breaking news
CVPS
-
ఇటుకలుగా రద్దయిన నోట్లు
న్యూఢిల్లీ: రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను ముక్కలు చేసి ఇటుకలు (బ్రిక్స్)గా మారుస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా పీటీఐ కరెస్పాండెంట్ అడిగిన సమాచారాన్ని ఈ మేరకు వెల్లడించింది. ‘రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను లెక్కించి, అధునాతన కరెన్సీ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ సిస్టమ్ (సీవీపీఎస్) ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం. పలు ఆర్బీఐ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ష్రెడ్డింగ్, బ్రిక్వెట్టింగ్ యంత్రాల ద్వారా ముక్కలు చేసి బ్రిక్స్‌గా మారుస్తున్నాం’ అని వివరించింది. బ్రిక్స్ తయారు చేసిన వెంటనే టెండర్లు పిలిచి విక్రయిస్తున్నామని తెలిపింది. -
ఎవరెస్టు.. చిన్నబోయేటట్టు..
ఎవరెస్టు ఎత్తుతో పోలిస్తే దీని ఎత్తు 300 రెట్లు ఎక్కువ.. పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసేశారు. చలామణిలో ఉన్న కరెన్సీ విలువలో ఇది 86 శాతం.. అంటే 2,203 కోట్ల నోట్లు.. మీకో విషయం తెలుసా? ఈ కరెన్సీ కొండ ముందు ఎవరెస్టు కూడా చిన్నబోవాల్సిందే. ఎందుకంటే.. ఈ నోట్లను ఒకదానిపై ఒకటి పెడితే.. ఎవరెస్టు ఎత్తుకు 300 రెట్లు ఎక్కువుంటుందట. ఒకదాని పక్కన ఒకటి రోడ్డులా పరిస్తే.. చంద్రుడి వద్దకు ఐదుసార్లు వెళ్లిరావచ్చట. అసలు రద్దయిన నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుంది? విభజించు.. 2001 వరకూ వాటిని తగులబెట్టేవారు. తర్వాత నుంచి పర్యావరణ అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు. 2003 నుంచి రద్దయిన, పాడైపోయిన నోట్లను వేగంగా ప్రాసెస్ చేయడానికి కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్లను (సీవీపీఎస్) పెట్టారు. అప్పటి గవర్నర్ బిమల్ జలాన్ హయాంలో ఇవి వచ్చాయి. ఒక్కో సీవీపీఎస్ గంటకు 60 వేల నోట్లను ప్రాసెస్ చేస్తుంది. బాగున్న నోట్లను జాగ్రత్తగా కట్ చేసి.. వాటిని కొత్త కరెన్సీ పేపర్ తయారీలో వాడతారు. విక్రయించు.. బాగోలేని, పనికిరాని నోట్లను కంప్రెస్ చేసి.. ఇటుకలుగా, బ్లాకులుగా మారుస్తారు. వీటిని పారిశ్రామిక అవసరాల నిమిత్తం విక్రయిస్తారు. ఇందుకోసం ఆర్బీఐ టెండర్లను పిలుస్తుంది. కిలో రూ.5–6 మధ్య విక్రయిస్తారు. వీటిని కొన్ని కంపెనీలు ఫర్నేస్‌లను మండించడానికి వాడతాయి. మరికొన్ని సాఫ్ట్ బోర్డుల తయారీకి వినియోగిస్తాయి. అంతేకాదు.. క్యాలెండర్లు, ఫైళ్లు, సావనీర్లు, పేపర్ వెయిట్లుగా వీటిని మారుస్తారు. – సాక్షి, తెలంగాణ డెస్క్