breaking news
Dalit youth killed
-
మాముందే గుర్రంపై తిరుగుతావా
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఉనాలో దళిత యువకులపై దాడిని మర్చిపోకముందే ఆ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. దళిత యువకుడు ప్రదీప్ రాథోడ్(21) గుర్రాన్ని కొనుగోలుచేసి దానిపై తిరగడాన్ని తట్టుకోలేని కొందరు రాజ్‌పుత్ వర్గీయులు అతన్ని గురువారం దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన భావ్‌నగర్‌లో జిల్లాలోని తింబీ గ్రామంలో చోటుచేసుకుంది. ఇటీవల కొత్త గుర్రాన్ని కొనడంతో ప్రదీప్‌పై రాజపుజ్ వర్గీయులు కొందరు పగ పెంచుకున్నారనీ, గుర్రాన్ని అమ్మేయకుంటే చంపేస్తామని బెదిరించారని మృతుని తండ్రి కాలూభాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలం నుంచి గుర్రంపై తిరిగొస్తుండగా ప్రదీప్‌పై పదునైన ఆయుధాలతో దాడిచేసి హత్యచేశారన్నారు. కాలూభాయ్ ఫిర్యాదుతో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు భావ్‌నగర్ డీఎస్పీ ఏఎం సయాద్ మీడియాకు తెలిపారు. -
అంబేద్కర్ రింగ్‌టోన్ పెట్టుకున్నాడని చంపేశారు
షిరిడీ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు సంబంధించిన పాటను తన ఫోన్ రింగ్ టోన్గా పెట్టుకున్నాడనే కారణంతో ఓ దళిత యువకుడిని షిరిడీలో చావకొట్టారు. మే 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లగా.. సాగర్ షెజ్వాల్ (21) అనే దళిత యువకుడు నర్సింగ్ చదువుతున్నాడు. షిరిడీలో ఓ వివాహ కార్యక్రమానికి మే 16న హాజరయ్యాడు. సరిగ్గా మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో అతడు మరో వరుసకు సోదరులయ్యే ఇద్దరు వ్యక్తులతో కలిసి ఓ షాపులో కూర్చున్నాడు. అదే సమయంలో అతడికి ఫోన్ రాగా దానికి రింగ్ టోన్గా అంబేద్కర్‌ను ఉద్దేశించిన పాట అయిన కారా కితిహీ హల్లా మజ్ బూత్ బీమచా కిల్లా (మీరంతా కోరుకుంటే గట్టిగా గర్జించండి.. భీమ్ దుర్గం చాలా దృఢమైనది) వచ్చింది. దీంతో అక్కడే కూర్చున్న ఎనిమిదిమంది వ్యక్తులు కలిసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంటూ బెదిరించారు. ఆ క్రమంలో వాగ్వాదం నెలకొని బీర్ బాటిల్ తీసుకొని సాగర్ తలపై బలంగా కొట్టారు. అనంతరం పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తొక్కేశారు. ఆ తర్వాత బయటకు ఈడ్చుకెళ్లి బైక్‌పై పడేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. అక్కడ బైక్‌తో పలుమార్లు తొక్కించారు. అంతటితో ఆగకుండా ఓ బండరాయిని తీసుకొని పాశవికంగా అతడి దేహాన్ని చిద్రం చేసి వెళ్లిపోయారు. అతడి తరుపు బంధువుల ఫిర్యాదు మేరకు గాలింపులు చేపట్టిన పోలీసులకు షింగ్వే అనే గ్రామం వద్ద సాగర్ మృతదేహం లభించింది. కానీ, అతడి ఫోన్ మాత్రం లభించలేదు. అయితే, నిందితులను అరెస్టు చేసేందుకు షాప్ వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజీ సహాయపడింది. దాని ఆధారంగా ఇద్దరిని గోవాలో ఒకరిని పుణెలో, మరొకరిని షిరిడీలో అరెస్టు చేశారు. మరో నలుగురిని అరెస్టు చేయాల్సి ఉంది. దాడికి పాల్పడిన వారంతా కూడా డామినెట్ మరాఠా, ఓబీసీ కులాలకు చెందినవారిగా పోలీసులు తెలిపారు.