్రాంతాల్లో రోడ్లకు నష్టం వాటిల్లినట్టు శుక్రవారం రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. 241 కి.మీ. మేర రోడ్ల ఉపరితల తారు పూత కొట్టుకుపోయినట్టు పేర్కొంది. 15 ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. 74 కల్వర్టులు, వంతెనలకు నష్టం వాటిల్లింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా రోడ్లకు మరమ్మతు చేసేందుకు రూ.9.95 కోట్లు అవసరమవుతాయని, శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు చేసేందుకు రూ.265.43 కోట్లు అవసరమవుతాయని ఆ నివేదికలో పేర్కొంది. ఐదేళ్లకోసారి మరమ్మతులు చేయాల్సి ఉన్నా... సాధారణంగా రోడ్లకు ప్రతి ఐదేళ్లకోమారు మరమ్మతులు చేయాలి. ఇది భారీ వ్యయంతో కూడుకున్న పని కావటంతో ఎనిమిదేళ్లకోసారైనా చేయాలన్న అభిప్రాయాన్ని ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది. కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఒక్కసారి కూడా రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు జరగలేదు. మూడేళ్ల క్రితం నాటి ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనా, ఎన్నికలు ముంచుకురావటంతో అది పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. కొన్ని రోడ్లకే పనులు పరిమితమయ్యాయి.అప్పటికే కాంట్రాక్టర్లకు పాత బకాయిలు రూ.1,000 కోట్లకు పైగా ఉండటం, కొత్తగా నిధులు విడుదల చేయటం కష్టంగా మారటంతో మరమ్మతులు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో గతేడాది, ఈసారి రికార్డు స్థాయి వర్షపాతం నమోదవటంతో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరమ్మతులు జరిగితే, వరద పోటును రోడ్లు కొంతమేర అయినా తట్టుకుంటాయి. అవి లేక తారుపూత బలహీనంగా మారి, అది కొట్టుకుపోయి రోడ్లకు కోత తప్పడం లేదు. ఇప్పటికిప్పుడు రూ.8 వేల కోట్లకుపైగా వ్యయం చేస్తే తప్ప రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే అవకాశం లేదు. ఇంత పెద్ద మొత్తం కేటాయించటం ఖజానాకు కష్టంగా మారింది. కేంద్ర సాయం కోసం ఎదురుచూపు భారీ వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది. అయితే గతేడాది తెలంగాణలో రోడ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసిన కేంద్రం సాయాన్ని మాత్రం విడుదల చేయలేదు. అప్పట్లో భారీ వర్షాలకు జరిగిన నష్టం రూ.2,300 కోట్లుగా అంచనా వేశారు. కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని పరిశీలించి వెళ్లినా, నిధులు రాలేదు. 20 రోజుల క్రితం ఈ దఫా నష్టాన్ని అంచనా వేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు బృందాలు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు వెళ్లి రోడ్లకు జరిగిన నష్టాన్ని పరిశీలించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,400 కి.మీ. మేర 1,100 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్టు రాష్ట్ర అధికారులు వారికి వివరించారు.వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.75 కోట్లు ఖర్చు చేశామని, శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు చేయటానికి రూ.1,278 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అనుసరించి రూపొందించిన ఈ అంచనా కంటే రాష్ట్ర ప్రభుత్వ అంచనా మరింత ఎక్కువగా ఉండనుందని అధికారులు పేర్కొంటున్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేసి పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు రూ.2,400 కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులు పోను, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.కానీ, ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఊరట సమాచారం అందలేదు. ఇంతలోనే తుపాను ప్రభావంతో మళ్లీ రోడ్లకు నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు మళ్లీ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోపు పూర్తి నష్టం వివరాలతో కేంద్రానికి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ⇒ జాతీయ రహదారులకు రూ.35 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు ఆ విభాగ అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.8 కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొంటున్నారు. ఈ రోడ్ల మరమ్మతుకు ఎలాగూ కేంద్ర నిధులే వాడనున్నందున రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉండబోదు. తాజా తుపాను ప్రభావంతో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాలు ⇒ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు మొత్తం రోడ్లు కొట్టుకుపోయిన ప్రాంతాలు: 400 రోడ్ల ఉపరితల తారు ధ్వంసమైన నిడివి: 241 కి.మీ. రోడ్లు భారీ కోతకు గురైన ప్రాంతాలు: 15 రోడ్ల మీదుగా వరద పోటెత్తిన ప్రాంతాలు: 258 నష్టం వాటిల్లిన కల్వర్టులు, వంతెనలు: 74 -
కొంప కూల్చేసింది.. రోడ్డు చిత్తడి చేసింది
డార్జిలింగ్: ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా ఓ కుటుంబం సర్వం కోల్పోయింది. ఓ భారీ కొండచరియ వారి ఇంటిని నేలమట్టం చేసింది. దాని దాటికి ఇళ్లు నామరూపాల్లేకుండా పోయింది. దీనికితోడు ఆ ఇంటి పక్కనే ఉన్న ప్రధాన రహదారి కూడా ధ్వంసమైంది. డార్జిలింగ్ జిల్లాలోని కలింపాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిక్కింను కలింపాంగ్ ప్రాంతానికి కలిపే ఏకైక రహదారి ఇదే కావడంతో భారీ స్థాయిలో విరుచుకుపడిన కొండచరియల కారణంగా దాదాపు 300 మీటర్ల ప్రధాన రహదారి దెబ్బతిన్నది. దీంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, నష్టం భారీ స్థాయిలో కనిపిస్తున్న ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.


